Sirisa challapalli
-
‘పింక్‌థాన్’
ఈమె పేరు విష్ణుప్రియ. అంధ విద్యార్థిని. చూపు లేకపోతేనేం.. ముందుచూపున్న అమ్మాయి. మార్చి 15నమహిళల్లో చైతన్యం కోసం ‘రన్’ చేస్తానంటోంది. ఆమే కాదు.. నటుడు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మిలింద్ సోమన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా.. మరెందరో ఇందుకు రెడీ అవుతున్నారు.‘పింక్‌థాన్’ పేరిట వీరు సంకల్పించిన పరుగు పందెం.. అచ్చంగా మహిళల కోసం ఉద్దేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్న పింక్‌థాన్‌లో వీరంతా పరుగు పంచుకోనున్నారు. ..:: శిరీష చల్లపల్లి సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమని ఆర్యోక్తి. ఇల్లు.. పిల్లలు.. ఉద్యోగం.. అన్నింటినీ ఒంటిచేత్తో నెట్టుకొస్తున్న నారీమణులు తమ సొంత ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తారు. అందుకే నడివయసుకు వచ్చిన మహిళలెందరో ఒంట్లో నలతను నిత్యం ఎదుర్కొంటున్నారు. నడుం నొప్పి, తలపోటు వంటి చిన్నాచితకా రుగ్మతలు ఎందరో స్త్రీమూర్తులకు కామన్ అయిపోయాయి. ఇటీవల రొమ్ము క్యాన్సర్ బాధితులూ పెరిగిపోతున్నారు. మెడికల్ అధ్యయనాల ప్రకారం గతేడాది ఇండియాలో 5.27 లక్షల మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తేలింది. వీరిలో 3 లక్షల మంది బలయ్యారు. రొమ్ము క్యాన్సర్‌పై పోరాటం ప్రకటించిన ‘యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ మార్చి 15న పీపుల్స్ ప్లాజాలో ఐదు వేల మందితో పింక్‌థాన్ నిర్వహించనుంది. ఈ నడకను విజయవంతం చేయడానికి వివిధ రంగాల నుంచి 20 మంది అంబాసిడర్లను ఎంపిక చేశారు. బుధవారం అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ హోటల్లో వారు పింక్‌థాన్ వివరాలను వెల్లడించారు. సీరియస్‌నెస్ లేదు.. హైదరాబాద్ మహానగరంలో రొమ్ము క్యాన్సర్‌పై పింక్‌థాన్ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. పింక్‌థాన్ 2012లో ముంబైలో తొలిసారి నిర్వహించారు. ఆనాటి రన్లో రెండువేల మంది మహిళలు పాలుపంచుకున్నారు. 2013లో దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పింక్ థాన్ జరిగింది. 2014లో ఆరు నగరాల్లో 50 వేల మంది మహిళలు పాల్గొన్న పింక్‌థాన్.. ఈ ఏడాది హైదరాబాద్‌తో సహా తొమ్మిది నగరాల్లో జరగనుంది. ‘బెటర్ కాజ్‌తో నిర్వహిస్తున్న ఈ రన్ ఎందరికో స్ఫూర్తినివ్వాలి. ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి పట్టించుకునే మహిళలు.. వారి ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. యోగ, వ్యాయామం, మెడిటేషన్.. చేయడం ద్వారానే హెల్దీగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ పని ఒత్తిడి, మాకెందుకులే అన్న ఫీలింగ్‌తో ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేద’ని అంటారు మిలింద్ సోమన్. సంకల్పం చాలు.. ఇలాంటి రన్లలో పాల్గొనాలంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ అనుకుంటారు. పింక్‌థాన్ అందుకు మినహాయింపు. మంచి కోరుతూ సాగుతున్న ఈ పరుగులో పాల్గొనాలనే సంకల్పం ఉంటే చాలంటున్నారు నిర్వాహకులు. పంజాబీ డ్రెస్, చీర, షార్ట్స్.. ఇలా ఎవరికి నచ్చిన కాస్ట్యూమ్స్‌లో వారు రావొచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తరిమేయడమే అందరి ఎజెండా కావాలని కోరుతున్నారు. మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతున్నామని చెబుతున్న ఆడవాళ్లు.. వ్యాయామం, జాగింగ్‌ల కోసం బయటకు రావడానికి మాత్రం ఇంకా ఆలోచించడం షాకింగ్‌గా ఉందని పింక్‌థాన్ మరో అంబాసిడర్ గుత్తా జ్వాల