అరిటి బోదెలు, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు.. కలాపి చల్లిన లోగిళ్లు.. అందులో నవధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు.. పిండి వంటలు, పతంగులు, పట్టు పరికిణీల్లో యువతులు, పంచె కట్టులో యువకులు.. అచ్చంగా పల్లె పండుగ సంక్రాంతి పట్నానికి తరలి వచ్చింది. నగర శివారుల్లోని చిలుకూరు సమీపంలోని నిర్వాణ ప్రాంగణం పల్లెక్రాంతితో వెలిగిపోయింది. నాలుగు రోజులు ముందుగానే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది.
-శిరీష చల్లపల్లి
పల్లెలో సంక్రాంతి అనగానే.. తెల్లవారకముందే గంగిరెద్దల మువ్వల సవ్వడి వినిపిస్తుంది. హరిదాసుల గానం పల్లె గాలిలో విహరిస్తుంది. పట్నవాసంలో పండుగంటే హాలిడే అని తప్ప మరో అనుభూతి ఉండదు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ పల్లెలో జరిగే పండుగ శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాణ నిర్వాహకురాలు లీల. సిటీవాసులకు సంక్రాంతి ఆనందం పంచడానికి ఏకంగా పల్లెనే పట్నానికి తీసుకొచ్చారు.
ముందే వచ్చిన పండుగ...
సొంతూళ్లకు వెళ్లలేని సిటీజనులెందరో నిర్వాణ ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. మగువలంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అందులో కొలువుదీర్చారు. పెద్ద మనుషులు వైకుంఠపాళి ఆటతో కాలక్షేపం చేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగిరేస్తూ జాలీగా గడిపారు. మహిళలు గచ్చుకాయలు, అష్టాచెమ్మా, వామన గుంటలు ఇలా కనుమరుగవుతున్న పల్లె ఆటల్లో తేలాడారు. మీసం మెలేసిన మగమహారాజులు కోడి పందేల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరూ కల్చరల్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు.
జానపద వేడుక...
ఈ ఆటపాటలకు తోడు గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బుర్రకథ చెప్పేవాళ్లు, పిట్టల దొరలు ఇలా జానపద కళారూపాలు పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఔత్సాహిక కళాకారులు ఏక్‌తారా, సితారా, తంబుర, వీణ వంటి సంప్రదాయ వాయిద్యాలతో తమలో ఉన్న ప్రతిభను చాటుకున్నారు. ధాన్యరాశులు, కలశాలు, అరివేణి కుండలు ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలో చూపారు.
వింతైన వంటకంబులు...
వివాహ భోజనంబును తలదన్నే రీతిలో వంటకాలు వండి వడ్డించారు. దంపుడు బియ్యంతో అన్నం, పొంగలి, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర లాంటివే కాకుండా పూర్ణాలు, అరిసెలు వంటి తీపి పదార్థాలు, మురుకులు, సకినాలు వంటి పిండి వంటకాలు భోజనప్రియులను కట్టిపడేశాయి. మొత్తానికి పల్లె సందడిని మోసుకొచ్చిన ఈ ప్రాంగణంలో సంక్రాంతితో పాటు భోగి, కనుమలు కూడా కన్నులపండువగా జరిగాయి.
సరదాగా సాగింది
ఉగాది, సంక్రాంతి తెలుగు పండుగలు. మరచిపోతున్న సంస్కృతిని మళ్లీ పరిచయం చేయడం బాగుంది. ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు భలే సరదాగా అనిపించాయి. నగర వాతావరణానికి పల్లె సంస్కృతిని పరిచయం చేయడం బాగుంది.
- లక్ష్మీ పార్వతి
నా వంతు ప్రయత్నం
ఈ రోజుల్లో మనిషికంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే నా వంతు ప్రయత్నమే నిర్వాణ వేదిక. ఏటా ఇలాంటి భారీ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సారి సంక్రాంతికి ప్లాన్ చేశాం. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఎలాంటి కార్యక్రమాలైనా ఈ ప్రాంగణంలో నిర్వహించవచ్చు. అదీ ఉచితంగానే.
- లీల, నిర్వాణ ప్రాంగణం నిర్వాహకురాలు
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
పట్నం వచ్చిన పల్లెక్రాంతి
Published Sat, Jan 10 2015 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement