ముగిసిన హోరాహోరీ పోరు
నాలుగు నెలలుగా బిహార్‌ను ఊపిరి సలపనీయకుండా చేసిన అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. గురువారం ఆఖరి విడత పోలింగ్ ముగిశాక ఖాళీ అయిన ఇంటిలా ఆ రాష్ట్రం బోసిపోయింది. కానీ హోరాహోరీగా సాగిన ప్రచార పర్వంలో పరస్పర ఆరోపణలు, నిందలు, విమర్శలు సృష్టించిన వైషమ్య వాతావరణం అంత తొందరగా పోదు. వాస్తవానికి అది బిహార్‌కు మాత్రమే పరిమితమై లేదు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు నేతలు మాట్లాడిన మాటలు దేశమంతటా వివాదాన్ని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగిస్తూ ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలే ఈ ప్రచార పర్వం ఎంత ఉద్రిక్తంగా సాగిందో చెబుతాయి.
‘మీరు పాట్నాలో ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? ఉగ్రవాదులను కాపాడేవారినా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘మీ రిజర్వేషన్ కోటాను వేరేవాళ్లకు పంచిపెట్టే కుట్ర సాగుతున్నద’ని కూడా ఆయన బీసీ కులాలను హెచ్చరించారు. అటు జేడీ(యూ)-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి వైపునుంచి కూడా ఆ మాదిరి ప్రకటనలు రాకపోలేదు. ఇదంతా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో...వాటికి ఓటమి భయం ఏ స్థాయిలో ఉన్నదో తెలియజెబుతాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ప్రధాన ప్రచార సారథి నరేంద్ర మోదీయే. ఆయన బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ప్రధాని స్థాయిలో వ్యక్తి దాదాపు 30 సభల్లో మాట్లాడటం చిన్న విషయమేమీ కాదు. ప్రత్యర్థి స్థానంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉండకపోతే...బిహార్ ప్రజల హృదయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం లేకపోతే మోదీకీ, బీజేపీకీ ఇంత యాతన ఉండేది కాదు. కొన్ని నెలలు మినహా వరసగా పదేళ్లనుంచి అధికారంలో ఉంటూ...అందువల్ల సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకొనక పోవడం ఆయన విశిష్టత.
ఆయన పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేసిందన్న అభిప్రాయం అందరిలోనూ ఉండటమే అందుకు కారణం. అయితే నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక అందుకు నైతిక బాధ్యత వహించి పదవినుంచి తప్పుకొని దళిత నాయకుడు జీతన్ రాం మాంఝీకి సీఎం పదవి అప్పగించిన నితీష్...చివరకు ఆ ప్రయోగం వికటించేలా ఉందని తానే ఆ పదవిని చేపట్టారు. ఈ క్రమంలో ఆయనపై దళిత వర్గాల్లో అంతో ఇంతో వ్యతిరేకత వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లు విడివిడిగా పోటీ చేయగా అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఓట్ల శాతం రీత్యా చూస్తే ఆ మూడు పక్షాలదే పైచేయిగా ఉంది.
