ఈ ఉన్నత ఉద్యోగం ‘తాత్కాలికం’! | Corporate job is only temporary to overcome financial crisis | Sakshi
Sakshi News home page

ఈ ఉన్నత ఉద్యోగం ‘తాత్కాలికం’!

Published Fri, Oct 10 2014 2:29 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఈ ఉన్నత ఉద్యోగం ‘తాత్కాలికం’! - Sakshi

ఈ ఉన్నత ఉద్యోగం ‘తాత్కాలికం’!

ఓ అవసరం ఒక కొత్త ఆలోచనకు, ఆచరణకు బీజం వేస్తుంది! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కార్పొరేట్ కంపెనీల స్థితిగతుల్ని కకావికలం చేసిన సమయంలో ‘తాత్కాలిక సిబ్బంది’ పెద్దదిక్కయ్యారు. పూర్తిస్థాయిలో నియామకాలు జరిపి, రూ.లక్షల ప్యాకేజీలతో జీతాలు ఇవ్వలేక కంపెనీలు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాయి. సంక్షోభం సెగలు తగ్గి, పరిస్థితులు కుదుటపడ్డాక కూడా ఈ ‘టెంపరరీ’ ట్రెండ్ కొనసాగింది. అయితే ఈ ధోరణి కింది స్థాయి ఉద్యోగాల నుంచి సీఈవో, సీఎఫ్‌వో వంటి ఉన్నత స్థాయి స్థానాలకు ఎగబాకింది!
 
 ప్రస్తుతం వివిధ రంగాల సంస్థలు అవసరాలకు తగినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో), హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ (హెచ్‌ఆర్ హెడ్) తదితర ఉన్నతస్థాయి ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకుంటున్నాయి. కంపెనీ అవసరాలకు తగినట్లు నిర్దిష్ట గడువు మేరకు పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. చేతిలో ప్రాజెక్టులు లేనప్పుడు వేతనాల రూపంలో చేతి చమురు వదలకుండా జాగ్రత్తపడుతున్నాయి.
 
 కొత్త కంపెనీలకు వరంగా!
 మీ దగ్గర ఓ కొత్త ఆలోచన ఉంది.. ఈ ఆలోచన ఆసరాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే సందర్భంలో నిధుల కొరత తీవ్రంగా ఉంటుంది. రూ.లక్షల వార్షిక వేతన ప్యాకేజీలతో ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన సీఈవో, సీఎఫ్‌వో వంటి ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ గుర్తించిన కొన్ని సంస్థలు అవసరమైన వారికి ఇలా టెంపరరీ ఎగ్జిక్యూటివ్‌లను అందిస్తున్నాయి.
 
-    ఓ సంస్థ మార్కెట్లోకి ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహానికి రూపకల్పన చేసే మానవ వనరులు అవసరమవుతాయి. ఈ సందర్భంలో కంపెనీలు కొన్ని నెలల పాటు పనిచేసేలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌ను నియమించుకుంటున్నాయి.
 -    ప్రస్తుతం మార్కెట్లో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ); బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ); రిటైల్ రంగ సంస్థలు ఎక్కువగా తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి.
 
 జోరందుకుంటోంది
 సంస్థలు ఉన్నత స్థాయి ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడమనే ధోరణి విదేశాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇది భారత్‌లోనూ క్రమంగా జోరందుకుంటోంది. ఏవో కొన్ని సంప్రదాయ కంపెనీలు తప్ప ఐటీ, ఈ-కామర్స్ తదితర విభాగాల సంస్థలు ఏదో ఒక సందర్భంలో తాత్కాలిక ఉన్నత ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తంమీద అమ్మకాలు, మార్కెటింగ్ విభాగాల్లో తాత్కాలిక ధోరణి అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఏటా దేశంలో ఇలాంటి నియామకాల్లో దాదాపు 20 శాతం అభివృద్ధి నమోదవుతున్నట్లు అంచనా. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక ఉద్యోగుల నియామక మార్కెట్ విలువ రూ.16,700 కోట్లు కాగా, 2016-17 నాటికి రూ.40 వేల కోట్లకు చేరే అవకాశముంది!
 
 నైపుణ్యాలు సమృద్ధిగా ఉండాలి
 కంపెనీలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది కంటే సీనియర్ స్థాయిలో నియమితులయ్యే వారికి అధిక నైపుణ్యాలు ఉండాలి. వీరికి బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిర్దేశిత గడువులోగా కంపెనీ లక్ష్యాలను నెరవేర్చాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. వీరికి అవసరమైన నైపుణ్యాలు..
 -     స్వల్ప సమయంలో సంస్థ సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పరచుకుని, కంపెనీ అభివృద్ధిలో వారిని మరింత భాగస్వాములను చేయాలి.
 -     అనలిటికల్, బృంద స్ఫూర్తి నైపుణ్యాలు అవసరం.
 -     మౌఖిక, రాత పూర్వక కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానం.
 -     ఇచ్చిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయాలన్న వ్యక్తిగత నిబద్ధత అవసరం.
 -     సానుకూల దృక్పథం, ఎప్పటికప్పుడు స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడం ప్రధానం.
 -     ఒకే ఏడాదిలో భిన్న వాతావరణం, భిన్న అవసరాలున్న కంపెనీలో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మలచుకునే నైపుణ్యం తప్పనిసరి.
 
 కారణాలివీ
 సీనియర్ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు కారణాలను పరిశీలిస్తే..
 - సంస్థ నిర్వహణపరంగా ఖర్చులను తగ్గించుకునేందుకు.
 - ఓ వ్యక్తిని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలో నియమించుకుంటే అనుభవం గడించాక వేరే కంపెనీకి వెళ్లిపోయే ఆస్కారం
 - శిక్షణ ఖర్చు తగ్గించుకోవాలనుకోవడం.
 - అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి స్వల్ప సమయంలోనే కంపెనీ లక్ష్యాలను నెరవేరుస్తారన్న భావన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement