న్యూఢిల్లీలో నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్) కొలువై ఉన్న తీన్‌మూర్తి భవన్ స్వరూపస్వభావాలను మార్చాలనుకుంటున్న ఎన్‌డీఏ ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని, దీన్ని విరమించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా పనిచేసినప్పుడు నెహ్రూ తీన్‌మూర్తి భవన్‌లోనే ఉండేవారు. 1964లో నెహ్రూ కన్నుమూ శాక ఆయన స్మృతిలో ఎన్‌ఎంఎంఎల్ ఏర్పాటుచేసి తీన్‌మూర్తి భవన్ ప్రాంగణాన్ని అందుకు కేటాయించారు. మహానగరం నడిబొడ్డున 25 ఎకరాల విశాల ప్రాంగణంలో అది కొలువుదీరింది. ఎన్‌ఎంఎంఎల్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థే అయినా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది.
నవ భారత నిర్మాతగా దేశంపైనే కాదు...ప్రపంచంపై కూడా చెరగని ముద్రేసిన నెహ్రూను, ఆధునిక భారత చరిత్రను అధ్యయనం చేయటం కోసం దీన్ని స్థాపించినా ఇందులో మహాత్మా గాంధీ రచనలతోపాటు రాజగోపాలాచారి, సరోజినీ నాయుడు, బీసీ రాయ్, జయప్రకాష్ నారాయణ్ తదితరుల వ్యక్తిగత పత్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంగ ణంలో నెహ్రూ ప్లానిటోరియం, నెహ్రూ స్మారక డిజిటల్ లైబ్రరీ, నెహ్రూ స్మారక నిధి వంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రాంగణంలో తదనంతర కాల ప్రధానులకు కూడా చోటు కల్పించాలని ఎన్‌ఎంఎంఎల్ సొసైటీ కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. దీనిపై సర్వసభ్య సమావేశంలో వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగి తుది నిర్ణయం వాయిదా పడింది.
ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానికి లేఖ రాశారు. తమ దేశ నిర్మాణానికి కృషి చేసి దానికొక స్వరూపాన్నివ్వడానికి అహర్నిశలూ శ్రమపడిన నాయకులను గుర్తుంచుకోవటం, వారి వారసత్వం భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు అనువైన ఉన్నత స్థాయి సంస్థలను నెలకొల్పటం ఏ దేశం లోనైనా ఉండేదే. అయితే తీన్‌మూర్తి భవన్ ప్రాంగణంలో ఇతర ప్రధానులకు చోటు కల్పించటం నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించినట్టవుతుందా అన్నది ప్రధాన ప్రశ్న. నెహ్రూ పట్ల బీజేపీకి, దాన్ని నడిపిస్తున్న సంఘ్ పరివార్‌కు ఉండే అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. అందువల్లే తాజా ప్రయత్నాన్ని కాంగ్రెస్ శంకిస్తోంది. అయితే బీజేపీ నేతల వాదన వేరుగా ఉంది. అది ప్రధానికి కేటాయించిన ప్రాంగణం తప్ప నెహ్రూకు కేటాయించింది కాదని...పైగా ఎన్‌ఎంఎంఎల్‌ను 1964లో అక్కడ ప్రారంభించినా దాన్ని పాటియాల హౌస్‌కు తరలించాలని 1968లో ఇందిరా గాంధీ కేబినెట్ తీర్మానించిందని గుర్తు చేస్తోంది. అది నిజమే. అయితే ఆ నిర్ణయం అమలు కాలేదు.
స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడు. అలాగని పార్టీ కేవలం ఆయన చెప్పుచేతల్లో మాత్రమే నడవలేదు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ లాంటి వారు సైతం పార్టీని ప్రభావితం చేశారు. ఆయనపై అలిగారు. తిరుగుబాటు చేశారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆ ధోరణి కొనసాగింది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్టీలో ఎదురులేని నేతగా రూపుదిద్దుకున్నా సర్దార్ పటేల్, బీసీ రాయ్, కామరాజ్ నాడార్ వంటి నేతలు సైతం తమ తమ స్వతంత్ర దృక్పథాలతో పార్టీపై ముద్రవేశారు. దేశ విభజన అనంతరం నెహ్రూ ప్రధానిగా ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలోనూ ఇది కొనసాగింది. విభజనానంతరం అనేకచోట్ల మత ఘర్షణలు పెల్లుబికాయి.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచాలన్న ఉద్యమాలు, తమ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తామని చెప్పే సంస్థానాధీశులు, కశ్మీర్ సమస్య, తీవ్ర పేదరికం, సామాజిక అసమానతలు, ఆర్థిక ఒడిదుడుకులు... వీటన్నిటినీ నెహ్రూ ప్రభుత్వం ఎదుర్కొనవలసి వచ్చింది. చైనాతో సరిహద్దు తగాదా, చివరికది యుద్ధానికి దారితీయటం, అందులో ఓటమి సంభవించటం లాంటి పరిణామాలు సంభవించాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే పంచవర్ష ప్రణాళికలొచ్చాయి. పారిశ్రామికీకరణ మొదలైంది. ఆనకట్టల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఉన్నతశ్రేణి సాంకేతిక విద్యాసంస్థల నిర్మాణం జరిగింది.
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. అయితే ఈ కాలంలో తీసుకున్న అనేక నిర్ణయా లపై విమర్శలున్నాయి. సోవియెట్ అనుసరిస్తున్న పంచవర్ష ప్రణాళికల్లోని లోటుపాట్లేమిటో చూడ కుండానే వాటిని మన దేశానికి వర్తింపజేశారని, అవి దేశ ప్రగతికి అవరోధమయ్యాయని నెహ్రూ వ్యతిరేకులంటారు. ఉన్నత విద్యపై ఆయన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినా ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. మానవ వనరుల సామర్థ్యాన్ని విద్య ద్వారా పెంచ డానికి తగినంత కృషి చేయకపోవటం వల్ల అనంతరకాలంలో అది దేశ ప్రగతికి, పేదరిక నిర్మూ లనకు అవరోధమైందని చెబుతారు. ఇక కేరళలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం వంటి చర్యలు నెహ్రూ ప్రజాస్వామిక దృక్పథాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇలా అనుకూల, ప్రతికూల అంశాలన్నిటిపైనా లోతైన చర్చ సాగడానికి, వాటినుంచి గుణపాఠాలు తీసుకోవడానికి ఎన్‌ఎంఎంఎల్ వంటివి తోడ్పడతాయి.
నిజానికి నెహ్రూ విధానాల నుంచి అనంతర కాలంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు క్రమేపీ దూరం జరుగుతూ వచ్చాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే 1991లో ఆర్థిక సంస్క రణలు ప్రారంభించింది. ప్రణాళికా సంఘం ఎన్‌డీఏ సర్కారు వచ్చాకే రద్దయినా దానికి బీజాలు ఆ ఆర్థిక సంస్కరణల్లోనే ఉన్నాయి. ప్రణాళికా సంఘం ఎప్పుడో నామమాత్రావశిష్టంగా మారింది. నెహ్రూతోపాటు అనంతరకాల ప్రధానులను సైతం గుర్తించి గౌరవించాలన్న నిర్ణయాన్ని తప్పు బట్టాల్సింది లేదు. అయితే వారికి కూడా ఆ ప్రాంగణంలోనే చోటివ్వాలని పట్టుబట్టడంలో అర్ధం లేదు. నెహ్రూ కన్నుమూసేవరకూ అది ఆయన నివాసంగా ఉంటూ వచ్చింది గనుక దాన్ని ఆయన స్మృతి చిహ్నంగానే ఉంచి మరోచోట ఇతర ప్రధానుల కోసం స్థలాన్ని కేటాయించవచ్చు. ఉద్దేశ పూర్వకంగా, కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలిగించటం మంచిది కాదు.
Comments
Please login to add a commentAdd a comment