ఆ పక్షాలన్నిటికీ కలిసి 45 శాతం ఓట్లు లభిస్తే...బీజేపీ 36 శాతం గెల్చుకుంది. దీంతో ఆదరా బాదరాగా జేడీ(యూ), ఆర్జేడీలు పూర్వపు జనతా పక్షాలతో కూడిన ఒక పార్టీని ఏర్పాటు చేద్దామని కూడా ప్రయత్నించాయి. కూటమిగా కాక పార్టీగా జనం ముందుకెళ్తే బీజేపీని ఓడించడం సులభమని అవి భావించాయి. కానీ చివరకు సర్దుబాట్లతో సరిపెట్టుకున్నారు. ములాయం వేరే దోవ చూసుకున్నారు. చివరి నిమిషంలో ఎంఐఎం బరిలో నిలవడం కూటమిని ఖంగుతినిపించింది. రాష్ట్ర జనాభాలో 15 శాతంగా ఉన్న ముస్లింల ఓట్లు తమకు పడతాయన్న అంచనాల్లో ఉన్న కూటమి నేతలకు ఇది మింగుడు పడలేదు. జేడీ(యూ)-ఆర్జేడీ పొత్తు కూడా అంత సులభంగా కుదరలేదు. జేడీ(యూ) పోటీచేసే స్థానాలకు సమానంగా ఇస్తే తప్ప అంగీకరించబోనని లాలూ పట్టుబట్టడంతో ఆ పార్టీకి కూడా వంద స్థానాలు కేటాయించాల్సివచ్చింది. తమ స్థితి బలహీనంగా ఉన్నదని నితీష్ గుర్తించడంవల్లనే ఆయన రాజీ పడాల్సివచ్చింది.
బీజేపీకి కూడా బిహార్ ఎన్నికల్లో ఆచి తూచి అడుగేసింది. పార్లమెంటులో నెగ్గుకురాలేమని తెలిసికూడా తీసుకొచ్చిన భూసేకరణ బిల్లును కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అది పక్కన పడేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవ్వబోతున్నట్టు నరేంద్ర మోదీ సభా ముఖంగా ప్రకటించింది కూడా ఎన్నికల ముందు చూపుతోనే! ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ రిజర్వేషన్లపై చర్చ జరగాలంటూ చేసిన ప్రకటనలపై బీజేపీ ఉలిక్కిపడింది కూడా బిహార్ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందోనన్న భయంతోనే. ఓబీసీలు దాదాపుగా కూటమి వెనకాలే ఉన్నారని తేలడంతో బాగా వెనుకబడిన కులాల(ఈబీసీ) ఓట్లకు బీజేపీ గాలం వేసింది.
రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు 30 శాతం ఉన్నారని అంచనా. ఈబీసీ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ప్రధానిగా ఉన్నానని నితీష్‌కు కంటగింపుగా ఉన్నదని స్వయంగా మోదీయే ఒక సభలో ప్రకటించారు. రాష్ట్రంలో సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ దీనికి కొనసాగింపుగా ప్రధాని ఈబీసీల్లోని తెలిక కులానికి చెందినవారని కూడా తేటతెల్లం చేశారు. వేరే రాష్ట్రంలో ఎన్నికలైతే బీజేపీకి కులం అవసరపడేది కాదు. కానీ పంచాయతీల్లో తమకు నితీష్ సర్కారు 20 శాతం కోటా ఇవ్వడాన్ని ఈబీసీలు అంత సులభంగా మరిచిపోరు.
నాయకుల ప్రకటనల మాటెలా ఉన్నా అయిదు దశల పోలింగ్ ప్రశాంతంగా పూర్తి కావడం అందరికీ ఊరట కలిగించింది. మొత్తం 243 స్థానాల్లోనూ దాదాపు 57 శాతం ఓటింగ్ జరగ్గా ఏవో చెదురుమదురు ఘటనలు తప్ప అంతా సవ్యంగా సాగిపోయింది. ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చునని దాదాపు సర్వేలన్నీ సూచిస్తున్నాయి. రెండు సర్వేలు మాత్రం ఎన్‌డీఏకు అత్యధిక స్థానాలివ్వగా...ఇరు పక్షాలూ నువ్వా నేనా అన్నట్టున్నాయని మిగిలిన సర్వేలు తేల్చాయి. బిహార్ సంగ్రామం ఎంత హోరాహోరీగా సాగిందో సర్వేలే చెబుతున్నాయి. ఆదివారం వెలువడబోయే ఫలితాలపై ఇవి మరింత ఉత్కంఠను పెంచాయి. ఇక్కడి గెలుపోటములు కేంద్రంలో ఎన్డీయే పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని... బీజేపీ నడత, నడక మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.