సివిల్స్‌ సమరానికి ప్రణాళిక | Civil Services Examination | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ సమరానికి ప్రణాళిక

Published Mon, Apr 17 2017 4:39 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

సివిల్స్‌ సమరానికి ప్రణాళిక

సివిల్స్‌ సమరానికి ప్రణాళిక

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర 24 కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)నిర్వహించే ఎంపిక ప్రక్రియ. మూడంచెల సివిల్‌ సర్వీసెస్‌ ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌. జూన్‌ 18న ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది.అంటే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయం దాదాపు రెండు నెలలు. ఆ తర్వాత మలి దశ మెయిన్స్‌ అక్టోబర్‌ 28 నుంచి జరగనుంది.అభ్యర్థులు ప్రిలిమ్స్‌పై ఫోకస్‌ చేస్తూనే, మలిదశ మెయిన్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2017లో విజయానికి నిపుణుల సలహాలు, సూచనలు..

తగ్గిన పోస్టుల సంఖ్య
సివిల్‌ సర్వీసెస్‌–2017 నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల సంఖ్య 980. గతేడాది కంటే వంద పోస్టులు తక్కువ.  పోస్టుల సంఖ్య తగ్గినా అభ్యర్థులకు ఉపశమనం కలిగించిన అంశం ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేకపోవడం. నిజానికి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మార్పులు జరుగుతాయని, అటెంప్ట్‌ల సంఖ్య, వయోపరిమితి తగ్గిస్తారని కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి మార్పులు లేకపోవడం గత రెండు, మూడేళ్లుగా ప్రిపరేషన్‌ సాగిస్తున్న అభ్యర్థులకు పెద్ద ఊరటని చెప్పొచ్చు.

తులనాత్మక అధ్యయనం
అభ్యర్థులు ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిస్తూనే మెయిన్‌లో సైతం ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించాలి. ఈ క్రమంలో తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా ప్రిలిమినరీ తర్వాత  మెయిన్‌ పరీక్షకు లభించే మూడు నెలల స్వల్ప వ్యవధిలో ప్రిపరేషన్‌ పరంగా కలిసొస్తుంది. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లోని ఎథిక్స్‌ అండ్‌ ఇంటెగ్రిటీ, ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ మినహా మిగతా అన్ని పేపర్లు కూడా జనరల్‌ స్టడీస్‌కు సంబంధించినవే! దీన్ని సానుకూలంగా మార్చుకొని ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే మెయిన్స్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ను కూడా పూర్తిచేసుకోవాలి.

ఆబ్జెక్టివ్‌లోనూ అంతర్లీనంగా
ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కొన్నేళ్లుగా ఇందులో అడుగుతున్న ప్రశ్నలను గమనిస్తే.. అభ్యర్థికి నిర్దిష్టంగా ఒక అంశంపై పలు కోణాల్లో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కొశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ పద్ధతికి మాత్రమే పరిమితం కాకుండా విశ్లేషణాత్మక దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగించడం అవసరం. ప్రిలిమినరీ విషయంలో అభ్యర్థులు వాస్తవ ఘటనలు, గణాంకాలకు ప్రాధాన్యమిస్తూనే మూల భావనలు, ప్రాథమిక సూత్రాలపైనా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ప్రశ్నను ఏ తీరులో అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

సీశాట్‌.. వెరీ కేర్‌ఫుల్‌
సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో పేపర్‌–2 సీశాట్‌ (సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాస్తవానికి దీన్ని కేవలం అర్హత పరీక్షగానే నిర్దేశించినా.. 200 మార్కులకు నిర్వహించే ఈ పేపర్‌లో కచ్చితంగా 33 శాతం మార్కులు పొందాలనే నిబంధన విధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పేపర్‌–2లో పేర్కొన్న ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రెహెన్షన్, లాజికల్‌ రీజనింగ్, బేసిక్‌ న్యూమరసీ అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.

ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్స్‌లోని ఎడిటోరియల్స్‌ చదవడం, వాటి సారాంశాన్ని గుర్తించడం, వాక్య నిర్మాణ శైలి లాంటి వాటిపై దృష్టిసారించాలి. బేసిక్‌ న్యూమరసీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో కంప్యుటేషనల్‌ స్కిల్స్‌పై పట్టు సాధించాలి. లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించి ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చదివి అందులోని కీలక అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి.

పేపర్‌–1 + మెయిన్స్‌ ఏక కాలంలో
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్‌లోని పేపర్లకు ఏక కాలంలో ప్రిపరేషన్‌ సాగించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిలిమ్స్‌లోని అంశాలను డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదవాలి. తద్వారా మెయిన్‌లోని జనరల్‌ ఎస్సే, జనరల్‌ స్టడీస్‌ పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత లభిస్తుంది. గత ఏడాది కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా, ఆర్థికంగా పలు పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులు పాలిటీ, ఎకానమీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

రీడింగ్‌ విత్‌ రైటింగ్‌
సివిల్స్‌ అభ్యర్థులు చదువుతున్న టాపిక్‌లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో సొంత నోట్స్‌గా రూపొందించుకోవాలి. దీనివల్ల రైటింగ్‌ ప్రాక్టీస్, రైటింగ్‌లో వేగం పెరగడమే కాకుండా రివిజన్‌ పరంగానూ ఉపయుక్తంగా ఉంటుంది.

ఆప్షనల్‌ సబ్జెక్టులు
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో రాయాల్సిన ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయించాలి. అంతేకాకుండా అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను ప్రిలిమ్స్‌ సిలబస్‌లోని అంశాలు, అలాగే మెయిన్స్‌లోని ఇతర పేపర్లతో అనుసంధానం చేసుకునే వీలుందో లేదో చూసుకోవాలి.

 ఉదాహరణకు పాలిటీని ఆప్షనల్‌గా తీసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్‌లోని ఇండియన్‌ పాలిటీ– గవర్నెన్స్, పొలిటికల్‌ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్‌ పాలసీ, రైట్స్‌ ఇష్యూస్‌ అంశాలతో అనుసంధానం చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్‌ ఎగ్జామినేషన్‌లోని జనరల్‌ స్టడీస్‌–2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌ జస్టిస్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌)తో అనుసంధానం చేసుకునే వీలుంటుంది.

సివిల్స్‌ –2017 ప్రిపరేషన్‌ టైం ప్లాన్‌
ఇప్పటి నుంచి జూన్‌ ఒకటి వరకు ప్రిలిమ్స్‌ + మెయిన్స్‌ దృక్పథంతో చదవాలి.

రోజూ ఆరు నుంచి 8 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.

జూన్‌ ఒకటి నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌కే సమయం కేటాయించాలి.

ప్రిలిమ్స్‌ పూర్తయిన వెంటనే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ కోసం ప్రత్యేకంగా కనీసం నాలుగు గంటల సమయం కేటాయించాలి.

ప్రిలిమ్స్‌ కోణంలో ప్రతి వారం మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి.

ప్రిలిమ్స్‌కు ముందు నెల రోజుల వ్యవధిలో మాక్‌ టెస్ట్‌లు రాసి మూల్యాంకన చేయించుకోవాలి.

రిఫరెన్స్‌ బుక్స్‌
మోడ్రన్‌ ఇండియన్‌ హిస్టరీ– బిపిన్‌ చంద్ర
ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఇండిపెండెన్స్‌
– బిపిన్‌ చంద్ర
ఇండియన్‌ కల్చర్‌
– స్పెక్ట్రమ్‌
ఇండియన్‌ జాగ్రఫీ
– మాజిద్‌ హుస్సేన్‌
ఇండియన్‌ పాలిటీ – లక్ష్మీకాంత్‌
ఇండియన్‌ ఎకానమీ – రమేశ్‌ సింగ్‌
ఇండియా ఇయర్‌ బుక్‌
ఎకనామిక్‌ సర్వే
అనలిటికల్‌ రీజనింగ్‌– ఎం.కె.పాండే
వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌
– ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌

సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2017 సమాచారం
పరీక్ష తేదీ: జూన్‌ 18, 2017
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌
పేపర్‌–1: జనరల్‌ స్టడీస్‌ – 200 మార్కులు
పేపర్‌–2: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ – 200 మార్కులు (పేపర్‌–2 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో తప్పనిసరిగా 33 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి).

మెయిన్‌ ఎగ్జామినేషన్‌–2017
(మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు)
పేపర్‌–1:  జనరల్‌ ఎస్సే
పేపర్‌–2: జనరల్‌ స్టడీస్‌–1 (ఇండియన్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్, హిస్టరీ అండ్‌ జాగ్రఫీ ఆఫ్‌ వరల్డ్‌ అండ్‌ సొసైటీ)
పేపర్‌–3: జనరల్‌ స్టడీస్‌–2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌ జస్టిస్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌)
పేపర్‌–4: జనరల్‌ స్టడీస్‌–3 (టెక్నాలజీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)
పేపర్‌–5: జనరల్‌ స్టడీస్‌–4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్‌ ఆప్టిట్యూడ్‌)
పేపర్‌–6: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–1
పేపర్‌–7: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌–2
ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున
1750 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.
ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వూ్య–275 మార్కులు)కు ఎంపిక చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement