ఈమధ్యనే బుల్లెట్ రైలును కలగనడం ప్రారంభించిన రైల్వే శాఖ చరి త్రలో ఇదొక నెత్తుటి పుట. కాపలాదారులేని లెవెల్ క్రాసింగ్‌లు జనం ప్రాణాలు తీస్తున్నాయని తెలిసికూడా దశాబ్దాల నుంచి పట్టనట్టుగా ఉండిపోయిన రైల్వేశాఖ నిర్లక్ష్యం సాక్షిగా గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 14 పసిమొగ్గలు రైలు పట్టాలపై నెత్తుటి ముద్ద లుగా మిగిలారు. ఇరవైమందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పొద్దుటే హడావుడిగా నిద్రలేచి స్కూలుకు తయారై అమ్మానాన్నలకు టాటా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే చోటుచేసుకున్న ఈ విషాదం కన్న వారినే కాదు... యావత్తు దేశ ప్రజలనూ తీవ్రంగా కలచివేసింది.
ప్రమాదం జరిగిందని తెలిశాక రైల్వేశాఖ, సర్కారు స్పందించిన తీరు ఎంత యాంత్రికంగా ఉన్నదో గమనిస్తే...లోక్‌సభలో ఈ ఉదంతం ప్రస్తావనకొచ్చినప్పుడు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మరో ప్రమాదం సంభవించబోదన్న భరోసా ఏమీ కలగదు. మరణించినవారి కుటుంబాలకు, గాయపడినవారికి పరిహారాన్ని ప్రకటించి, ప్రమాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఊరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం ప్రకటించారు. సదానందగౌడ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, ఇవన్నీ సరిపోవు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రైల్వేమంత్రి హుటాహుటీన ఘటనాస్థలికి రావాలి. వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబాలకు సాంత్వన వాక్యాలు పలకాలి. తమ శాఖనుంచి జరిగిన వైఫల్యమేమిటో గమనించాలి.
ఇవి చేసినంతమాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావన్నది నిజమే. తల్లడి ల్లుతున్న ఆ తల్లిదండ్రుల జీవితాల్లో నెలకొన్న విషాదం తొలగిపోద న్నదీ వాస్తవమే. కానీ, అలా చేయడంవల్ల రైల్వే శాఖ ఎంత సున్ని తంగా ఆలోచిస్తున్నదో, జరిగిన ఘటనపై ఆ శాఖ మంత్రిలో ఎంత ఆందోళన నెలకొనివున్నదో దేశానికి తెలుస్తుంది. భవిష్యత్తులో ఇక ఇలాంటివి పునరావృతం కాని విధంగా చర్యలుంటాయన్న విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసాన్ని కలగజేయ డంలో సదానందగౌడ విఫలమయ్యారు.
రైల్వే భద్రతపై నియమించిన అనేకానేక కమిటీల్లో ఒకటైన అనిల్ కకోద్కర్ కమిటీ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన నివేదిక భద్రత విషయంలో తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. లెవెల్ క్రాసింగులను వెనువెంటనే తొలగించి వాటి స్థానంలో ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలు, సబ్‌వేలు నిర్మించాలన్నది అందులో ఒకటి. ఇందుకు రూ. 40,000 కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది.
కాపలాదారులేనిచోట సరేగానీ...ఉన్నచోట ఇప్పుడ వుతున్న ఖర్చంతా ఆదా అవుతుందని, పైగా రైళ్లు నిరాఘాటంగా, వేగంగా వెళ్లడానికి వీలవుతుంది గనుక ఆ మేరకు ఇంధనం కలిసొ స్తుందని వివరించింది. వీటన్నిటి పర్యవసానంగా ఏడెనిమిదేళ్లలోనే ఈ వ్యయాన్ని రాబట్టుకోవచ్చునని తెలిపింది. కానీ, ప్రతి రైల్వే బడ్జెట్ లోనూ ఇందుకోసం కేటాయించే మొత్తం చాలా స్వల్పం. గత పదేళ్ల యూపీఏ పాలనలోనే క్షమార్హంకాని నిర్లక్ష్యం కొనసాగిందనుకుంటే... మొన్నటి ఎన్డీయే రైల్వే బడ్జెట్‌లో కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగ్‌లను ఎత్తేయడానికి కేటాయించిన సొమ్ము రూ. 1,600 కోట్లు. దేశమంతా ఉన్న రైల్వే గేట్లను మార్చడానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే దాదాపు 1,200 రైల్వే గేట్లున్నాయని అంచనా.
ఇందులో దాదాపు 500 గేట్లు గత నాలుగేళ్లలో తీసేయగ లిగారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారును పెట్టడానికి కొన్ని లక్షలు ఖర్చవుతాయి. ఓవర్ బ్రిడ్జి లేదా సబ్‌వే నిర్మిస్తే రూ. 2 కోట్ల వరకూ వ్యయమవుతుంది. 2016 నాటికల్లా అన్ని లెవెల్ క్రాసింగ్ లనూ కాపలా గేట్లుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్నా బడ్జెట్‌లో చేసే కేటాయింపులు దానికి దీటుగా ఉండటంలేదు. చిత్రమేమంటే, రైల్వే శాఖ వైపునుంచి ఇంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనడంలేదు.
ఇక కాపలాదారులున్న రైల్వే గేట్లవద్ద భద్రతకూడా అంత గొప్పగా ఏమీ లేదు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా బాధ్యతను రైల్వేశాఖ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెబుతోంది. 2001 నుంచి ప్రయాణికుల టిక్కెట్లపై భద్రతా సుంకం వసూలు చేస్తున్నారు. ‘అలా చేయడం ద్వారా మా బాధ్యతను పెంచుకుం టున్నాం’ అని ఆనాటి రైల్వే మంత్రి నితీష్‌కుమార్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. కానీ, ఆచరణలో జరిగిందేమిటి? లెవెల్ క్రాసింగ్‌లు ఎప్పటిలానే ఉన్నాయి.
వేల సంఖ్యలో ఉన్న కాలంచెల్లిన వంతెనలూ అలాగే ఉన్నాయి. నాసిరకం పట్టాలూ మారలేదు. వీటన్నిటినీ సరిచేయడానికి అవసరమైన కేటాయింపులు చేయడానికి బదులు తాజా బడ్జెట్‌లో బుల్లెట్ రైలు ప్రతిపాదనలు మాత్రం దూసుకొచ్చాయి. లోపాలన్నిటినీ యధాతథంగా ఉంచి బుల్లెట్ రైళ్లు నడిపినంత మాత్రాన మనకొచ్చే ఖ్యాతి ఏమీ ఉండదు. తమ పిల్లలు తమలాంటి జీవితం అనుభవించకూడదని, వారికి మంచి భవిష్యత్తు అందించాలన్న తపనతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు.
పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్వెంట్‌కు స్కూలు బస్సులో పంపితే పిల్లలు సురక్షితంగా ఉంటారన్న భరోసాతో మరింత సొమ్మును అదనంగా ఖర్చుచేస్తున్నారు. సరైన పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోలేని యాజ మాన్యం చివరకు తమకు కడుపుకోత మిగులుస్తుందని వారు ఊహిం చివుండరు. ఈ ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మేల్కొని లెవెల్ క్రాసింగ్‌ల విషయంలో కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలి. ఈ కృషిలో మిగిలిన రాష్ట్రాలను కూడా కలుపుకోవాలి. అలాగే, పాఠశాలలకు ఉదయమూ, సాయంత్రమూ ఆర్టీసీ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాలి.
పట్టాలపై నెత్తుటి చారిక!
Published Fri, Jul 25 2014 12:28 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement