సరిగ్గా ఆరునెలల క్రితం, జులై 2018లో గాజా సరిహద్దుల్లో పాలస్తీనా సాయుధ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనికుడ్ని కాల్చి చంపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాయువేగంతో వైమానిక దాడులు జరిపింది. సున్నీ తీవ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన నలుగురు కీలక నేతల్ని తుదముట్టించింది. పశ్చిమాసియాలో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ మెరుపు వేగంతో ప్రతీకారం తీర్చుకుంది. జమ్ముకశ్మీర్‌లో పుల్వామా దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటనతో యావత్ దేశం రక్తం మరిగిపోతోంది. పగ, ప్రతీకారాలతో రగిలిపోతోంది. కానీ ఇజ్రాయెల్ మాదిరిగా దాడులకు పాల్పడే పరిస్థితి మనకు ఉందా ? పాక్‌పై యద్ధాన్ని ప్రకటించగలమా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలకి, భారత్, పాక్ ల మధ్య పోరాటానికి నైసర్గిక స్వరూపంలో ఎంతో వ్యత్యాసాముంది. అయినప్పటికీ భూతల వ్యూహాలు పన్నడం, భద్రతదళాల సన్నద్ధత, పాతకాలపు నిఘా వ్యవస్థ, రాజకీయ సంకల్పం వంటి అంశాల్లో ఇజ్రాయెల్ నుంచి పాఠాలు నేర్చుకునే అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు సమస్యలు ఒక్కటి కాకపోయినా ఇజ్రాయెల్ నుంచి భారత్ కొన్ని పాఠాలైనా నేర్చుకోవాలని అంటున్నారు.
దెబ్బకి దెబ్బ తీయాలి
ఘటన ఎంత చిన్నదైనా ఇజ్రాయెల్ దెబ్బకి దెబ్బ తీస్తుంది. పాలస్తీనా ఒక దెబ్బ కొడితే, తాను రెండు దెబ్బలు కొడుతుంది. భారత్ కూడా ఆ పని చేయగలగాలి. పాక్ మనపై దాడి చేస్తే అంతకు రెట్టింపుగా ఆ దేశం నష్టపడేలా చేయాలి. ఈ మార్గంలో వెళితే అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదమైతే ఉంది. పాకిస్థాన్ అందుకు సిద్ధంగానే ఉంది. ఒకవేళ మనం అంత పని చేయలేకపోతే కనీసం పాక్ భూభాగంపై మెరుపు దాడులకు దిగాలి. అక్కడ ఉగ్రవాద వ్యవస్థల్ని నాశనం చేసి పాక్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. కానీ ఇలాంటి దాడులు అన్నివేళలా సత్ఫలితాలు ఇస్తాయన్న నమ్మకమైతే లేదు. అన్నింటికంటే ముందు వివిధ రంగాల్లో మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
బలమైన సైనిక సంపత్తి పెంచుకోవాలి
ఇజ్రాయెల్ మాదిరిగా మనం కూడా సైనిక సంపత్తిని పెంచుకోగలగాలి. ముంబైపై 26/11 దాడుల తర్వాత భద్రతా దళాల సన్నద్ధతలో మనం ఎన్నో రకాలుగా మెరుగయ్యాం. మన పోలీసు వ్యవస్థ ఇప్పడు లాఠీలకు బదులుగా పిస్టల్స్ వాడుతోంది. కానీ ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం నాటి ఆయుధాలే ఇంకా సైన్యం చేతుల్లో ఉన్నాయి. కాలం చెల్లిపోయిన మిగ్ విమానాలు, ఆయుధాల కొనుగోలు ఒప్పందాల్లో ప్రభుత్వాల రాజీలు, యుద్ధ విమానాలు సొంతంగా తయారు చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్ ( హాల్), విస్తృతంగా కలిగి ఉన్న తీర ప్రాంతంలో భద్రతను కల్పించగలిగే సైనిక సత్తా లేకపోవడం వంటివన్నీ మన రక్షణ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాయి. భారత్ దగ్గర కంటే ఉగ్రవాదుల చేతుల్లోనే అత్యంత ఆధునిక రసాయన ఆయుధాలు ఉండడం ఆందోళనను పెంచుతోంది.
నిఘా వ్యవస్థని మెరుగుపరచాలి
మన నిఘా వ్యవస్థని ఆధునీకరించి, ఒక క్రమపద్ధతిలోకి తీసుకురావాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) సంస్థల మధ్య పరస్పరం సహకరించుకోవాలి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు 15 ఏళ్ల తర్వాత విధ్వంసకరమైన ఐఈడీని వినియోగించి కారు బాంబు దాడులకు దిగారు.కశ్మీర్‌లో దాడులు జరిగే అవకాశం ఉందని మాత్రమే హెచ్చరించిన ఇంటెలిజెన్స్ అవెలాంటి దాడులన్నది అంచనా వేయడంలో విఫలమైంది.
ఒంటరి పోరాటం చేయాలి
పాకిస్తాన్ ఉగ్రవాద వ్యూహాలతో మనపై కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి తన దళాలను ఉపసంహరించిన తర్వాత పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలన్న అభిప్రాయమైతే అమెరికాకు లేదు. పుల్వామా తరహా దాడులు జరిగినప్పుడు ఏదో ఖండన ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంటుందే తప్ప అంతకు మించి భారత్ పక్షాన నిలవదు. ఇక ఈ దాడుల సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చైనా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయంగా ఒంటరిపోరాటమే చేయాల్సిన అవసరం ఏర్పడింది. అరబ్బు ప్రపంచంలో ఎలాగైతే ఇజ్రాయెల్ ఒంటరిగా అందరినీ ఎదుర్కొంటోందో అదే తరహాలో మనమూ అడుగులు వేయాలి. ఇప్పుడదే మనకు అత్యంత ముఖ్యం. పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలను అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయాలి. సాక్ష్యాధారాలతో సహా పాక్‌ను దోషిగా నిలబెట్టాలి. మన∙సమస్యకు మనమే పరిష్కారం వెతుక్కోవాలి. అప్పుడే కథ ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగుస్తుంది.
కథ మొదలైన చోటే ముగింపు పలకాలి
Published Wed, Feb 20 2019 4:41 PM | Last Updated on Wed, Feb 20 2019 7:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment