సంపాదకీయం
నిత్యం గోవింద నామ స్మరణతో మార్మోగే శేషాచలం కొండల్లో అగ్నికీలలు ఎగిసిపడి అడవిని బుగ్గిపాలుచేశాయి. ఇప్పటికి సరిగ్గా మూడురోజులనాడు మూడుచోట్ల రాజుకున్న నిప్పు అరికట్టేవారులేక యథేచ్ఛగా విస్తరించింది. సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని 460 హెక్టార్ల అడవి నాశనమైంది. మంటలు అంటుకున్న ప్రాంతం శ్రీవారు కొలువుదీరిన తిరుమల కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంవల్ల భక్తులంతా కలవరపాటుకు గురయ్యారు. భక్తుల భద్రత కోసమని పాపవినాశం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాలస్వామి ఆలయ మార్గాలను, దుకాణాలను మూసేశారు. గురువారంనాటికి నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు, 100మంది జవాన్లు రంగంలోకి దిగి ప్రయత్నించాక మంటలు అదుపులోకొచ్చాయి.
ఏ ప్రమాదం జరిగినా షరా మామూలైపోయిన ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఉదంతంలోనూ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కొంపలంటుకున్నాక బావి తవ్వబోయిన చందాన మంటలు విస్తరించాక తప్ప అధికార యంత్రాంగంలో కదలిక రాలేదు. కార్చిచ్చును అదుపుచేయడానికి అసలు ప్రయత్నాలే జరగలేదని కాదు. వివిధ శాఖల సిబ్బంది, 15 ఫైరింజన్లతో అక్కడికి తరలివెళ్లారు. కానీ, ఆ స్థాయి మంటలను అదుపుచేయడం సాధారణ ఫైరింజన్ల వల్ల సాధ్యమవుతుందా? ప్రమాదం సంభవించి 24 గంటలు గడిచాకగానీ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రక్షణశాఖ సాయాన్ని ఎందుకు కోరలేకపోయింది? అసలు అగ్నికీలల జాడలు తెలిసిన సమయం గురించే ఇప్పుడు వివాదం ఉన్నది. ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాల ఆధారంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, మన రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లు ఈ నెల 2 నే మంటల జాడను పసిగట్టి హెచ్చరించాయని అంటున్నారు. కానీ ఎవరిలోనూ కదలికే లేదు. నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా కలగలిసి అపురూపుమైన వృక్ష సంపదను బుగ్గిపాలు చేశాయి. వేల సంఖ్యలో మూగజీవాలు కూడా ఈ మంటల్లో మాడి మసైపోయాయని కొందరంటుంటే... అటవీ అధికారులు కాదంటున్నారు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించిచెప్పే ప్రయత్నమో, నిజమో తేలవలసి ఉంది.
అటవీ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలా నిప్పు రాజుకోవడం, అదుపుచేయడం సాధారణమే. కానీ, ఇంత పెద్దయెత్తున ఇన్ని వందల హెక్టార్ల అడవి బూడిద కావడం మాత్రం ఇదే ప్రథమం. స్వల్ప సమయంలో మూడుచోట్ల మంటలంటుకున్న తీరును చూస్తే ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అనిపిస్తున్నది. ఎర్రచందనం స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు తగిన దోవను ఏర్పర్చుకోవడానికి ఈ పనిచేశారా లేక భక్తులెవరైనా అక్కడ వంటలు చేసుకుని నిప్పు ఆర్పకుండా వెళ్లడంవల్ల ప్రమాదం జరిగిందా అన్నది లోతైన విచారణ జరిగితే తప్ప తెలిసే అవకాశం లేదు. అసలు చాలా ముందుగానే వచ్చిన ప్రమాద సమాచారాన్ని బేఖాతరు చేసినవారెవరు? అలాంటి సమాచారం ఒక్క అటవీశాఖకు మాత్రమేనా... ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా అందుతుందా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపడినప్పుడు లేదా తలెత్తే అవకాశం ఉన్నదని తెలిసినప్పుడూ అన్ని శాఖలనూ సమన్వయం చేసి రంగంలోకి దిగాల్సిన జాతీయ విపత్తు నివారణ సంస్థకు ఇలాంటి ముందస్తు సమాచారం అందే ఏర్పాటు ఉన్నదా? ఏదో ఒక శాఖకు సమాచారం ఇచ్చే పద్ధతి కాకుండా అన్ని ముఖ్యమైన విభాగాలకూ ఆ సమాచారం చేరే ఏర్పాటుచేస్తే ఎవరో ఒకరు సకాలంలో మేల్కొని చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఆ తరహా పద్ధతులు అమల్లో ఉన్న దాఖలాలు కనిపించడంలేదు.
ఈ ఉదంతంలో ఒక్క అటవీశాఖ మాత్రమే కాదు... జిల్లా యంత్రాంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకూ అందరి బాధ్యతా రాహిత్యమూ కనబడుతూనే ఉంది. ఆగమ నిబంధనల ప్రకారం కొండపై హెలికాప్టర్లు, విమానాలు ఎగరకూడదు. కానీ, ప్రమాదం వెలుగు చూసిన మంగళవారంనాడే ఆ విషయమై ఆగమ పండితులను సంప్రదించడానికి... వారికి పరిస్థితి తీవ్రతను వివరించి, ఒప్పించడానికి ఏం అడ్డువచ్చింది? వారితో ఒకపక్క మాట్లాడుతూనే మరోపక్క కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించివుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రమాద తీవ్రతను, దాని విస్తృతిని సరిగా అంచనా వేయలేకపోవడంవల్లనే వెనువెంటనే ఇవన్నీ జరగలేదనిపిస్తుంది. సైన్యం, వైమానిక దళం కొన్ని గంటల్లోనే మంటల్ని నియంత్రించగలిగారన్నది గుర్తుంచుకుంటే ఈ చురుకుదనం ఎంత అవసరమో అర్ధమవుతుంది. అడవులున్నచోట ప్రమాదాలైనా కావొచ్చు, ఉద్దేశపూర్వకంగా చేసేవి కావొచ్చు...ఇలాంటి ఉదంతాలు జరగడం సర్వసాధారణం.
నిరుడు అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో దావానలం చెలరేగి మంటలార్పడానికి వెళ్లిన 19మంది సిబ్బంది చనిపోయారు. మూడేళ్లక్రితం రష్యాలో వరస కార్చిచ్చులు 1.90 లక్షల హెక్టార్లలో అడవి నాశనమైంది. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటివి తరచు జరుగుతుంటాయి. మనకు కూడా అటవీప్రాంతం ఎక్కువే గనుక విపత్తు నివారణ సంస్థ వంటివి ఈ తరహా ప్రమాదాల వివరాలను సేకరించి, అక్కడ తీసుకున్న చర్యలెలాంటివో గమనించివుంటే ఇలాంటి ఉదంతాల సమయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రమాద సమయాల్లో ఎవరెవరిని కదిలించాలో, అందుబాటులో ఉంచాల్సినవి ఏమిటో అవగాహనకొస్తాయి. ఇప్పుడు భవిష్యత్తు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ దృష్టి సారించింది. అడవి చుట్టూ రింగురోడ్డు, ప్రహరీ గోడ నిర్మిస్తామంటున్నారు. అందుకు అవసరమైన అనుమతులనూ తీసుకొస్తామంటున్నారు. బాగానే ఉంది. ఈ పని ఎన్నడో చేసి ఉండాల్సింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను గుర్తించి చర్య తీసుకోవాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.