క్లరికల్ కొలువుదీరే మార్గాలు | clerical exams in SBI | Sakshi
Sakshi News home page

క్లరికల్ కొలువుదీరే మార్గాలు

Published Thu, Nov 27 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

clerical exams in SBI

ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి భారీగా కొలువుల భర్తీకి నగారా మోగింది.. ఐదు అనుబంధ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్‌లో మొత్తం 6425 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది.. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌కు తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే మెరుగైన మార్కులను ఏవిధంగా సాధించాలి.. ఎటువంటి వ్యూహాలను అనుసరించాలో  తెలుసుకుందాం..

జి. రమణ, డైరెక్టర్, సాయి మేధ విద్యా సంస్థలు, హైదరాబాద్
 ఖాళీల వివరాలు:
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్    725
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా    1200
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్    1300
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్    1000
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్    2200
 మెత్తం    6425
 ఆంధ్రప్రదేశ్: 282 పోస్టులు (ఎస్‌బీహెచ్-240 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్-30, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు)
 
 తెలంగాణ: 1012 పోస్టులు (ఎస్‌బీహెచ్-1000 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు)
 
 ఎంపిక విధానం:
 రెండు దశలుగా ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ రెండు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు.
 
 రాత పరీక్ష ఇలా:
 ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి. వీటికి రెండు గంటల 15 నిమిషాల్లో (135 నిమిషాలు) సమాధానాలను గుర్తించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వివరాలు..
 విభాగం    మార్కులు
 జనరల్ అవేర్‌నెస్    40
 జనరల్ ఇంగ్లిష్    40
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    40
 రీజనింగ్ ఎబిలిటీ    40
 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/
 కంప్యూటర్ నాలెడ్జ్    40
 మొత్తం    200
 
 సిద్ధమవ్వండిలా...
 జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్‌లతోపాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అదే సమయంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్లు, ప్రైవేట్ బ్యాంకులకు లెసైన్స్‌లు, బ్యాంక్ రేట్లు, వివిధ బ్యాంకుల ముఖ్య అధికారులు సంబంధిత అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరం. ముఖ్యంగా గత 6-8 నెలల కాలంలో చోటుచేసుకున్న సంఘటనలపై ప్రధానంగా దృష్టి సారించాలి. చదవడం కంటే గ్రూప్ డిస్కషన్ వంటి పద్ధతుల ద్వారా ఈ విభాగాన్ని మెరుగ్గా ప్రిపేర్ కావచ్చు.
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
 పరీక్షలో ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, డేటా అనాలసిస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో మంచి స్కోర్ సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావ చ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అర్థమెటిక్ ఎబిలిటీలో దూరం, నిష్పత్తి, సరాసరి, వయసు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలను త్వరగా సులువుగా సాధించాలంటే షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. తద్వారా స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. డేటా అనాలిసిస్‌లో బార్స్, వెన్‌డయాగ్రమ్స్, చార్ట్స్, టేబుల్స్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటికోసం సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 
 రీజనింగ్ ఎబిలిటీ:
 ఈ విభాగంలో అభ్యర్థులు కొంత అప్రమత్తతతో ఉండాలి. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలు ఒక్కోసారి గందరగోళానికి గురి చేయవచ్చు. కాబట్టి సమాధానం ఇచ్చే ముందు ప్రశ్నను పూర్తిగా చదవడం మంచిది. ఈ విభాగం తార్కిక సామర్థ్యాన్ని, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. మిగిలిన విభాగాలతో పోలిస్తే రీజనింగ్ లో సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్‌ను సాధించాలంటే పజిల్స్, అనాలజీస్‌ను ఇన్‌పుట్- అవుట్‌పుట్, కోడింగ్-డికోడింగ్, లాజికల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, డెరైక్షన్స్ తదితర అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.  
 
 జనరల్ ఇంగ్లిష్:
 ఇందులో కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, క్లోజ్ టెస్ట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులోని ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ఈ విభాగంలో గ్రామర్ అంశం నుంచి 1/3 వంతు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ విభాగంలో 25 మార్కులకు తగ్గకుండా స్కోర్ చేసే విధంగా సిద్ధం కావాలి.
 
 కంప్యూటర్ నాలెడ్జ్:
 ఇందులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, కంప్యూటర్ ఉపయోగాలు, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, పీసీ అండ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కంప్యూటర్ నెట్‌వర్క్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి.
 
 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్:
 ఈ విభాగం అధిక శాతం అభ్యర్థులకు కొత్తగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్‌లో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా డివిజన్ ఆఫ్ మార్కెటింగ్, సెల్లింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, కస్టమర్ వాల్యూ, స్టాఫ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్- కోబ్రాండింగ్, ట్యాగ్‌లైన్స్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సీఎంఆర్ కాన్సెప్ట్, 7పీస్ ఆఫ్ మార్కెటింగ్ ((7 P's of Marketing)తదితరాలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి.
 
 వేతనం-విధులు:
 క్లరికల్ ఉద్యోగులు ఫ్రంట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తారు. బ్యాంకుల్లో ప్రతి పనీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా మేకర్- చెకర్ విధానాన్ని పాటిస్తారు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు మేకర్ పని చేస్తారు. వేతనం పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ప్రస్తతం క్లరికల్ కేడర్ బేసిక్ పే రూ. 7,200. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సిటీ అలవెన్స్ అదనం. అంటే ఏ ప్రాంతంలో ఉద్యోగంలో చేరినా నెలకు రూ. 20,000 వరకు వేతనం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు. తర్వాత శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు.
 
 నోటిఫికేషన్ సమాచారం:
     అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమానం
 (డిసెంబర్ 1, 2014 నాటికి)
     వయసు: 20-28 ఏళ్లు (డిసెంబర్ 1, 2014 నాటికి).
     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2014
     ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/
 ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ. 100)
     ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 డిసెంబర్ 9, 2014
     ఆఫ్‌లెన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 డిసెంబర్ 11, 2014
     రాత పరీక్ష: జనవరి/ఫిబ్రవరి, 2015
 (స్పష్టమైన తేదీలు ప్రకటించలేదు).
 
 రాత పరీక్ష కేంద్రాలు:
 తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
 ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
 వెబ్‌సైట్: www.sbi.co.in
 
 సూచనలు
     ఐబీపీఎస్ గత పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.
     క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలను ప్రతి రోజూ ప్రిపేర్ కావాలి. అంతేకాకుండా వీటిని సమయ పరిమితి విధించుకుని సాధన చేయాలి.
     స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానం గుర్తించగలగాలి.
     సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి.
     పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం.
 
 కటాఫ్ తప్పనిసరి
 మరో కీలకాంశం.. కటాఫ్ మార్కులు. ప్రతి విభాగంలోనూ బ్యాంకు నిర్దేశించిన కటాఫ్ మార్కులను సాధించాలి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ఆయా విభాగాల్లో సాధించిన మార్కులాధారంగా.. కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఖాళీలు, అభ్యర్థులు చూపిన ప్రతిభ.. ఈ రెండు అంశాలతో కటాఫ్ మార్కులతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలో పోస్టులు ఎక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు తక్కువగా ఉండొచ్చు. పోస్టులు తక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు పెరగొచ్చు. అంతేకాకుండా ప్రశ్నపత్రం సులువుగా ఉంటే కటాఫ్ మార్కులు పెరుగుతాయి. కఠినంగా ఉంటే కటాఫ్ మార్కులు తగ్గుతాయి. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని విభాగాలకు సమప్రాధాన్యతనివ్వాలి. ప్రతి విభాగంలోనూ 50 శాతం మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
 
 ఇంటర్వ్యూ
 
 ప్రతి కేటగిరీ నుంచి ఖాళీల ఆధారంగా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా బ్యాంకు నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ మార్కుల విషయంలో రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 5 శాతం సడలింపునిస్తారు. అంతేకాకుండా స్థానిక భాషలో ఉన్న ప్రావీణ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూ సాధారణంగా 10-25 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రధానంగా రెజ్యూమె ఆధారంగా అభ్యర్థి వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు వేస్తారు. అంటే కుటుంబ నేపథ్యం, స్వస్థలం, చదువు, అభిరుచులు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి కారణాలు, తదితరాలు. అంతేకాకుండా సమకాలీన అంశాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగం, క్రీడారంగం ఇలా ఏ రంగం నుంచైనా ప్రశ్నలు అడగొచ్చు. ప్రత్యేకించి ఎస్‌బీఐ-అనుబంధ బ్యాంకుల విధాన నిర్ణయాలు, పథకాలు సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి.
 
 క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర ప్రాక్టీస్ తప్పనిసరి. ఆన్‌లైన్ విధానంపై అవగాహన ఏర్పడేందుకు వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. అప్పుడే టైం మేనేజ్‌మెంట్‌పై పట్టు సాధించొచ్చు. అంతేకాకుండా కచ్చితత్వంతో కూడిన వేగం ప్రధానం. ఏ విభాగాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇతర పరీక్షల్లో మాదిరి బ్యాంక్ పరీక్షల్లో ఓవరాల్ కటాఫ్ కాకుండా ప్రతి విభాగంలోనూ కటాఫ్ ఉంటుంది. కాబట్టి అన్ని విభాగాల్లో మంచి స్కోరు సాధించాలి. దినపత్రికలను రెగ్యులర్‌గా చదవడం వల్ల కరెంట్స్ అఫైర్స్ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు.
 - ఆరేటి కేశవయ్య, క్లరికల్ విజేత,
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (2013)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement