అనేకవిధాల చరిత్రాత్మకమనదగ్గ కీలక ఎన్నికలకు సీమాంధ్ర ప్రాంతం సిద్ధమైంది. అక్కడ 25 లోక్‌సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకూ బుధవారం జరగబోయే ఎన్నికలకు సకల ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయి, ఇక విడిపోవడం లాంఛనప్రాయంకానున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలు కేవలం వచ్చే అయిదేళ్ల కాలాన్ని మాత్రమే కాదు..మొత్తంగా ఆ ప్రాంత భవిష్యత్తునే నిర్దేశించబోతు న్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అనేకానేక సంక్షేమ పథకాలను, అభినవ భగీరథుడై అత్యంత సాహసోపేతంగా ఆయన తలపెట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు హృదయాలకు హత్తుకుని 2009లో కాంగ్రెస్‌కు ఇక్కడ రెండోసారి అధికారాన్ని కట్టబెట్టడంతోపాటు 33 లోక్‌సభ స్థానాలను కానుకగా ఇచ్చారు. విపక్షాలన్నీ మహాకూటమిగా ఏకమైనా, సినీ తళుకుబెళు కులతో మరో పార్టీ రంగంలోకొచ్చినా ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కే పట్టంగట్టారు.
విశ్వసనీయతకూ, వంచనకూ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో వైఎస్‌వైపే దృఢంగా నిలబడ్డారు. పాలించేవారికి సహజంగా ఉంటుందనుకునే ‘అధికారపక్ష వ్యతిరేకత’(యాంటీ ఇన్‌కమ్‌బెన్సీ ఫ్యాక్టర్) భావనకే తావులేకుండా చేశారు. కానీ, నమ్మి నానబోస్తే పుచ్చిబూరటిల్లినట్టు వైఎస్ కనుమరుగైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం ఈ రాష్ట్ర ప్రజలపై పగబట్టింది. సర్వ సంక్షేమపథకాలకూ తిలోదకాలివ్వడమే కాదు... ప్రశ్నించేవారు లేరన్న భరోసాతో ఇరుప్రాంతాలమధ్యా వైషమ్యాలను రెచ్చగొట్టింది. రాష్ట్రాన్ని అగ్నిగుం డంగా మార్చింది. ఈ రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని మాత్రమే ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోవాల్సి ఉండగా, నాలుగేళ్లు కాలహరణంచేసి, ఆ కాలమంతా ఇరుప్రాంతాల నేతలతోనూ రెచ్చగొట్టే ప్రకటనలిప్పించి స్వీయప్రయోజనాల కాంక్షతో ఆఖరి క్షణంలో రాష్ట్ర విభజనకు ఉపక్రమించింది.
మరోపక్క దీనికి సమాంతరంగా వైఎస్ కుటుంబంపైనా, ప్రత్యేకించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా కాంగ్రెస్ అధిష్టానం కక్ష రాజకీయాలను కొనసాగించింది. ఓదార్పు యాత్రను విరమించుకోమన్న తమ సలహాను తిరస్కరించారన్న ఏకైక కారణంతో ఆయనను పార్టీలో ఒంటరిని చేయడానికి ప్రయత్నించింది. ఇందుకు నిరసనగా జగన్, ఆయన తల్లి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి, తమ చట్టసభల సభ్యత్వాలకూ రాజీనామా చేయాల్సివచ్చింది. అనంత రకాలంలో జగన్ సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వరస ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ అధిష్టానం తన ఎమ్మెల్యేతో హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయించి, అందుకు టీడీపీని కూడా తోడుతెచ్చుకుని ఆయనపై వేధింపుల పర్వానికి తెరతీసింది. సీబీఐ ద్వారా అక్రమ కేసులు బనాయించింది. తమకు రెండోసారి అధికారభిక్ష పెట్టారన్న కృత జ్ఞత కూడా లేకుండా వైఎస్ స్మృతికి కళంకం ఆపాదించే పాపకార్యానికి దిగజారింది. కానీ, ఏదీ సాధ్యంకాలేదు. అపారమైన ప్రజాభిమానం ముందు ఏదీ నిలబడలేదు. తాను కోల్పోయిన ప్రజాదరణను మరో ప్రాంతంలో రాబట్టుకోవచ్చునన్న ఏకైక కారణంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర విభ జన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇప్పుడిక సీమాంధ్ర ప్రాంతం తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సివుంది. నిన్నటివరకూ ఉన్నతవిద్యా అవకాశాలన్నా, ఉద్యోగాలన్నా, ఆరోగ్య సదుపాయాలన్నా కేరాఫ్ అడ్రస్ హైదరాబాదే. ఇకపై వీటన్నిటినీ సీమాంధ్ర ప్రాంతమే సమకూర్చుకోవాల్సివుంటుంది. ఉన్నతస్థాయి విద్యాసంస్థలను, అత్యున్నత శ్రేణి విద్యాబోధనను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తానే అన్వేషించుకోవాల్సి ఉంటుంది.ఉన్నతస్థాయి ఆరోగ్యసదుపాయాలను ఏర్పర్చుకోవాల్సి ఉంటుంది. సంక్షేమానికీ, అభివృద్ధికీ వైరుధ్యంలేదని...అవి రెండూ పరస్పరాశ్రీతాలు, పరస్పర పూరకాలు అని విశ్వసించి అవి సమానంగా వికసించేలా తన అయిదేళ్ల పాలనలో చర్యలు తీసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడలే ఆదర్శంగా సీమాంధ్రను తీర్చిదిద్దుతానని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇస్తున్నది. అటు వ్యవసాయాన్ని, ఇటు పరిశ్రమలను ప్రోత్సహించి కొత్త బంగారులోకాన్ని సృష్టిస్తానని చెబుతున్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చగల అయిదు సంతకాలు చేస్తానని వివిధ బహిరంగ సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, కుంటుబడిన పలు పథకాలకు జవజీవాలు కల్పిస్తానని ప్రకటించారు.
ఇందుకు భిన్నంగా 2009 ఎన్నికలనాటి ‘ఆల్ ఫ్రీ’ బాణీని చంద్రబాబు కొనసాగించారు. అంతేకాదు...తన చేతుల్లోలేని లక్షన్నర కోట్ల రూపాయల రైతు రుణమాఫీని ప్రకటించే సాహసం చేశారు. నరేంద్ర మోడీని, బీజేపీని నెత్తినెత్తుకుని తనది అవకాశవాద సిద్ధాంతామని రుజువుచేశారు. తన ప్రసంగాలను వ్యక్తిగత దూషణలతో నింపేశారు. ఇంతచేసినా విజయావకాశాలు కాస్తయినా కనబడకపోవడంతో సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఇంటికెళ్లి ప్రచారానికి వచ్చేలా ఆయనను ఒప్పించారు. అర్థంపర్ధంలేని పవన్ పలుకులు, హావభావాలు టీడీపీ, బీజేపీలకు లాభంకంటే నష్టాన్నే కొనితెచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలయ్యే వరకూ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం తమ ఘనతేనని చెప్పుకున్న బాబు అండ్ కో అటుతర్వాత సీమాంధ్రకొచ్చేసరికి స్వరం మార్చింది. ప్రసారమాధ్యమాల ప్రభావం అమితంగా పెరిగిన ఈకాలంలో కూడా నయవంచనకు తెగించింది. విజ్ఞులైన సీమాంధ్ర ఓటర్లు దీన్నంతటినీ గుర్తించారు. ఈ విజ్ఞతను ప్రదర్శించడానికి సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. ఇంకెంత... 24 గంటలు!
చరిత్రాత్మక సమరం!
Published Mon, May 5 2014 12:10 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement