శేషాచల అడవుల్లో ఎప్పటిలా స్మగ్లర్ల ఇష్టారాజ్యమే నడుస్తున్నదని మరోసారి రుజువైంది. అలసత్వంవహించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా ఆదివారం అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులకు దిగి ఇద్దరు అధికారులను పొట్టనబెట్టుకున్నారు. మరో ముగ్గురు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. దాడులు ఒకసారి కాదు... రెండుసార్లు జరిగాయి. దాదాపు ఆరుగంటలపాటు కొనసాగాయి. దాదాపు వంద మంది స్మగ్లర్లు, కూలీలు కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేసి చేశారంటే పరిస్థితి ఎలా ఉందో, స్మగ్లింగ్ కార్యకలాపాల విస్తృతి ఎంతగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. మహావృక్షాలను కూల్చేయడానికి అక్కడకు వెళ్లేవారంతా హెలికాప్టర్లలోనో, పారాచూట్లలోనో అక్కడ దిగరు. చాలా గ్రామాలను దాటుకునే వెళ్తారు. ఎర్ర చందనాన్ని దర్జాగా ట్రక్కుల్లో తరలిస్తారు. అయినా వారి కార్యకలాపాలపై స్థానిక అధికారులకు, పోలీసులకు సమాచారం అందదు. ప్రాణభీతి ఉన్నవారో, అవినీతికి అలవాటుపడినవారో ఈ స్మగ్లర్ల కార్యకలాపాలను చూసీచూడనట్టు ఊరు కుంటారు. కానీ, చిత్తశుద్ధితో కర్తవ్య నిర్వహణ చేయడానికి ప్రయత్నించేవారు ఇలా ప్రాణాలు కోల్పోతుంటారు. శేషాచల అడవుల్లో ఇదేమీ ఊహించని ఘటన కాదు. అక్కడ నిత్యమూ స్మగ్లర్లు తమ ఉనికిని చాటు కుంటూనే ఉన్నారు. తామెక్కడా తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఉదయగిరి మొదలుకొని మంగళూరు, ముంబై, కొచ్చి వరకూ ఎటు కుదిరితే అటు... ఎలా వీలైతే అలా అపురూపమైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు ఎల్లలు దాటిస్తూనే ఉన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడల్లా చర్యలు తీసుకుంటా మనడం, స్మగ్లర్ల పనిపడతామనడం తప్ప పటిష్టమైన వ్యవస్థను ఏర్పరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందువల్లే స్మగ్లింగ్‌కు అడ్డూ ఆపూ లేకుండా పోయింది.
ఎర్రచందనం వృక్ష సంపద ప్రపంచంలోనే అరుదైనది. ఇది ఎక్కడపడితే అక్కడ పెరిగేది కాదు. మన దేశానికీ, అందులోనూ మన రాష్ట్రానికి పరిమితమైన అపురూపమైన సంపద. ఎన్నడో 1973లోనే దీన్ని అరుదైన వృక్షజాతుల పరిధిలో చేర్చారు. రాష్ట్రంలో శేషాచలం, పాలకొండలు, లంకమల అడవుల్లో ఇది ఏపుగా పెరుగుతుంది. ఖరీదైన బొమ్మల తయారీనుంచి ఆయుర్వేద ఔషధాలు, అణు రియాక్టర్ల వరకూ ఎన్నిటిలోనో ఇది ఉపయోగపడుతుంది. దుంగ నాణ్యతను బట్టి టన్ను ధర పాతిక లక్షల రూపాయలవరకూ పలుకుతుంది. విదేశాల్లో గిరాకీనిబట్టి దీని ధర మరిన్ని రెట్లు ఉంటుంది. దాదాపు అయిదున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ వృక్ష సంపద ఉన్నదని సర్కారీ లెక్కలు చెబుతున్నా, నిత్యమూ చందనం వృక్షాలను నేలకూల్చడంలో బిజీగా ఉంటున్న స్మగ్లర్లు ఇందులో ఏమేరకు మిగిల్చారో అనుమానమే. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలకు ఈ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ అయి అక్కడి నుంచి విదేశాలకు... ముఖ్యంగా చైనా, జపాన్, మయన్మార్ వంటి దేశాలకు తరలిపోతాయి. మూడేళ్లక్రితం మలేసియా అధికారులు ఒక ఓడను తనిఖీచేసి చెన్నై పోర్టు నుంచి ఈ ఎర్రచందనాన్ని అక్రమంగా తెస్తున్నారని నిర్ధారించి వెనక్కు పంపారు. అయిదారురోజులక్రితమే కోల్‌కతా విమానా శ్రయంలో కస్టమ్స్ విభాగం అధికారులు 179 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని అయిదుగురు చైనా జాతీయులను అరెస్టుచేశారు. నెలరోజుల వ్యవధిలో కోల్‌కతా విమానాశ్రయంలో ఇలా ఎర్రచందనాన్ని పట్టుకోవడం ఇది నాలుగోసారని, ఇంతవరకూ మొత్తం 600 కిలోల ఎర్రచందనం స్వాధీనమైందని వారు చెప్పారంటే స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎంత జోరుగా సాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
స్మగ్లర్ల ధాటిని తట్టుకోవడం తమవల్ల కావడంలేదని అటవీ శాఖ అధికారులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, ఆయుధాలివ్వకపోవడంవల్లే ఎర్రచందనాన్ని రక్షించలేకపోతున్నామని చెబుతు న్నారు. అయినా ప్రభుత్వపరంగా చర్యలు లేవు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలిచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ తుదినిర్ణయం తీసుకోవడంలో జాప్యంచేస్తోంది. పట్టుబడినవారిపై బెయిలబుల్ కేసులే పెట్టడం, కోర్టుల్లో చాలా సందర్భాల్లో తగిన సాక్ష్యాలు లభించక ఆ కేసులు వీగిపోతుండటం స్మగ్లర్లకు వరంగా మారుతున్నది. పైగా, స్మగ్లింగ్ కేసుల్లో పెద్ద తలకాయలను మినహా యిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిరుడు హోంశాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారాన్ని సమీక్షించింది. అటవీశాఖనుంచి, పోలీసు శాఖనుంచి నివేదికలు కోరింది. ఆ సంఘం తదుపరి చర్యలేమిటో ఇంతవరకూ తెలియలేదు. ఈ స్మగ్లింగ్ బెడదను నివారించడానికి మరో మార్గం కూడా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. వివిధ అటవీశాఖ డిపోల్లో పలు సందర్భాల్లో పట్టుబడిన 15,000 టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి. ఇందులో దాదాపు 9,000 టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ చాన్నాళ్లక్రితమే అనుమతినిచ్చింది. అయితే ఇంతవరకూ ఆ వేలం ప్రారంభం కాలేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా ఎర్ర చందనానికున్న డిమాండ్ కొన్నేళ్లపాటు నిలిచిపోతుందని, ఫలితంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగానైనా తగ్గిపోతాయని అంటున్నారు. ఆ పని చేయడంతోపాటు మొత్తంగా ఎర్రచందనం వృక్షాల రక్షణకు తీసుకోవాల్సిన బహు ముఖ చర్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అటవీశాఖ అధికారులకు ఏమేమి అవసరమో గుర్తించి వాటిని తీర్చడంతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా మార్చి, కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటుచే యాలి. ఇవన్నీ చేసినప్పుడే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడుతుంది.
అడవిలో దొంగలరాజ్యం!
Published Mon, Dec 16 2013 11:28 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement