సంపాదకీయం: అయిదేళ్ల కాలానికి ఎన్నికై గద్దెనెక్కిన ప్రభుత్వం గురించి వంద రోజులకే మదింపు వేయడం న్యాయమూ కాదు... అదంత సులభమూ కాదు. కేవలం మూడునెలల పదిరోజుల వ్యవధిలోనే ఏ ప్రభుత్వమైనా ఏదైనా సాధించగలదనుకోవడం అత్యాశే. అయితే, ఈ వంద రోజుల్లోనూ ఆ ప్రభుత్వం నడక, నడత ఎలా ఉన్నాయి... అది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది, దాని నిర్వహణ ఎలా సాగుతున్నదనే అంశాలనుబట్టి ఆ ప్రభుత్వ పోకడల గురించి ఒక అభిప్రాయానికి రావొచ్చు. అది ఆశాజనకంగా కనబడుతున్నదా... పాత వాసనలతో, పాత బాణీలో కొట్టుకుపోతున్నదా అనే అంశాలు స్థూలంగా తెలిసే అవకాశం ఉంటుంది.
ఎందుకొచ్చిందోగానీ ‘వంద’కు మన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. దీవించేటపుడు ‘శతమానం భవతి...’ అనడం మన దగ్గర సర్వసాధారణం. గతంలో సినిమాలకు శత దినోత్సవాలుండేవి. 2009 నాటి ఎన్నికల్లో అప్పటి యూపీఏ సర్కారు ఈ ‘వంద’కు తెగ ప్రచారం చేసిపెట్టింది. వందరోజుల్లో ఇవి చేస్తాం...అవి చేస్తామంటూ జనాన్ని ఊరించింది. అందులో మహిళా రిజర్వేషన్లు మొదలుకొని స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తీసుకురావడం వరకూ ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మరికొన్ని వందల రోజులు గడిచినా అందులో ఏ ఒక్కటీ సాధించలేక ఆ సర్కారు చతికిలబడింది. ముందు జాగ్రత్తనో ఏమోగానీ బీజేపీ ఎక్కడా వందరోజుల లక్ష్యం గురించి హోరెత్తించలేదు.
ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే రోజున సార్క్ దేశాల అధినేతలంతా హాజరుకావడం...సరిగ్గా వందరోజుల పాలనను పూర్తిచేసుకున్న సందర్భంలో ఆయన జపాన్ పర్యటనలో ఉండటం యాదృచ్ఛికం కాదు. ఆయన కావాలని నిర్ణయించుకున్న సందర్భాలవి. జపాన్ పర్యటనకు ముందు ఆయన ప్రత్యేకించి ఎంచుకుని ఇరుగు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్ వెళ్లడం...మధ్యలో బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సదస్సుకు హాజరై ఎన్నాళ్లనుంచో ప్రతిపాదన రూపంలోనే ఉండిపోయిన బ్రిక్స్ బ్యాంకును సాకారం చేయడంలో కీలకపాత్ర పోషించడం గమనిస్తే ప్రపంచ దేశాల్లో... ముఖ్యంగా ఇరుగుపొరుగులో మన పలుకుబడీ, ప్రతిష్టా పెరగడానికి మోడీ ప్రత్యేక శ్రద్ధవహించడాన్ని గుర్తించగలుగుతాము. ప్రమాణ స్వీకారం సమయంలో పాకిస్థాన్‌కు స్నేహహస్తం చాచినా, మన అభీష్టానికి భిన్నంగా కాశ్మీర్ వేర్పాటువాదులతో ఆ దేశ హైకమిషనర్ సమావేశం కావడాన్ని నిరసిస్తూ ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు ఆయన నిర్మొహమాటంగా తలుపులు మూశారు. ఈ వంద రోజుల్లోనూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అత్యంత కీలకమైనవి. రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను అనుమతించడం, న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థకు మంగళం పాడటం, బీమా రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు వీలుకల్పిస్తూ బిల్లు రూపొందించడం, నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు, జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రోజే బ్యాంకుల్లో కోటిన్నర ఖాతాలు ప్రారంభమయ్యేలా చూడటం, కాంగ్రెస్ గవర్నర్లను వదుల్చుకోవడం అందులో ప్రధానమైనవి. ‘ప్రధాని అంటే తొలి ప్రజా సేవకుడ’న్న జవహర్‌లాల్ నెహ్రూ మాటను స్వీకరించినా, ఆయన మానసపుత్రిక ప్రణాళికా సంఘానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించడం కూడా అత్యంత ముఖ్యమైనది.
ఈ వందరోజుల్లో నిజమో, కాదో తెలియని కొన్ని వదంతులు కూడా మోడీపై బాగా ప్రచారంలోకొచ్చాయి. ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటికి భోజనానికి వెళ్లగా ‘ఇలాంటివి సరి కాద’ంటూ ఆయన సెల్‌కు సందేశం వెళ్లడం, అత్యవసర పనుందంటూ ఆయన కాస్తా వెనుదిరగడం అందులో ఒకటి. మరో కేంద్రమంత్రి గౌహతి విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే ‘ప్రధాని కార్యాలయానికి వర్తమానం లేకుండా ఇకపై ఇలా చేయొద్ద’ంటూ తాఖీదు...కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కార్యాలయంలో బగ్గింగ్ పరికరాలు బయటపడటం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆయన కుమారుణ్ణి పిలిచి ఒక అంశంలో మందలించడం వంటివి మరికొన్ని వదంతులు. వీటికి రుజువులూ, సాక్ష్యాలూ లేవు. కానీ, మంత్రులస్థాయి వ్యక్తులపై కూడా నిఘా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ వదంతులన్నీ కలగజేశాయి. వీటి సంగతలా ఉంచి పీఎంఓలో మోడీ వచ్చే సమయానికే సిబ్బందంతా పనిపట్ల భయభక్తులతో హాజరవుతుండటం మాత్రం వాస్తవం. జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడి 5.7 శాతానికి చేరుకోవడం రెండున్నరేళ్ల తర్వాత ఈ త్రైమాసికంలో మాత్రమే సాధ్యపడింది.
పారిశ్రామిక ఉత్పాదకత విషయంలోనూ ఈ ధోరణే కనబడింది. అయితే ద్రవ్యోల్బణం ఇంకా లొంగి రాలేదు. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కళ్లెం పడలేదు. ప్రధాని అయినా, కేంద్రమంత్రులైనా పత్రికా ప్రకటనలు జారీచేయడం... పత్రికలనూ, చానళ్లనూ కాదని ట్విటర్, ఫేస్‌బుక్, ఎస్సెమ్మెస్‌వంటి ఇతరేతర మాధ్యమాలను ఎంచుకోవడం కొత్త పోకడ. ఈ వంద రోజుల్లోనూ ప్రత్యర్థి కాంగ్రెస్ మాటేమోగానీ... పరస్పరం బద్ధ శత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీవంటి పార్టీలు మోడీ భయానికి దగ్గరయ్యాయి. సీపీఎంతో కలవడానికి సిద్ధమేనని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. ఏదేమైనా జనం మార్పును కోరుకుని బీజేపీని గెలిపించారు. ఈ వందరోజుల్లోనూ ఆ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. ఈ సర్కారు పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఎన్నయినా ఉండొచ్చుగానీ... దీనికి చలనశీలత దండిగా ఉన్నదని అందరూ అంగీకరిస్తారు. అది రాగల రోజుల్లో సుఫలాలను అందించే దిశగా సాగాలని ఆశిస్తారు.
శత దిన సంరంభం!
Published Wed, Sep 3 2014 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement