ఉత్సాహభరితమైన కెరీర్‌కు.. బార్ టెండర్ | Bar tenders course can be made up to bright future | Sakshi
Sakshi News home page

ఉత్సాహభరితమైన కెరీర్‌కు.. బార్ టెండర్

Published Mon, Sep 29 2014 11:48 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

ఉత్సాహభరితమైన కెరీర్‌కు.. బార్ టెండర్ - Sakshi

ఉత్సాహభరితమైన కెరీర్‌కు.. బార్ టెండర్

బార్లు, పబ్బుల్లో రంగురంగుల మద్యం సీసాలను ఒకచేత్తో గాల్లోకి విసురుతూ మరోచేత్తో ఒడుపుగా పట్టుకుంటూ చూపరులను ఆశ్చర్యపరిచే వ్యక్తులను బార్‌టెండర్లు అంటారు. వినియోగదారుల అభిరుచికి తగిన మధువును అందించడం వీరి బాధ్యత. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో కార్పొరేట్ సంస్కృతి వేగంగా విస్తరిస్తుండడంతో బార్‌టెండర్లకు గిరాకీ పెరుగుతోంది. అందుకే దీన్ని కెరీర్‌గా మలచుకుంటే అవకాశాలకు కరువే ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.
 
 ఫ్రీలాన్స్‌గానూ ఎన్నో అవకాశాలు
 బార్‌టెండర్ అంటే కౌంటర్ వెనుక నిల్చొని మద్యం సరఫరా చేసే ఉద్యోగి మాత్రమే కాదు. వినియోగదారులను ఆనందపర్చడం, సందర్భానికి తగిన ఆహార పదార్థాలను అందించడం వంటి బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. బార్‌టెండర్లకు స్టార్ హోటళ్లు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, రిసార్‌‌టలు, నైట్‌క్లబ్బులు, క్రూయిజ్ షిప్పుల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నివాస గృహాల్లో జరిగే విందుల్లోనూ బార్‌టెండర్ల భాగస్వామ్యం ఉంటోంది. పార్టీల సీజన్‌లో ఫ్రీలాన్స్‌గా కూడా పనిచేసుకోవచ్చు. బార్‌టెండర్ల విధులు సాధారణంగా రాత్రిపూటే ఉంటాయి. రాత్రి సమయాల్లో పనిచేసేందుకు సిద్ధపడేవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. బార్‌టెండర్లకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలుంటాయి. పనితీరును మెరుగుపర్చుకుంటే  హాస్పిటాలిటీ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ప్రారంభంలో వేతనాలు తక్కువగానే ఉన్నప్పటికీ వినియోగదారుల నుంచి టిప్పులు భారీగానే అందుతాయి.
 
 కావాల్సిన స్కిల్స్:
 బార్‌టెండర్లకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్నేహభావం అవసరం. కొత్త వ్యక్తులతో చొరవగా మాట్లాడే నేర్పు కావాలి. ఆత్మవిశ్వాసం ఉట్టిపడే బాడీ లాంగ్వేజ్ ఉండాలి. నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలగాలి. బేవరేజెస్‌పై తగిన పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తకొత్త కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్ సృష్టించాలి.
 
 అర్హతలు:  
 మన దేశంలో బార్ టెండింగ్‌లో స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదే రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనుకుంటే.. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఒకవైపు ఈ కోర్సు చదువుతూనే బార్లలో పనిచేసుకోవచ్చు. కోర్సుల వ్యవధి రెండు నుంచి నాలుగు నెలలు ఉంటుంది. ఫీజు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంది. కోర్సులో భాగంగా వైన్, స్పిరిట్స్, మిక్సాలజీపై అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా బార్ స్కూల్స్ సహకరిస్తాయి.
 
 వేతనాలు:  
 స్టార్ హోటళ్లు, పబ్బుల్లో బార్‌టెండర్లకు అధిక వేతనాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు అందుకోవచ్చు. సీనియారిటీ ఆధారంగా వేతనం పెరుగుతుంది. అనుభవాన్ని బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేలు పొందొచ్చు. బార్‌లో ట్రైనీకి రూ.3,500 నుంచి రూ.5 వేలు చెల్లిస్తారు. స్కిల్డ్ బార్‌టెండర్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం ఉంటుంది. దీంతోపాటు ఆకర్షణీయమైన టిప్పులు లభిస్తాయి. ఫ్రీలాన్స్ బార్‌టెండర్‌గా పనిచేస్తే పార్టీల సీజన్‌లో ఒక్క రోజులో రూ.3 వేలు సంపాదించుకోవచ్చు. బార్‌టెండర్‌గా పనిచేస్తూ అనుభవం పెంచుకొని స్టార్ హోటళ్లలో ఫుడ్ అండ్ బేవరేజ్(ఎఫ్ అండ్ బీ) మేనేజర్ స్థాయికి చేరుకుంటే  నెలకు రూ.లక్ష వేతనం పొందొచ్చు. యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో భారీ జీతభత్యాలు ఉంటాయి.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
     ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బార్‌టెండింగ్-హైదరాబాద్
    వెబ్‌సైట్: www.bartendingindia.com
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బార్‌టెండింగ్
    వెబ్‌సైట్: www.iibtindia.com
     కాక్‌టెయిల్స్ అండ్ డ్రీమ్స్ బార్ స్కూల్
     వెబ్‌సైట్: http://ahta.in/cd_why.htm
     తులీహో పోర్టల్స్
     వెబ్‌సైట్: http://tulleeho.com/
     ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బార్ ఆపరేషన్స్ అండ్         
 
 మేనేజ్‌మెంట్     
 వెబ్‌సైట్: http://barwizard.in/
     బి మన్‌‌స స్కూల్ ఆఫ్ బార్‌టెండింగ్
     వెబ్‌సైట్: www.bmanns.net
 
 పెరుగుతున్న అవకాశాలు
 ‘‘ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన లగ్జరీ పార్టీ ట్రెండ్ చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. బార్లలో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వైన్ మిక్స్ చేసి ఇవ్వడం బార్‌టెండర్ల డ్యూటీ. బార్లు, రెస్టారెంట్స్, స్టార్ హోటళ్లు, పబ్బులో బార్‌టెండర్ పాత్ర కీలకం. పార్టీ సక్సెస్ కావడం వీరిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంత ఆల్కహాల్ ఇవ్వాలనేది కస్టమర్ల వయసును బట్టి నిర్ణయించాలి. మోతాదు మించకుండా సమపాళ్లలో అందించాలి. వైన్ అందించడమేకాదు.. ఫుడ్ సర్వ్ చేయడం, బిల్స్ వసూలు చేయడం వంటివి కూడా వీరి విధి నిర్వహణలో భాగమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో పార్టీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇక్కడ 24 గంటలూ వైన్ ఔట్‌లెట్స్‌కు అనుమతులిస్తున్నారు. దీంతో బార్‌టెండర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. నగరంలోనూ బార్‌టెండింగ్ శిక్షణా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందడం వల్ల కోర్సు పూర్తయ్యాక విదేశాల్లోనూ పనిచేయొచ్చు. ఆంగ్ల భాషపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కెరీర్‌లో రాణించొచ్చు’’
 - కృష్ణచైతన్య, డెరైక్టర్, బార్ మాస్టర్,
  ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బార్‌టెండింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement