అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్‌సీ | Best University of IISC | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్‌సీ

Published Thu, Apr 6 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్‌సీ

అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్‌సీ

జాతీయం
దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారి ని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 2న ప్రారంభించారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని చెనాన్‌–నష్రి ప్రధాన రహదారి లో భాగంగా 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గ రహదారిని నిర్మించారు. దీని కోసం ప్రభుత్వం రూ.3720 కోట్లను వెచ్చించింది. దీని నిర్మాణంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గడంతోపాటు ఏటా రూ.99 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా.

బీఎస్‌–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిషేధం
భారత్‌ స్టేజ్‌–4 (బీఎస్‌–4) కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాల అమ్మకాలను, రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ మార్చి 29న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బీఎస్‌–3 ఇంజన్లు కలిగిన వాహనాలు బీఎస్‌–4 వాహనాలతో పోల్చితే 80 శాతం అధికంగా కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తాయి.

భారత్, మలేసియాల మధ్య 7 ఒప్పందాలు
మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్‌ 1న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మలేసియాను సందర్శించే భారత పర్యాటకులను ప్రోత్సహించేలా వీసా రుసుము రద్దు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో అనుమతి, రెండు దేశాల్లోని కోర్సులకు పరస్పరం గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి.

అత్యుత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్‌సీ
దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఏప్రిల్‌ 3న విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్‌ కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ప్రథమ స్థానంలో నిలిచింది. తొలి పది స్థానాల్లో ఏడు ఐఐటీలకు చోటు దక్కింది. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్, ఇంజనీరింగ్‌ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ విభాగంలో ఐఐఎస్‌సీ ప్రథమ స్థానంలో నిలవగా, హెచ్‌సీయూకి 7వ స్థానం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 23వ స్థానం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 68వ స్థానం, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 69వ స్థానం దక్కాయి.

హైవేలపై మద్యం నిషేధం
జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు మార్చి 31న ఆదేశించింది. 2016, డిసెంబర్‌ 15కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాలు) వారికి మాత్రం కొంత గడువు ఇచ్చింది.

రాష్ట్రీయం
ఇండియన్‌ ఐడల్‌గా రేవంత్‌ తెలుగు గాయకుడు ఎల్‌వీ రేవంత్‌ ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌–9 ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఏప్రిల్‌ 2న ముంబైలో ముగిసిన షోలో విజేతగా నిలిచిన రేవంత్‌కు మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీ అందించాడు. మరో తెలుగు యువకుడు రోహిత్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్‌ ఐడల్‌–5 సీజన్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు.

ఏపీలో హెచ్‌సీఎల్‌ ఏర్పాటుకు ఒప్పందం
విజయవాడలో హెచ్‌సీఎల్‌.. బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీఎల్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

అంతర్జాతీయం
ప్రపంచంలో 30 కోట్ల మందికి డిప్రెషన్‌డిప్రెషన్‌ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్‌కు గురవుతున్నవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ చాన్‌ ఏప్రిల్‌ 2న తెలిపారు.

వాతావరణ ఒప్పందాలను రద్దు చేసిన ట్రంప్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వాతావరణ మార్పులపై రూపొందించిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై మార్చి 28న సంతకం చేశారు. దీంతో ఇంధన వెలికితీత, బొగ్గు తవ్వకానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్న పాత విధానాలు రద్దయినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిలువరించామన్నారు. విద్యుచ్ఛక్తి ఉద్గారాల నియమాలను సమీక్షించాలని, శిలాజ ఇంధనాల వెలికితీతకు ప్రతిబంధకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ట్రంప్‌ ఆదేశించారు.

బ్రెగ్జిట్‌ ఉత్తర్వులపై బ్రిటన్‌ ప్రధాని సంతకం
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు(బ్రెగ్జిట్‌) ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే మార్చి 29న సంతకం చేశారు. దీని ప్రకారం ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 దేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్‌ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్‌ ప్రకటించింది. ఈయూలోని బ్రిటన్‌ రాయబారి సర్‌ టిమ్‌ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్‌ మండలి అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌కు అందించారు. ఈ రెండేళ్లలో ఈయూ సభ్య దేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్‌ తెగదెంపులు చేసుకుంటుంది. కాగా, ఈయా దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని బ్రిటన్‌ ప్రధాని పేర్కొన్నారు.

రిఫరెండం నిర్వహించాలని స్కాట్లాండ్‌ నిర్ణయం
బ్రిటన్‌ నుంచి విడిపోయే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్‌ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్‌బర్గ్‌లో మార్చి 28న సమావేశమై.. రిఫరెండానికి అనుకూలంగా ఓటేశారు.

ఆర్థికం
జీఎస్టీకి లోక్‌సభ ఆమోదం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులకు లోక్‌సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సెంట్రల్‌ జీఎస్టీ బిల్లు–2017, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ బిల్లు–2017, యూనియన్‌ టెరిటరీ జీఎస్టీ బిల్లు–2017, జీఎస్టీ పరిహార(రాష్ట్రాలకు) బిల్లు–2017లను లోక్‌సభ ఆమోదించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు కొత్తగా ఐటీఆర్‌ 1 ఫామ్‌
ఐటీ రిటర్న్స్‌ను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీతో కూడిన ఐటీఆర్‌ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న ఏడు పేజీల ఐటీఆర్‌ పత్రం స్థానంలో ఆదాయపన్ను శాఖ కొత్తగా ఫామ్‌–1 సహజ్‌ను తీసుకొచ్చింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ జీతం పెంపు
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గవర్నర్, డిప్యూటీ గవర్నర్‌ల మూల వేతనాలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి. తాజా పెంపుతో ఉర్జిత్‌ పటేల్‌.. నెలకు రూ.2.50 లక్షల జీతం అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్‌లు రూ.2.25 లక్షలు పొందనున్నారు.

అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఎస్‌బీఐ
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ) విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఎస్‌బీఐ ప్రపంచంలోని టాప్‌–50 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించింది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
స్పేస్‌ఎక్స్‌.. రాకెట్‌ పునర్వినియోగ పరీక్ష విజయవంతం అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవల ప్రైవేట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌.. ఒకసారి ఉపయోగించిన రాకెట్‌ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి మార్చి 30న ఫాల్కాన్‌–9 అనే పునర్వినియోగ రాకెట్‌ ద్వారా సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.

50 వేల ప్రదక్షిణలు చేసిన వ్యోమనౌక
నాసాకు చెందిన మార్స్‌ రికాన్‌సెన్స్‌ ఆర్బిటర్‌ (ఎంఆర్‌వో) అంగారకుడి చుట్టూ 50 వేలసార్లు తిరిగింది. దీన్ని 2005లో ప్రయోగించారు. ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని శాస్త్రవేత్తలు మార్చి 29న తెలిపారు.

వార్తల్లో వ్యక్తులు
దక్షిణాఫ్రికా ఉద్యమ నేత అహ్మద్‌ కత్రడా కన్నుమూతయ భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేకోద్యమ నేత అహ్మద్‌ కత్రడా (87) జోహన్నెస్‌బర్గ్‌లో మార్చి 27న మరణించారు. ఆయన నెల్సన్‌ మండేలా అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరొందారు. కత్రడా 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం అందుకున్నారు.

ఎస్‌ఐగా నియమితులైన తొలి హిజ్రా
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్‌ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్‌ పురస్కారం
భారత సంతతికి చెందిన బ్రిటన్‌ సీనియర్‌ మంత్రి ప్రీతి పటేల్‌ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్‌–2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్‌ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

క్రీడలు
ఇండియా ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న పీవీ సింధు ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది. న్యూఢిల్లీలో ఏప్రిల్‌ 2న జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)ను సింధు ఓడించింది.

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ భారత్‌ సొంతం
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన (బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ) టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. మార్చి 28న ముగిసిన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ను భారత్‌ గెలుచుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2–1 తేడాతో భారత్‌ నెగ్గింది. రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు.

మయామి మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న ఫెడరర్‌
రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) మయామి ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. ఫ్లోరిడాలో ఏప్రిల్‌ 3న జరిగిన ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌)ను ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement