అయిదారంకెల జీతాలు...
అయిదారంకెల జీతాలు... అలసట ఎరుగని జీవితాలు...సాఫ్ట్‌వేర్ జాబ్‌ను అత్యంతఆదరణీయ ఉద్యోగంగా మార్చింది ఇవేనా? కాదు కాదు ఇంకా చాలా ఉన్నాయి. జీతభత్యాలవిషయంలో మాత్రమే కాదుఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించే పనిలోనూ పోటీపడుతున్నాయి.
తనకు నచ్చిన, తాను మెచ్చిన కంపెనీని ఎంచుకునే సమర్ధులైన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు ‘ఇంటి కన్నా ఆఫీసే పదిలం’అనుకునేలా మార్చుతున్నాయి.
..:: శిరీష చల్లపల్లి
‘ఈ రోజు ఏం సినిమా చూద్దాం? రోమన్ హాలిడే అయితే ఓకే కదా?’, ‘లేదు బాస్ ది టూరిస్ట్ చూద్దాం’ ఇలాంటి చర్చలు సాగుతున్నాయంటే.. ఆ ఫ్రెండ్స్ ఏ సినిమా థియేటర్‌కో వెళుతున్నారనుకుంటాం. అయితే అది కంపెనీలోని ఇన్ హౌస్ థియేటర్‌లో అని తెలిస్తే ఔరా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అనుకోకుండా ఉండలేం. ఇవే కాదు... గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పనిచేసే చోటునే పసందైన విడిదిగా మార్చుతున్న క్రమంలో ఎన్నో సౌకర్యాలు..
మరెన్నో వసతులు..
జిమ్ టు స్విమ్...
టాప్ క్లాస్ ఎక్విప్‌మెంట్‌తో అల్ట్రామోడ్రన్ జిమ్‌లు ఇప్పుడు దాదాపు అన్ని పెద్ద కంపెనీల్లో సర్వసాధారణం. అంతేకాదు వర్క్‌లోడ్‌తో అలసి సొలసిన ఉద్యోగులను సేదతీర్చేందుకు స్విమ్మింగ్ పూల్స్, స్టాఫ్‌కి అనుకోని ప్రమాదం సంభవిస్తుందేమోనని లైఫ్‌గార్డ్స్ కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కోసం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవసరమైతే అందించడానికి ఆన్‌సైట్ మెడికల్ స్టాఫ్ సైతం 24/7 రెడీ.
ఆటలా పాటలా..
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు.. అయితే అస్తమానం కంప్యూటర్లతో కుస్తీ పట్టే వారికి ఆటపాటల్ని పనిలో భాగం చేయడం కష్టం కదా. అందుకే దీనికి ప్రత్యేకంగా పలు కంపెనీల్లో బిలియర్డ్స్ వంటి ఇండోర్ గేమ్స్, పింగ్ పాంగ్.. ఉంటాయి. అంతేకాదు తమ ప్రియమైన పెట్ ఇంటి దగ్గర ఎలా ఉందో అని బెంగపడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు పెట్‌ని సైతం తమతో పాటు తెచ్చుకునే అవకాశం ఉంది. హాయిగా వర్క్ బ్రేక్‌లో పెట్స్‌తో కాలక్షేపం చేస్తే.. వావ్.. వాటె వండర్‌ఫుల్ టైం ఇటీజ్.. అని అనుకోకుండా ఉండలేం కదా.
ఈట్ స్ట్రీట్స్...
స్టార్ హోటల్ ఫుడ్‌కి తగ్గకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీలు స్టాఫ్‌కి అందిస్తాయి. స్థాయీ భేదాలకు అతీతంగా 3 నుంచి 7 స్టార్ హోటల్ రేంజ్‌లో ఇవి ఉంటాయి. స్వయంగా మాత్రమే వండుకుని తినేవారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కాంటినెంటల్, ఇటాలియన్, మల్టీక్యుజిన్ రుచుల్ని ఆస్వాదించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ మొదలుకుని డిన్నర్ దాకా సిద్ధంగా ఉంటాయి. క్యాంటీన్‌లలో ఆహారం తినేటప్పుడు పొరపాటున ఏమైనా దుస్తుల మీద పడితే వెంటనే క్లీన్ చేసి ఇవ్వడానికి లాండ్రీలు కూడా ఉంటున్నాయి.
అవీ ఇవీ...
ఫెస్టివల్ బోనస్‌లు, అప్రైజల్ బోనస్‌లు, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్ ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం, అప్రిషియేషన్ రూపంలో ఎక్స్‌పెన్సివ్ గాడ్జెట్స్ అందుతాయి. తల్లిదండ్రులతో సహా మొత్తం ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్, సొడెక్సో షాపింగ్ కూపన్స్, మీల్ కూపన్స్ కూడా. నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ తీర్థయాత్రలు లేదా ఫారిన్ విజిట్‌కి వెళితే.. ఖర్చులు కూడా కంపెనీలే భరిస్తున్నాయి. క్లబ్స్, రిసార్ట్స్‌లో సభ్యత్వాలు గిఫ్ట్స్‌గా అందిస్తున్నాయి. ఫిమేల్ ఎంప్లాయ్‌కి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం మామూలే. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా లీవ్ మంజూరు చేస్తున్నారు. గూగుల్‌లో అయితే డెలివరీ అయిన తల్లికి ఒకటిన్నర ఏడాది జీతం ఇస్తారట. తండ్రికి ఆర్నెల్ల జీతం ఇస్తారు.
భళా...గూగుల్...
మనకు ఏ ఇన్ఫర్మేషనైనా వెంటనే గూగుల్ గుర్తుకు వస్తుంది. టాప్ క్లాస్ ఫెసిలిటీస్ అనగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గూగుల్ కంపెనీయే గుర్తొస్తుంది. శాలరీ సంగతి అలా ఉంచి, ఈ సంస్థ తమ ఉద్యోగుల కోసం అందిస్తున్న ఫెసిలిటీస్ వల్లే ఆ కంపెనీలో జాబ్‌కి టెకీలు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారట. అదే విధంగా ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్.. ఇలా మరికొన్ని కంపెనీలు కూడా అత్యున్నత వసతులు కల్పిస్తున్న జాబితాలో ఉన్నాయి.
క్రియేటివిటీకి జై...
క్యాంటీన్, ఇతరత్రా సౌకర్యాల సంగతెలా ఉన్నా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, కల్చరల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ ఏరియాలు.. ఇలా ఒకటొకటిగా కంపెనీలు తమ ఫెసిలిటీస్‌ని విస్తరిస్తుండటానికి ఇటీవల కార్పొరేట్ సంస్థల మధ్య పెరుగుతున్న క్రియేటివ్ వార్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. క్విజ్‌లు, డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షోలు, కార్పొరేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇంకా ఇలాంటి టాలెంట్ బేస్డ్ కాంటెస్ట్‌లు వరుసగా జరుగుతుండడం, సిబ్బంది బాగా ఆసక్తి చూపిస్తుండడంతో ఈ తరహా వసతులు ఏర్పాటు చేయడం సంస్థలకు కూడా అవసరంగా మారింది. సిబ్బందిలోని క్రియేటివిటీ పెరగడం తమ సంస్థ పేరు ప్రఖ్యాతులకు కూడా ఉపయుక్తం అవుతోందని కంపెనీలు ఆశిస్తున్నాయి.