అంటున్నారు. ‘వ్యాయామం మగవాళ్ల కోసమే ఉద్దేశించింది కాదని మహిళలు గుర్తించాలి. పర్సనల్ కేర్‌తో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత కూడా మహిళలపై ఉంద’ని చెబుతారామె. ఇప్పటి వరకూ తనకు జాగింగ్ చేసిన అలవాటు కూడా లేదని చెబుతున్న రేడియో మిర్చి ఆర్జే భార్గవి పింక్‌థాన్‌లో పది కిలోమీటర్ల రన్‌కు రెడీ అవుతున్నానని చెబుతోంది. ‘ఈ రన్లో పాల్గొంటున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది. ఉరుకుల పరుగుల జీవితానికి చెక్ పెట్టి ఆడవాళ్లంతా ఈ రన్లో పాల్గొనాల’ని పిలుపునిచ్చారామె. కి‘రన్’ స్ఫూర్తి.. ఎక్కడ 10కే, 5కే రన్ అయినా పాల్గొంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న బ్లేడ్ రన్నర్ కిరణ్ కనోజియా కూడా పింక్‌థాన్‌లో పరిగెత్తనుంది. విధిని ఎదిరించి విజేతగా నిలిచిన కిరణ్‌ను పలకరిస్తే.. ‘కొన్నేళ్ల కిందట.. హైదరాబాద్ నుంచి మా ఊరు ఫరీదాబాద్ ట్రైన్లో వెళ్తుండగా.. ఇద్దరు ఆకతాయిలు నన్ను రైలు నుంచి తోసేశారు. ఆ ప్రమాదంలో నా ఎడమకాలు పూర్తిగా చితికిపోయింది. నాకు జీవితమే లేదనుకున్నాను. నా పేరెంట్స్ ధైర్యాన్నిచ్చారు. ఆర్టిఫిషియల్ లెగ్‌తో మళ్లీ అడుగులు వేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడ 10కే రన్ వాలిపోతాను. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం. క్యాన్సర్‌పై అవేర్నెస్ కల్పిస్తున్న పింక్‌థాన్‌లో పార్టిసిపేట్ చేస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని తెలిపింది. ముందువరసలో.. క్యాన్సర్ సర్వైవల్ నాయకురాలుగా ఉన్న ధరణి బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించింది. పింక్‌థాన్‌లో ముందువరుసలో ఉంటానంటున్న ఆ మహిళ.. ‘క్యాన్సర్ సోకిన తర్వాత నేను నిరాశలో కూరుకుపోయాను. డాక్టర్స్ కౌన్సెలింగ్ తర్వాత నేను బతకగలననే నమ్మకం వచ్చింది. నాకేమీ కాలేదు.. కాదు అని మనసులో నిశ్చయించుకున్నాను. ట్రీట్మెంట్తో పాటు వ్యాయామం, జాగింగ్ చేస్తూ క్యాన్సర్ మహమ్మారిని అధిగమించాను’ అని తెలిపింది. మనోబలం ఉంటే ఎంతటి మహ మ్మారినైనా ఎదుర్కోవచ్చని చెబుతోంది ధరణి. -
పట్నం వచ్చిన పల్లెక్రాంతి
అరిటి బోదెలు, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు.. కలాపి చల్లిన లోగిళ్లు.. అందులో నవధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు.. పిండి వంటలు, పతంగులు, పట్టు పరికిణీల్లో యువతులు, పంచె కట్టులో యువకులు.. అచ్చంగా పల్లె పండుగ సంక్రాంతి పట్నానికి తరలి వచ్చింది. నగర శివారుల్లోని చిలుకూరు సమీపంలోని నిర్వాణ ప్రాంగణం పల్లెక్రాంతితో వెలిగిపోయింది. నాలుగు రోజులు ముందుగానే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది. -శిరీష చల్లపల్లి పల్లెలో సంక్రాంతి అనగానే.. తెల్లవారకముందే గంగిరెద్దల మువ్వల సవ్వడి వినిపిస్తుంది. హరిదాసుల గానం పల్లె గాలిలో విహరిస్తుంది. పట్నవాసంలో పండుగంటే హాలిడే అని తప్ప మరో అనుభూతి ఉండదు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ పల్లెలో జరిగే పండుగ శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాణ నిర్వాహకురాలు లీల. సిటీవాసులకు సంక్రాంతి ఆనందం పంచడానికి ఏకంగా పల్లెనే పట్నానికి తీసుకొచ్చారు. ముందే వచ్చిన పండుగ... సొంతూళ్లకు వెళ్లలేని సిటీజనులెందరో నిర్వాణ ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. మగువలంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అందులో కొలువుదీర్చారు. పెద్ద మనుషులు వైకుంఠపాళి ఆటతో కాలక్షేపం చేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగిరేస్తూ జాలీగా గడిపారు. మహిళలు గచ్చుకాయలు, అష్టాచెమ్మా, వామన గుంటలు ఇలా కనుమరుగవుతున్న పల్లె ఆటల్లో తేలాడారు. మీసం మెలేసిన మగమహారాజులు కోడి పందేల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరూ కల్చరల్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు. జానపద వేడుక... ఈ ఆటపాటలకు తోడు గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బుర్రకథ చెప్పేవాళ్లు, పిట్టల దొరలు ఇలా జానపద కళారూపాలు పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఔత్సాహిక కళాకారులు ఏక్తారా, సితారా, తంబుర, వీణ వంటి సంప్రదాయ వాయిద్యాలతో తమలో ఉన్న ప్రతిభను చాటుకున్నారు. ధాన్యరాశులు, కలశాలు, అరివేణి కుండలు ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలో చూపారు. వింతైన వంటకంబులు... వివాహ భోజనంబును తలదన్నే రీతిలో వంటకాలు వండి వడ్డించారు. దంపుడు బియ్యంతో అన్నం, పొంగలి, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర లాంటివే కాకుండా పూర్ణాలు, అరిసెలు వంటి తీపి పదార్థాలు, మురుకులు, సకినాలు వంటి పిండి వంటకాలు భోజనప్రియులను కట్టిపడేశాయి. మొత్తానికి పల్లె సందడిని మోసుకొచ్చిన ఈ ప్రాంగణంలో సంక్రాంతితో పాటు భోగి, కనుమలు కూడా కన్నులపండువగా జరిగాయి. సరదాగా సాగింది ఉగాది, సంక్రాంతి తెలుగు పండుగలు. మరచిపోతున్న సంస్కృతిని మళ్లీ పరిచయం చేయడం బాగుంది. ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు భలే సరదాగా అనిపించాయి. నగర వాతావరణానికి పల్లె సంస్కృతిని పరిచయం చేయడం బాగుంది. - లక్ష్మీ పార్వతి నా వంతు ప్రయత్నం ఈ రోజుల్లో మనిషికంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే నా వంతు ప్రయత్నమే నిర్వాణ వేదిక. ఏటా ఇలాంటి భారీ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సారి సంక్రాంతికి ప్లాన్ చేశాం. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఎలాంటి కార్యక్రమాలైనా ఈ ప్రాంగణంలో నిర్వహించవచ్చు. అదీ ఉచితంగానే. - లీల, నిర్వాణ ప్రాంగణం నిర్వాహకురాలు ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఐష్‌లా కనిపించాలని ఆశ
కాస్త అందం.. దానికి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసం ఉంటే బ్యూటీ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చంటోంది.. మిస్ సుప్ర నేషనల్ ఆశాభట్. కూకట్‌పల్లిలోని సుజనామాల్ మేబాజ్ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్‌ను శుక్రవారం లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో తళుక్కుమన్న ఆశాభట్తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి 2014 ఎప్పటికీ మరచిపోలేను. ఈ నెల 5న నేను ‘మిస్ సుప్ర నేషనల్’గా ఎంపికయ్యాను. ఏషియా నుంచి ఈ కిరీటం దక్కించుకున్న తొలి వనితను నేనే కావడం గర్వంగా ఉంది. మా సొంతూరు కర్ణాటకలోని భద్రావతి. నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. పూణెలో ఇంటర్ చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఆమెలా అందాలరాణిని కావాలని ఆశ పడేదాన్ని. ఇంటర్‌కొచ్చాక నా కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేశాను. నా పేరెంట్స్ సపోర్ట్‌తో.. ఈ అందాల కిరీటం దక్కించుకున్నాను. అమ్మాయిలకే స్కోప్.. అన్నింటా అబ్బాయిలే పై చేయి అనుకుంటారు. ఆడవాళ్లూ ఎందులోనూ తక్కువకాదు. ఏదైనా సాధించడంలో అమ్మాయిలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను ఈ విషయాన్ని గట్టిగా నమ్మాను, కృషి చేశాను.. గెలిచాను. చిన్నప్పుడు నేను సరదాగా అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. ఒక ఐఏఎస్ కావాలన్నా, లాయర్ కావాలన్నా.. ఎంత కష్టపడాలో, ఈ బ్యూటీ ఫీల్డ్‌లో రాణించాలంటే అంతకు మించి కృషి చేయాలి. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా అందుకు ప్రిపేర్ అయి ఉండాలి. కాన్ఫిడెంట్ ఉంటే రావొచ్చు.. ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు లేచి గంట పాటు యోగా, తర్వాత రెండు గంటలు జిమ్, ఎరోబిక్స్, ఈవెనింగ్ ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేసేదాన్ని. నాకు ట్రైనర్ ఉన్నా, ఎంకరేజ్మెంట్ కోసం అమ్మ కూడా నాతో పాటు పోటీపడి మరీ వాకింగ్ చేసేది. నా బాడీ ఇంత ఫిట్‌గా ఉండటానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. డైట్ అంటే ఉపవాసం చేయడం కాదు. మూడు గంటలకొకసారి సలాడ్స్, గ్రిల్డ్ శాండ్విచ్, మాల్ట్, సింపుల్ ఫుడ్ ఇలా అన్ని రకాలూ తిన్నాను. కానీ ఆయిల్, ఫ్యాట్ ఉండే ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండేదాన్ని. ఇంతగా కృషి చేస్తేనే ఈ కిరీటంతో మీ ముందు నిలవగలిగాను. టీనేజర్స్‌కు నేను సజెస్ట్ చేసేది ఒక్కటే.. బ్యూటీఫీల్డ్లో అగ్రస్థాయిలో నిలబడగలమన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ ఫీల్డ్‌ను మీ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. నేను హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. చాలా కంఫర్ట్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ బిజీ షెడ్యూల్‌తో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. న్యూ ఇయర్లో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా. ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
అయిదారంకెల జీతాలు...
అయిదారంకెల జీతాలు... అలసట ఎరుగని జీవితాలు...సాఫ్ట్వేర్ జాబ్‌ను అత్యంతఆదరణీయ ఉద్యోగంగా మార్చింది ఇవేనా? కాదు కాదు ఇంకా చాలా ఉన్నాయి. జీతభత్యాలవిషయంలో మాత్రమే కాదుఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించే పనిలోనూ పోటీపడుతున్నాయి. తనకు నచ్చిన, తాను మెచ్చిన కంపెనీని ఎంచుకునే సమర్ధులైన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు ‘ఇంటి కన్నా ఆఫీసే పదిలం’అనుకునేలా మార్చుతున్నాయి. ..:: శిరీష చల్లపల్లి ‘ఈ రోజు ఏం సినిమా చూద్దాం? రోమన్ హాలిడే అయితే ఓకే కదా?’, ‘లేదు బాస్ ది టూరిస్ట్ చూద్దాం’ ఇలాంటి చర్చలు సాగుతున్నాయంటే.. ఆ ఫ్రెండ్స్ ఏ సినిమా థియేటర్కో వెళుతున్నారనుకుంటాం. అయితే అది కంపెనీలోని ఇన్ హౌస్ థియేటర్లో అని తెలిస్తే ఔరా సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోకుండా ఉండలేం. ఇవే కాదు... గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పనిచేసే చోటునే పసందైన విడిదిగా మార్చుతున్న క్రమంలో ఎన్నో సౌకర్యాలు.. మరెన్నో వసతులు.. జిమ్ టు స్విమ్... టాప్ క్లాస్ ఎక్విప్మెంట్తో అల్ట్రామోడ్రన్ జిమ్‌లు ఇప్పుడు దాదాపు అన్ని పెద్ద కంపెనీల్లో సర్వసాధారణం. అంతేకాదు వర్క్‌లోడ్‌తో అలసి సొలసిన ఉద్యోగులను సేదతీర్చేందుకు స్విమ్మింగ్ పూల్స్, స్టాఫ్‌కి అనుకోని ప్రమాదం సంభవిస్తుందేమోనని లైఫ్‌గార్డ్స్ కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కోసం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవసరమైతే అందించడానికి ఆన్సైట్ మెడికల్ స్టాఫ్ సైతం 24/7 రెడీ. ఆటలా పాటలా.. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు.. అయితే అస్తమానం కంప్యూటర్లతో కుస్తీ పట్టే వారికి ఆటపాటల్ని పనిలో భాగం చేయడం కష్టం కదా. అందుకే దీనికి ప్రత్యేకంగా పలు కంపెనీల్లో బిలియర్డ్స్ వంటి ఇండోర్ గేమ్స్, పింగ్ పాంగ్.. ఉంటాయి. అంతేకాదు తమ ప్రియమైన పెట్ ఇంటి దగ్గర ఎలా ఉందో అని బెంగపడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు పెట్ని సైతం తమతో పాటు తెచ్చుకునే అవకాశం ఉంది. హాయిగా వర్క్ బ్రేక్‌లో పెట్స్‌తో కాలక్షేపం చేస్తే.. వావ్.. వాటె వండర్ఫుల్ టైం ఇటీజ్.. అని అనుకోకుండా ఉండలేం కదా. ఈట్ స్ట్రీట్స్... స్టార్ హోటల్ ఫుడ్‌కి తగ్గకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు స్టాఫ్‌కి అందిస్తాయి. స్థాయీ భేదాలకు అతీతంగా 3 నుంచి 7 స్టార్ హోటల్ రేంజ్లో ఇవి ఉంటాయి. స్వయంగా మాత్రమే వండుకుని తినేవారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కాంటినెంటల్, ఇటాలియన్, మల్టీక్యుజిన్ రుచుల్ని ఆస్వాదించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ మొదలుకుని డిన్నర్ దాకా సిద్ధంగా ఉంటాయి. క్యాంటీన్లలో ఆహారం తినేటప్పుడు పొరపాటున ఏమైనా దుస్తుల మీద పడితే వెంటనే క్లీన్ చేసి ఇవ్వడానికి లాండ్రీలు కూడా ఉంటున్నాయి. అవీ ఇవీ... ఫెస్టివల్ బోనస్‌లు, అప్రైజల్ బోనస్‌లు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం, అప్రిషియేషన్ రూపంలో ఎక్స్పెన్సివ్ గాడ్జెట్స్ అందుతాయి. తల్లిదండ్రులతో సహా మొత్తం ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్, సొడెక్సో షాపింగ్ కూపన్స్, మీల్ కూపన్స్ కూడా. నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ తీర్థయాత్రలు లేదా ఫారిన్ విజిట్‌కి వెళితే.. ఖర్చులు కూడా కంపెనీలే భరిస్తున్నాయి. క్లబ్స్, రిసార్ట్స్‌లో సభ్యత్వాలు గిఫ్ట్స్‌గా అందిస్తున్నాయి. ఫిమేల్ ఎంప్లాయ్‌కి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం మామూలే. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా లీవ్ మంజూరు చేస్తున్నారు. గూగుల్‌లో అయితే డెలివరీ అయిన తల్లికి ఒకటిన్నర ఏడాది జీతం ఇస్తారట. తండ్రికి ఆర్నెల్ల జీతం ఇస్తారు. భళా...గూగుల్... మనకు ఏ ఇన్ఫర్మేషనైనా వెంటనే గూగుల్ గుర్తుకు వస్తుంది. టాప్ క్లాస్ ఫెసిలిటీస్ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గూగుల్ కంపెనీయే గుర్తొస్తుంది. శాలరీ సంగతి అలా ఉంచి, ఈ సంస్థ తమ ఉద్యోగుల కోసం అందిస్తున్న ఫెసిలిటీస్ వల్లే ఆ కంపెనీలో జాబ్‌కి టెకీలు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారట. అదే విధంగా ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్.. ఇలా మరికొన్ని కంపెనీలు కూడా అత్యున్నత వసతులు కల్పిస్తున్న జాబితాలో ఉన్నాయి. క్రియేటివిటీకి జై... క్యాంటీన్, ఇతరత్రా సౌకర్యాల సంగతెలా ఉన్నా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, కల్చరల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ ఏరియాలు.. ఇలా ఒకటొకటిగా కంపెనీలు తమ ఫెసిలిటీస్‌ని విస్తరిస్తుండటానికి ఇటీవల కార్పొరేట్ సంస్థల మధ్య పెరుగుతున్న క్రియేటివ్ వార్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. క్విజ్లు, డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షోలు, కార్పొరేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇంకా ఇలాంటి టాలెంట్ బేస్డ్ కాంటెస్ట్‌లు వరుసగా జరుగుతుండడం, సిబ్బంది బాగా ఆసక్తి చూపిస్తుండడంతో ఈ తరహా వసతులు ఏర్పాటు చేయడం సంస్థలకు కూడా అవసరంగా మారింది. సిబ్బందిలోని క్రియేటివిటీ పెరగడం తమ సంస్థ పేరు ప్రఖ్యాతులకు కూడా ఉపయుక్తం అవుతోందని కంపెనీలు ఆశిస్తున్నాయి.