ఒక ఖండం కాదు... ఒక దేశం కాదు... ఉగ్రవాదం ఎక్కడైనా తన పంజా విసురుతుందని మరోసారి రుజువైంది. కొన్ని గంటల వ్యవధిలో రెండు ఖండాల్లోని రెండు దేశాల్లో ఈ ఉగ్రవాదానికి 150 మందికిపైగా అమాయక పౌరులు బలైపోయారు.
సంపాదకీయం: ఒక ఖండం కాదు... ఒక దేశం కాదు... ఉగ్రవాదం ఎక్కడైనా తన పంజా విసురుతుందని మరోసారి రుజువైంది. కొన్ని గంటల వ్యవధిలో రెండు ఖండాల్లోని రెండు దేశాల్లో ఈ ఉగ్రవాదానికి 150 మందికిపైగా అమాయక పౌరులు బలైపోయారు. రెండు ఘటనలకూ అల్ కాయిదా, తాలిబన్ అనుబంధ సంస్థలే కారణమని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. తూర్పు ఆఫ్రికా ఖండంలోని కెన్యా రాజధాని నైరోబీలో ఉన్న వెస్ట్‌గేట్ మాల్‌పై సాయుధ దుండగులు దాడిచేసి వందలమందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో 69 మందిని కాల్చిచంపారు.
బందీల వివరాలను కనుక్కొని, వారి మతమేమిటో తెలుసుకుని ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. మృతుల్లో భారత్, అమెరికా, చైనా, ఘనా, కెనడా, బ్రిటన్, కెనడా దేశాల పౌరులున్నారు. మిలిటెంట్ల చెరలో ఇంకా దాదాపు 50 మంది పౌరులున్నారని చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని పెషావర్ ఆల్ సెయింట్స్ చర్చిలో ఇద్దరు మానవబాంబులు దాడిచేసి 81 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఎక్కడో ఏదో జరిగిందిగానీ... మనకేమీ కాదులే అని ఎవరూ భరోసాతో ఉండే పరిస్థితి లేదని ఈ ఉదంతాలు రుజువుచేస్తున్నాయి. ఈ రెండు ఘటనల్లోనూ ఉగ్రవాదుల ఉద్దేశాలు, వారి లక్ష్యాలు సుస్పష్టమే. తమను వెంటాడుతున్న, తమను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వాలను ఏమీ చేయలేక ఆయా దేశాల పౌరులను, ముస్లిమేతరులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. నైరోబీ మాల్ యాజమాన్యంలో ఒక ఇజ్రాయెల్ పౌరుడికి వాటా ఉంది. అక్కడికి అన్ని దేశాల పౌరులూ వెళ్తుంటారు.
ఈ రెండు కారణాలూ చాలు...ఉగ్రవాదులు దాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి. దాడికి దిగిన అల్ కాయిదా అనుబంధ సోమాలియా మిలిటెంటు సంస్థ అల్ షబాబ్‌కు కెన్యాపై ఆగ్రహం కలగడానికి మరో కారణమూ ఉంది. రెండేళ్లక్రితం సోమాలియాలో అల్ షబాబ్ నేతృత్వంలో కిడ్నాప్‌లూ, హత్యలూ నిత్యకృత్యమైనప్పుడు కెన్యా అక్కడికి సాయుధ దళాలను పంపింది. అప్పటినుంచీ ఆ సంస్థను నడిపిస్తున్న అల్ కాయిదా అదునుకోసం వేచివుంది. అతి పెద్దదైన నైరోబీ మాల్‌కు దేశదేశాల పౌరులు, మరీ ముఖ్యంగా అమెరికా పౌరులు వస్తారుగనుక దాడికి దాన్ని తగిన వేదికగా నిర్ణయించుకుంది. ఇప్పటికీ ఎందరినో బందీలుగా ఉంచుకున్న అల్ షబాబ్ చర్చలు జరపడానికి కూడా అంగీకరించడంలేదు.
సోమాలియానుంచి కెన్యా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నదే దాని ఏకైక డిమాండ్. అల్ షబాబ్ సంస్థకు ఇలాంటి దాడులు కొత్తకాదు. మూడేళ్లక్రితం ఉగాండాలో ఫుట్‌బాల్ క్రీడను చానెళ్లలో వీక్షిస్తున్నవారిపై బాంబు దాడులు జరిపి 77 మంది ప్రాణాలను తీసింది. ఇదే నైరోబీలో 1998లో అల్ కాయిదాకు చెందిన తూర్పు ఆఫ్రికా విభాగం బాంబు దాడులకు దిగి 200మందిని హతమార్చింది. పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు కొత్తకాకపోయినా చర్చిపై ఇంత పెద్దయెత్తున దాడి జరగడం మాత్రం ఇదే ప్రథమం. ఈ దాడికి తామే బాధ్యులమని చెప్పుకున్న తెహ్రీకే తాలిబన్ అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఈ పనిచేసినట్టు ప్రకటించింది. ఒకపక్క పాకిస్థాన్ తాలిబన్లతో శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నవాజ్ షరీఫ్ చెబుతున్నా ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చలకు ముందు గిరిజన ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని పాకిస్థాన్ తాలిబన్ సంస్థ కోరుతోంది. ఈమధ్యే ఆ సంస్థ ఒక సైనిక జనరల్‌ను కూడా హతమార్చింది.
అమెరికా అయినా, దాని మిత్రదేశాలైనా ఉగ్రవాదాన్ని అంతమెందించడానికే పుట్టినట్టు చెప్పుకుంటాయిగానీ... తమ చర్యలతో ఆ దేశాలన్నీ దానికి నారూ, నీరూ పోస్తున్నాయని ఆనాటికానాటికి పెరుగుతున్న ఉగ్రవాద చర్యలే చెబుతున్నాయి. ఆఫ్రికాలోనే తీసుకుంటే పశ్చిమాన ఉన్న నైజీరియా మొదలుకొని ఉత్తరాన మాలి, మెఘ్రాబ్... తూర్పున సోమాలియా, కెన్యా వరకూ అడపా దడపా ఉగ్రవాద ఘటనలు జరుతూనే ఉన్నాయి. అల్ షబాబ్ సంస్థపై పాశ్చాత్య దేశాలకున్న అంచనాలన్నీ లోపభూయిష్టమే. కెన్యానుంచి పంపిన సాయుధ దళాల చర్యల తర్వాత అది చాలా బలహీనపడిందని, సంస్థను నడపడానికి అవసరమైన ఆర్ధిక వనరులుగానీ, మానవ వనరులుగానీ దానికి లేవని అంచనావేశాయి. దాన్ని సోమాలియానుంచి తరిమేయగలిగామని మురిసిపోయాయి. అయితే, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు సంప్రదాయ యుద్ధాలకు దిగవుగనుక వాటిని అంచనావేసే ప్రాతిపదికలే వేరుగా ఉండాలి. సంప్రదాయ యుద్ధాల్లో దళాల సంఖ్య, వారి వద్దనున్న ఆయుధాలు కీలకపాత్రవహిస్తే ఉగ్రవాద దాడులకు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమంది మనుషులు సరిపోతారు.
అసలు యుద్ధమనేది... దానికదే ఉగ్రవాదమైనప్పుడు ‘ఉగ్రవాదంపై యుద్ధం’ అర్ధంలేనిదవుతుంది. ఆమధ్య లిబియాలోనైనా, నిన్న మొన్న ఈజిప్టులోనైనా, ఇప్పుడు సిరియాలోనైనా తాము చేసే చర్యలు అంతిమంగా ఉగ్రవాదులకే ఉపయోగపడుతున్నాయని... అక్కడి మిలిటెంట్లకు తాము సరఫరా చేస్తున్న ఆయుధాలైనా, తాము పంపుతున్న డాలర్లయినా ఉగ్రవాదులకే చేరుతున్నాయని పాశ్చాత్యదేశాలకు తెలుస్తున్నా అవే తప్పులను పదే పదే చేస్తున్నాయి.
ఈ తప్పులు చేస్తూనే ఇంకోపక్క అఫ్ఘానిస్థాన్,యెమెన్ తదితర దేశాల్లో ద్రోన్ దాడులకు దిగి ఏటా వందలమంది ప్రాణాలు తీస్తున్నాయి. వీటిల్లో తరచుగా మరణించేది అమాయక పౌరులే. ఇలాంటి తప్పులన్నీ బాధిత కుటుంబాల్లో క్రోధాన్ని పెంచుతాయి. ఆ క్రోధానికి ఆజ్యం పోస్తున్నదీ, అది మరింత బలపడటానికీ ఉపయోగపడుతున్నవి ఎక్కడెక్కడో పంచుతున్న తమ ఆయుధాలు, డబ్బులేనని అమెరికా, మిత్రదేశాలు ఇప్పటికైనా గ్రహించడం మంచిది. కొన్ని గంటల వ్యవధిలో రెండు దేశాల్లో చోటు చేసుకున్న ఈ ఉగ్రవాద ఘటనలు చూశాక అయినా ఆ దేశాలు తమ వ్యూహాలను మార్చుకోవాలి. ప్రజలతో ప్రమేయం లేకుండా, వారి బాసట లేకుండా చేసే యుద్ధాలవల్ల వ్యతిరేక ఫలితాలే వస్తాయని గ్రహించాలి.