టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకుల విడుదల
గతేడాది కంటే బెంగళూరు విద్యా సంస్థకు కొద్దిగా తగ్గిన ర్యాంకు
వరల్డ్ టాప్–250 నుంచి చోటు కోల్పోయినా.. భారత్‌లో అగ్ర వర్సిటీగా కొనసాగిన ఆధిక్యత
ప్రపంచ టాప్ వర్సిటీగా వరుసగా తొమ్మిదోసారి ఆక్స్‌ఫర్డ్‌కే పట్టం
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది.
పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్‌లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది.
ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
భారతీయ వర్సిటీల పురోగతి..
అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్‌లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్‌ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్‌లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి.
వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.
జేఎన్‌టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు..
ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్‌టీయూ అనంతపురం, కేఎల్‌యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్‌ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్‌కు దిగజారింది.
అగ్రస్థానంలో ఆక్స్‌ఫర్డ్..
మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం.
కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment