‘గురు’తర బాధ్యత మరిచారా? | Teachers training history of apprentice teachers | Sakshi
Sakshi News home page

‘గురు’తర బాధ్యత మరిచారా?

Published Fri, Jul 15 2016 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

Teachers training history of apprentice teachers

సగటు విద్యార్థులను సమున్నతులుగా తీర్చిదిద్దడం, సమాజానికి ఉపయోగపడే పటుతర శక్తిగా మలచడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చడం ఎంతో ఇష్టంతో, ఆపేక్షతో చేయాల్సిన పనులు. అందుకవసరమైన నిబద్ధతను, నైపుణ్యాన్ని గురువుల్లో పెంపొందింపజేయడం ఉపాధ్యాయ శిక్షణ సారాంశం. ఆ శిక్షణ పొంది, అటుపై డీఎస్సీలాంటి రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు తదితర వడబోతలు పూర్తయి విజేతలుగా నిలిచినవారు ఉపాధ్యాయులవుతారు. తీరా అలా నియమించాక వారు కాస్తా ఏ రాజకీయ నాయకుడి ప్రాపకమో సంపాదించి ప్రజాప్రతినిధుల దగ్గరా, మంత్రుల దగ్గరా వ్యక్తిగత సహాయకులుగా చేరడానికి తహతహలాడుతున్నారు.
 
 పాఠం చెప్పడం కంటే అధికార పీఠాలకు సన్నిహితంగా మెలగడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు కొడిగట్టి క్రమేపీ అవి చిక్కి శల్యమై మూతబడుతున్నాయి. మారుమూల పల్లెసీమల్లో సర్కారీ స్కూళ్ల వాలకం చూసి అందులో చదివిస్తే ఎందుకూ కొరగాకుండా పోతారన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి దూరమైనా, భారమైనా తమ పిల్లల్ని ప్రైవేటు విద్యా సంస్థలకు పంపు తున్నారు. గత్యంతరం లేనివారు తమకింతే ప్రాప్తమని సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా పల్లెసీమల్లోని పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల్ని బోధనేతర విధుల్లో కొనసాగించవద్దని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికిచ్చిన ఆదేశాలు ఊరటనిస్తాయి.
 
 మన దేశంలో విద్యారంగం భ్రష్టుపట్టడానికి, ప్రమాణాలు నానాటికీ క్షిణి స్తుండటానికి కారణాలెన్నో! అందులో పాలకులుగా ఉంటున్నవారి పాపాలే అధికం. ఉపాధ్యాయులుగా అన్ని అర్హతలూ ఉన్నవారిని సైతం స్పెషల్ టీచర్లుగా, అప్రెంటిస్ టీచర్లుగా, కాంట్రాక్టు టీచర్లుగా నియమించడం మన ప్రభుత్వాలు నేర్చిన విద్య. ఈ పేర్లు పెడితే అరకొర జీతాలిచ్చి, ఇంక్రిమెంట్లు తదితర ప్రయోజనాలు ఎగ్గొట్టి ఎన్నాళ్లయినా కాలక్షేపం చేయొచ్చునని అవి భావిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో సదుపాయాల లేమి సరేసరి. సకల మౌలిక వసతులు, బోధన వనరులున్న స్కూళ్ల సంఖ్య పది శాతం మించడం లేదని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం మరుగుదొడ్డి సౌకర్యం కొరవడి పల్లెల్లో ఆడపిల్లల్ని చదువుకు పంపడమే మానుకుంటున్న దుస్థితి ఉంది. బడి ఈడుకొచ్చిన పిల్లల్లో అధిక శాతంమంది బయటే ఉంటున్నారని, చేరినవారిలో సైతం అనంతరకాలంలో ఎక్కువ శాతం బడి మానేస్తున్నారని ఆ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ సమ స్యలు చాలవన్నట్టు ఉపాధ్యాయ వృత్తికి అంకితమవ్వాల్సినవారు సైతం బడి ఎగ్గొట్టి ఏ ప్రజాప్రతినిధి పంచనో ఏసీ రూముల్లో సేద తీరుదామనుకుంటే, కార్లలో తిరుగుతూ కాలక్షేపం చేద్దామనుకుంటే ఇక చెప్పేదేముంది? ఒకపక్క పాఠశాలలు నాసిరకం ప్రమాణాలతో నీరసిస్తున్నాయని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు ఆందోళనపడుతున్నారు.
 
 ఆ సంగతి ఎవరికంటే కూడా ప్రజాప్రతినిధు లకు బాగా తెలుసు. తెలిసికూడా ఉపాధ్యాయుల్ని సహాయకులుగా నియమించు కుని తామూ సమస్యలో భాగమవుతున్నామని వారికి అర్ధం కాకపోవడం ఆశ్చర్య కరం. అంతకన్నా విచిత్రమేమంటే మన విద్యారంగాన్ని ఉన్నతీకరించడానికి అడ్డొస్తున్న అంశాలేవో క్షుణ్ణంగా తెలిసి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు సైతం ఈ విషయంలో మౌనం దాల్చడం! తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య వంటి ఒక సామాజిక సంస్థ లేవనెత్తిన ఈ సమస్య వారెవరికీ స్ఫురణకు రాలేదనుకోవాలా... వచ్చినా మిన్నకుండిపోయారని భావించాలా?
 
 తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏడు గ్రామాల ప్రజానీకం నిరుడు హైదరాబాద్ హైకోర్టుకు లేఖలు రాస్తే వాటిని ఉన్నత న్యాయస్థానం ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారేమని నిలదీసింది. ఇదే వరస కొనసాగితే అధికారుల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది.
 
 సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందోగానీ...పీఏలు, పీఎస్‌లుగా జీవితం వెళ్లదీస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పిలవాలన్న ఆలోచన మాత్రం రాలేదనుకోవాలి. ఆ మాట సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సివచ్చింది. తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరఫు న్యాయవాది కె. శ్రావణ్‌కుమార్ చెప్పిన వివరాలనుబట్టి చూస్తే సుప్రీంకోర్టు జోక్యం తర్వాత రాష్ట్రంలో పాఠశాలల స్థితి కాస్త మెరుగైంది. మూతబడిన 398 పాఠశాలల్లో 271 తెరుచుకున్నాయి. పిల్లల హాజరు గతంతో పోలిస్తే పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాత్రంగానైనా లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను గాలికొదిలారన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో అయితే డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ వంటి పోస్టుల్లో 90 శాతం ఖాళీలున్నాయని శ్రావణ్‌కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
 
 మారుమూల గ్రామాల పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్తున్నారో, లేదో పర్యవేక్షించే వ్యవస్థ పడకేసిందని దీన్నిబట్టి రుజువవుతోంది. ఉపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వడం, ఆ ప్రకారమే వారిని బదిలీ చేస్తుండటం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న పద్ధతి. పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నవారికి, మహిళా ఉపాధ్యాయులకు దీన్ని వర్తింపజేయడం వరకూ మంచిదే. కానీ అందరికీ వర్తింపజేసే ప్రస్తుత విధానంవల్ల కూడా మారుమూల పల్లెలకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు.
 
 ఇలా అనేకానేక సమస్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు అనాథగా మారాయి. ఎవరూ పట్టించుకోక బావురు మంటున్నాయి. ఒకపక్క ఆరు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందిస్తామంటూ విద్యాహక్కు చట్టం అమల్లోకి తెచ్చి ఆరేళ్లవుతోంది. అయినా విద్యారంగం అంతంతమాత్రంగానే ఉంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. సమస్యలన్నిటినీ సమగ్రంగా సమీక్షించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement