శుభారంభం | Sakshi Editorial On Swearing Ceremony Of YS Jagan | Sakshi
Sakshi News home page

శుభారంభం

Published Fri, May 31 2019 1:00 AM | Last Updated on Fri, May 31 2019 1:00 AM

Sakshi Editorial On Swearing Ceremony Of YS Jagan

అనవసర ఆడంబరాలు, ఆర్భాటాలు లేవు... గర్వాతిశయాల జాడ లేదు. వాటి స్థానంలో తొణకని ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. సత్సంకల్పంతో, సత్యనిష్టతో 14 నెలలపాటు తాను సాగించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో తారసపడిన జన జీవితాల జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆ జీవితా లను మెరుగుపరిచి తీరాలన్న దృఢ సంకల్పం గుండె నిండా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుని గురువారంనాడు వేలాదిమంది సమక్షంలో నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతమూ ఆయన పరిపాలన ఎలా ఉండబోతున్నదో రేఖామాత్రంగా ఆవిష్కరిం చింది. సంక్షిప్తంగా సాగిన ఆ ప్రసంగంలో అతిశయోక్తులు, స్వోత్కర్షలు లేవు. ఎక్కడా తడబాటు లేదు. చెప్పదల్చుకున్న అంశాలను సూటిగా, స్పష్టంగా, అందరికీ అవగాహన కలిగే రీతిలో చెప్పడం ఈ ప్రసంగమంతా కనబడుతుంది. అంతేకాదు... పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్‌ పెంచుతూ తొలి సంతకం చేశారు.

341 రోజులపాటు 3,684 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని లక్షలాదిమంది ప్రజలు నిత్యం నిశితంగా గమనించారు. తమ మధ్యే నివాసం ఉంటూ, తమతోనే సహవాసం చేస్తూ, తమ వెతలను వింటూ ‘నేనున్నా’నంటూ ఆయన ఇచ్చిన భరోసాను గుండెల్లో దాచు కున్నారు. తమను కష్టాలపాలు చేస్తున్న తెలుగుదేశం పాలన ఎప్పుడు ముగిసిపోతుందా అని నిరీక్షించారు. ఆ ముహూర్తం ఆగమించిన వేళ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగం కోట్లాదిమంది ఆశ లకూ, ఆకాంక్షలకూ అద్దం పట్టింది. వారి నమ్మకాన్ని వందల రెట్లు పెంచింది. రాష్ట్రం ఎదుర్కొం టున్న సమస్యలపై ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నదని, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహం, దాని అమలుకు అవసరమైన పట్టుదల ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మాత్రమే కాదు... ఖండాంతరాల్లో ఉంటూ భిన్న మాధ్యమాల ద్వారా ఆయన ప్రసంగాన్ని విన్న తెలుగువాళ్లంతా అవగాహన చేసుకున్నారు. 

అధికార చేలాంచలాలు అందుకున్న మరుక్షణం చేసిన వాగ్దానాలేమిటో మరిచిన పాలకుణ్ణి ప్రత్యక్షంగా చూసినవారికి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ చెప్పినవి మాత్రమే కాదు... చెప్పనివీ చేసి చూపించిన అపర భగీరథుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి వార సుడాయన. కనుకనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రమా ణస్వీకార సభా వేదికపై చూపుతూ... దీన్ని తాను ఖురాన్‌లా, బైబిల్‌లా, భగవద్గీతలా భావించి, అందులోని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి త్రికరణశుద్ధిగా పనిచేస్తానని జగన్‌ చెప్పగలిగారు. అంతేకాదు, అయిదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో స్థూలంగా తెలియజేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ప్రవేశపెడతామని, అక్రమాలకూ, అవినీతికీ ఆస్కారం లేనివిధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుందో సుస్పష్టమే. ఇది అమలైతే ఖజానాకు గండికొట్టే అక్రమార్కుల ఆటలిక సాగవు. 

 తెలుగుదేశం పాలనలో అస్మదీయ కాంట్రాక్టర్లు ఓ వెలుగు వెలిగారు. కోటరీగా ఏర్పడి అన్యు లెవరూ టెండర్ల దరిదాపుల్లోకి రాకుండా చూశారు. ఎవరైనా సాహసించి టెండర్లలో పాల్గొంటే వారిని ‘బ్లాక్‌ లిస్టు’లో చేర్చారు. కొన్ని సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం ‘అయినవాళ్ల’ కోసం నిరవధికంగా ఆపారు. ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబం ధించిన ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడం ఒక సంస్కృతిగా మారింది. నేతలకు ముడుపులు చెల్లిస్తే తప్ప పనులు ప్రారంభించడం దుర్లభమయ్యేలా చేశారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు కాంట్రాక్టర్లు పరారైన సందర్భాలూ ఉన్నాయి. అసలు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి ముందే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం, కమీషన్లు దండుకోవడం ఒక కళగా అభివృద్ధి చేశారు. ఏపీలో అధికార పార్టీ కన్నుపడని, వారికి కాసులు రాల్చని కాంట్రాక్టు పనులంటూ లేవు. ఈ అవినీతి మహమ్మారిని రూపుమాపుతానని హామీ ఇవ్వడం సాధారణ విషయం కాదు. నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడికే, సాహసోపేతంగా అడుగేయగల నాయ కుడికే అది సాధ్యం. ‘సాహసమున పనులు సమకూరు ధరలోన...’ అని వేమన ఎప్పుడో చెప్పాడు.  

ప్రభుత్వ పథకాలు నేరుగా జనం ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలం టీర్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలమంది వాలంటీర్లను  నియమిస్తామని చెప్పడం పేద జనానికి ఊరటనిచ్చే అంశం. తమకు రావాల్సినవాటి కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వక తప్పని దుస్థితిలో పడుతున్న లక్షలాదిమంది నిరుపేదలకు ఇదొక వరం. అలాగే ప్రభుత్వ పథకాలు, సేవలు సరిగా అందని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించాలని, గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం హర్షించదగ్గ నిర్ణయాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇరు రాష్ట్రాలూ కలిసిమెలిసి ముందుకు సాగుదామని, పరస్పరం సహకరించుకుందామని పిలుపునివ్వడం శుభసూచికం. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆయనా, డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆకాంక్షించడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకున్న విధంగా రాబోయే రోజుల్లో సమర్థవంతమైన, నిష్కళంకమైన పాలన అందు తుందన్న భరోసాను జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం కల్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement