అంతర్జాతీయ రాజకీయ యవనికపై చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి మన దేశాన్ని ప్రభావితం చేయగలవాటిని సహజంగానే కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) కశ్మీర్‌పై పాకిస్తాన్‌లో వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించతలపెట్టిన సదస్సును ఆ కోణంలోనే చూస్తోంది. సౌదీ అరేబియా మన మిత్ర దేశం. అంతర్జాతీయ వేదికల్లో చాన్నాళ్లుగా మన దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తుందన్నది వాస్తవం. ఈమధ్యకాలంలో ఓఐసీతో అడపా దడపా భారత్ వ్యతిరేక ప్రకటనలు ఇప్పించడంలో విజయం సాధించిన పాకిస్తాన్‌కు తాజా నిర్ణయం సంతోషం కలిగించింది. వాస్తవానికి కశ్మీర్‌పై ఓఐసీ విదేశాంగ మంత్రుల సదస్సు జరిపించాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ దాన్ని సంస్థ సభ్య దేశాల పార్లమెంటేరియన్ల సదస్సుగా కుదించడా నికి సౌదీ తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే చేసింది. అది చివరకు ఫలించింది.
సమావేశ స్థలి ముందనుకున్నట్టు సౌదీ అరేబియా కాదని, పాకిస్తానేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం జరగడమైనా పాకిస్తాన్ విజయమని చెప్పుకోవాలి. యాభైయ్యేళ్లక్రితం... అంటే 1969లో ఓఐసీ శిఖరాగ్ర సమావేశానికి మన దేశం ప్రతినిధి వర్గం హాజరైనప్పుడు అప్పటి పాకిస్తాన్ సైనిక నియంత జనరల్ యాహ్యాఖాన్ పట్టుబట్టి ఆ ప్రతినిధి వర్గాన్ని బయటకు పంపించగలిగాడు. అయితే 2019 ఫిబ్రవరిలో జరిగిన ఒక పరిణామంతో పాకిస్తాన్ ఖంగుతింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మార్చిలో జరగబోయే ఓఐసీ సమావేశాలకు భారత్‌ను ‘గౌరవS అతిథి’గా ఆహ్వానించబోతున్నామని అప్పట్లో సౌదీ అరేబియా ప్రకటించింది. అనంతరం అప్పటి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఆ సమావేశానికి హాజరై భారత్ గళాన్ని వినిపించారు. అది మొదలు పాక్ ఓఐసీలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తూనే వుంది. దాని ఫలితమే ప్రస్తుత పార్లమెంటేరియన్ల సమావేశం.
వాస్తవానికి కశ్మీర్ ప్రతిపత్తిని మార్చినప్పుడు ఓఐసీ స్పందించింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాల్లో కూడా ఓఐసీ ప్రకటనలిచ్చింది. మైనారిటీలుగా వున్న ముస్లింల భద్రతను పట్టించుకోవాలని, పవిత్ర ఇస్లామిక్ స్థలాలను పరిరక్షించాలని మన దేశాన్ని కోరింది. వివక్షకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి గతంలో చేసిన తీర్మానాన్ని కూడా ప్రస్తా వించింది. వీటన్నిటి వెనకా పాకిస్తాన్ ఒత్తిళ్లున్నాయని సులభంగానే అర్ధమవుతుంది. భారత్‌ను శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించిన పది నెలల్లోనే ఓఐసీ వైఖరి మారడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి ఓఐసీని తన దారికి తెచ్చుకోవడానికి పాకిస్తాన్ చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయ త్నాలు ఈ నిర్ణయంతో కొత్త మలుపు తిరిగాయి. సంస్థపై పట్టున్న సౌదీ అరేబియాకూ, దాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్న మలేసియాకూ వున్న విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల పర్యవసానంగానే ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు జరగబోతోంది. స్వదేశంలో సమస్యలున్నప్పుడు, వాటిని తీర్చలేనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాల కులు రకరకాల ప్రయత్నాలు చేయడం ఏ దేశంలోనైనా వున్నదే.
ఇప్పుడు ఓఐసీ పాకిస్తాన్‌కు ఆవిధం గానే వుపయోగపడుతోంది. కశ్మీర్ పౌరుల కోసం తాను అంతర్జాతీయంగా కృషి చేస్తున్నానని చెప్పుకోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు తోడ్పడుతుంది. ఇలాంటి అవసరమే మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్‌కు కూడా వుంది. అందుకే ఆయన కూడా ఈమధ్య తరచు కశ్మీర్‌పై ప్రకటనలు చేస్తున్నారు. ఓఐసీపై పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాల వుద్దేశమూ అదే. కనుకనే ఆయన డిసెంబర్ నెలాఖరున టర్కీ సహకారంతో ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వెళ్లబోతున్నట్టు ప్రకటించి పాకిస్తాన్ సౌదీని కంగారుపెట్టింది. కానీ దాని ఒత్తిళ్లకు తలొగ్గి చివరి నిమిషంలో వెనక్కుతగ్గింది. ఈమధ్యే సౌదీ పర్యటనకెళ్లిన ఇమ్రాన్ ఖాన్ తన వైఖరి మార్చుకున్నారు. పాకిస్తాన్‌ను సంతృప్తిపరచడం కోసం కశ్మీర్‌పై ఓఐసీ దేశాల పార్ల మెంటేరియన్ల సదస్సు జరపడానికి సౌదీ అరేబియా అంగీకరించింది.
మన దేశంలో ముస్లింలు మైనారిటీలే కావొచ్చుగానీ, చాలా ముస్లిం దేశాలతో పోలిస్తే మన దేశంలోని ముస్లిం జనాభా అధికం. నిజానికి ఈ కారణంతోనే 1969లో మన దేశాన్ని ఓఐసీ సమా వేశానికి ఆహ్వానించారు. ముస్లింల అభ్యున్నతి కోసం తీసుకునే ఓఐసీ తీసుకునే చర్యలు భారతీయ ముస్లింలకు కూడా చేరాలంటే ఇది సరైన మార్గమని దాని నిర్వాహకులు భావించారు. కానీ భారత్‌పై శత్రుత్వం వున్న పాకిస్తాన్ దీన్ని పడనివ్వలేదు. ముస్లిం దేశాల్లో అతి పెద్ద జనాభావున్న ఇండో నేసియాతోపాటు సిరియా, అల్జీరియా వంటివి కూడా మన దేశంపట్ల సానుకూలంగానే వున్నాయి. కశ్మీర్‌పై కఠిన పదజాలంతో ప్రకటన చేయడాన్ని అవి వ్యతిరేకించాయి. భారత్‌ని గౌరవ అతిథిగా ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్‌తోపాటు టర్కీ కూడా గట్టిగా సమర్థిం చింది. ఇప్పుడు మాత్రం భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది. కాగా, కొందరిని విదేశీయులుగా ముద్రవేసి తమ దేశం పంపాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలపై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది.
ఈ అంశాలపై మన దేశం ఆచితూచి వ్యవహరించాలి. తన చర్యల వెనకున్న ఉద్దేశాలపై ప్రపంచ దేశాలన్నిటికీ వివరించాలి. అదే సమయంలో ఓఐసీ అంతర్గత రాజకీయాల మాటెలావున్నా ఇక్కడి ప్రభుత్వ చర్య లపై అసమ్మతివుంటే దాన్ని వ్యక్తం చేయడానికి, ఒత్తిళ్లు తీసుకురావడానికి, పోరాడటానికి ఈ దేశ పౌరులకు సత్తావుంది. బలూచిస్తాన్ వంటిచోట స్థానికుల ఆకాంక్షలను అణచడానికి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో సద్దులు చెప్పడానికి, ఓఐసీలాంటి సంస్థను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూసే ప్రయత్నాల వల్ల ఒరిగేదేమీ వుండదు.
Comments
Please login to add a commentAdd a comment