కాషాయం ధరించని కర్మయోగి-శివానంద | tribute to shivananda guru | Sakshi
Sakshi News home page

కాషాయం ధరించని కర్మయోగి-శివానంద

Published Thu, Jun 11 2015 1:04 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

కాషాయం ధరించని కర్మయోగి-శివానంద - Sakshi

కాషాయం ధరించని కర్మయోగి-శివానంద

నివాళి

ధర్మశాస్త్రాలు మథించవచ్చు. ఆచరించినవారు ఎంతమంది ఉంటారు? ధన సంపదలు కొల్లలుగా ఉండవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకొన్న వారు ఎంత మంది? ధర్మాన్నీ, ధనాన్నీ, జ్ఞానాన్నీ ఆచరణలో సద్వినియోగం చేసిన కర్మ యోగి... భూస్వామిగా జన్మనె త్తినా.. నిరుపేద వైపు నిలిచిన మానవతామూర్తి శివానం ద మూర్తి (డిసెంబర్ 21, 1928-జూన్ 10, 2015).

శివానందమూర్తిగారి గురించి ఒక్కమాటలో చెప్ప మని ఎవరినైనా అడిగితే, ఆయన ‘ప్రేమమూర్తి’ అని వెంటనే చెబుతారు. తెల్లని బట్టల్లో, తెల్లని విభూతిరేఖల మధ్య, వికసించే తెల్లని నవ్వుతో ఆశీర్వదించే ఆ రూపం -ఆనందస్వరూపంగా దర్శనమిస్తుంది. ప్రాథమిక పాఠ శాల తెలుగు ఉపాధ్యాయునిలా కనిపించే ఆ మూర్తి ఎం దరికో జీవితపాఠాలు చెప్పింది. శివానందమూర్తిగారు పీఠాధిపతి కాదు. కానీ ఎందరో పీఠాధిపతులకు ఆద ర్శంగా నిలుస్తారు. ప్రేమ, సేవ ఆయన మార్గాలు.

కందుకూరి శివానందమూర్తి ఉర్లాం (శ్రీకాకుళం జిల్లా) సంస్థానానికి వారసులు. పూర్వులంతా సంస్థానా ధీశులు, భూస్వాములు. సర్వమంగళ, వీరబసవరాజు దంపతులకు రాజమండ్రిలో జన్మించా రు. 1949లో విజయనగరం ఎమ్మార్ కళాశాలలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సంస్థానాధీశుల నేపథ్యం ఉన్నా, శివానందమూర్తి సామాన్యుడి గా జీవించడానికే ఇష్టపడ్డారు. ఆ తత్వ మే ఉద్యోగం వైపు తీసుకువెళ్లింది. హన్మకొండలో పోలీస్‌శాఖలో చేరారు. అది కొంతకాలమే. తరువాత సామా జిక సేవ కోసం ఉద్యోగాన్ని వదిలిపె ట్టారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ‘ఆనందవనం’ పేరుతో ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు.

సనాతన ధర్మ ప్రచారం, భారతీయ సంస్కృతి, వారస త్వాల గురించి బోధించడం; సంగీతం, సాహిత్యం వంటి లలితకళలకు చేయూతనిచ్చి సేవచేయడం కోసం మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. ఆధ్యాత్మిక దృష్టి, జ్ఞానతృష్ణ, పేదసాదలకు సేవ తండ్రిగారి నుంచి శివా నందమూర్తి వారసత్వంగా పొందారు. ఆ మార్గం లోనే జీవితమంతా గడిపారు. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నో రచనలు చేశారు. యోగశాస్త్రాన్ని తనివితీరా మథించారు. ‘భారతదేశం పేదది కాదు, ప్రజలే పేదల య్యారు’ అన్నది ఆయన అభిప్రాయం.

సంపద ఏ ఒక్క రి సొత్తూ కారాదు, భౌతిక సంపద, జ్ఞాన సంపద అం దరికీ అందాలన్నది ఆయన భావన.
 శివానందమూర్తి ఎన్నో గిరిజన ప్రాంతాలను సందర్శించారు. అక్కడి జనంతో మమేకమయ్యారు. భీమిలి లోని ఆనందవనం పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఉంటుంది. అక్క డ జరిగే కార్యక్రమాలకు ఎక్కువగా పేదవాళ్లే వస్తూ ఉంటారు. వారి దయ నీయ జీవనం చూసి శివానందమూర్తి కన్నీళ్లు పెట్టుకునే వారు. వారికి ఏదైనా చేయాలని తపన పడేవారు.

శివానందమూర్తిగారికి జర్నలిజం అంటే ఇష్టం. ఇం గ్లిష్ పత్రిక ఒకటి స్థాపించాలన్న ఆలోచన కూడా ఉం డేది. చదువుకునే రోజులలో ఖాసా సుబ్బారావుగారితో ఎక్కువ అనుబంధం పెంచుకున్నారు. ‘సుపథ’ పేరుతో ఒక పత్రిక శివానందమూర్తి ఆధ్వర్యంలో నడిచింది.

శివానందమూర్తి గొప్ప పుస్తకాభిమాని. వ్యక్తిగత గ్రంథాలయంలోనే కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. తన తండ్రి పుస్తక భాండాగారంలోని 13 వేల పుస్తకాలను ఆయన చదివారట. సనాతన ధర్మం, చరిత్ర, లలిత కళలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, యోగం, సైన్సు, వైద్యం, సాంకేతిక శాస్త్రం, జర్నలిజం- ఇలా అన్ని రంగాలపైన ఆయన అసాధారణమైన జ్ఞానాన్ని సంపాదించారు. దానిని పదిమందికీ పంచారు.

‘కఠోపనిషత్’ మీద శివానందమూర్తి రాసిన పుస్త కం కంచి పరమాచార్య, శృంగేరి శంకరాచార్యుల మన్నన లను పొందింది. హిందూ వివాహ వ్యవస్థ, మహర్షుల చరిత్ర, గౌతమబుద్ధ వంటి అంశాలపై ఆయన వెలు వరించిన రచనలు చిరస్థాయిగా ఉన్నాయి.

సనాతన చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్ర మ్యూజిక్ అకా డమీలు స్థాపించి ధర్మానికీ, జ్ఞానానికీ సిసలైన వేదికలను నిర్మించి పెట్టారు. పీవీ నరసింహారావు వంటి రాజనీతి జ్ఞుని మొదలు, ఆధునిక సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు అంతా ఆయన అభిమానులే. దేశవిదేశాల్లో ఎందరో శిష్యులు, అభిమానుల ప్రేమకు పాత్రులైన వారు శివానందమూర్తి.

‘నాకు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి పెద్దగా ఆలోచ నలు లేవు. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ కోసమే నేను ఆలోచిస్తాను’ అని శివానందమూర్తిగారు నాతో అనేవారు. నిజంగానే.. తన చివరి మజిలీలో కూడా చిరునవ్వు చిందిస్తూ, అంద రినీ ఆశీర్వదిస్తూనే వెళ్లిపోయారు. ఎక్కడి ఉర్లాం? ఎక్కడి ఓరుగల్లు? (శివానందమూర్తి ఇక్కడే కన్నుమూశారు.) విశ్వమానవునిగా జీవించి, తోటి జీవులను ప్రేమించి సేవించిన కర్మయోగి శివానందమూర్తిగారికి అంజలి ఘటిస్తున్నాను.
 
 - మా శర్మ
 (వ్యాసకర్త టాలీవుడ్ చానల్ సీఈఓ) మొబైల్: 9393102305

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement