అంతరిక్ష పరిశోధనలకు.. ఆస్ట్రానమీ
అప్‌కమింగ్ కెరీర్: విశ్వం ఎలా ఏర్పడింది? దీనికి ఆది, అంతం ఎక్కడ? గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉద్భవించాయి? రాత్రిపూట మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, పాలపుంతలు, తోక చుక్కల మర్మమేంటి? మరో గ్రహంపై మానవ నివాసం సాధ్యం కావాలంటే ఏం చేయాలి?... తదితర విషయాలపై ఎవరికైనా ఆసక్తి ఉండడం సహజం. అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్న అనంతమైన విశ్వ రహస్యాలను తెలుసుకోవాలని మనిషి అనాదిగా కృషి చేస్తూనే ఉన్నాడు. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. అంతరిక్షంపై నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు ఈ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ అధికంగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి ఆస్ట్రానమీని కెరీర్‌గా మలచుకుంటే.. బంగారు భవిష్యత్తు సొంతమవడం ఖాయం.
ఆస్ట్రానమీలో రెండు విభాగాలుంటాయి. అవి.. థియారెటికల్ ఆస్ట్రానమీ, అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ. అభ్యర్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాన్ని ఎంచుకోవచ్చు. ఆస్ట్రానమర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో తగిన పరిజ్ఞానం సంపాదిస్తే.. అబ్జర్వేటరీల్లో పరిశోధకులుగా, యూనివర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), స్పేస్ ఫిజిక్స్ ల్యాబోరేటరీస్ వంటి అత్యున్నత సంస్థల్లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మంచి అవకాశాలున్నాయి. ఆస్ట్రానమర్‌గా గుర్తింపు సాధించాలంటే.. ఫిజిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్‌లో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకోవాలి. డేటా అనాలిసిస్‌పై గట్టి పట్టు ఉండాలి. నూతన శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలి.
వేతనాలు:
పరిశోధనా కేంద్రాల్లో రీసెర్చ్ వర్క్, కాలేజీ/యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ఆస్ట్రానమర్‌లకు ప్రారంభంలో నెలకు రూ.50 వేల దాకా వేతనం లభిస్తుంది. తర్వాత ఎక్స్‌పీరియెన్స్, సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది.
అర్హతలు:
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్, బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత ఫిజిక్స్/ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదవాలి. అనంతరం పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే పరిశోధనా రంగంలో స్థిరపడొచ్చు. వర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు.
అస్ట్రానమీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://www.osmania.ac.in/
ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్-పుణె
వెబ్‌సైట్: http://www.iucaa.ernet.in/
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-బెంగళూరు
వెబ్‌సైట్: http://www.iiap.res.in/
రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు
వెబ్‌సైట్: http://www.rri.res.in/
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
వెబ్‌సైట్: http://www.du.ac.in/
యూనివర్సిటీ ఆఫ్ ముంబై
వెబ్‌సైట్: http://www.mu.ac.in/
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-త్రివేండ్రం
వెబ్‌సైట్: http://www.iist.ac.in/
పరిశోధనలకు సరైన ఎంపిక
‘‘విశ్వ రహస్యాల ఛేదనలో ఖగోళ శాస్త్రవేత్తలది కీలకపాత్ర. ఆస్ట్రానమీ అనగానే పాత సబ్జెక్టు అనే భావన రాదు. అది ఎప్పటికీ నిత్యనూతనం. అంతరిక్షంలో మానవాళి నివాసానికి అనువుగా ఉండే గ్రహాల అన్వేషణ. నక్షత్రాలు, గ్రహాల గమనం వంటి అంశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగినట్లుగానే ప్రభుత్వాలు పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి. అస్ట్రో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి భిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి పలు యూనివర్సిటీల్లో ఫెలోషిప్‌లు అందజేసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. అయితే పరిశోధనలతో కొత్త అంశాలను వెలికితీయాలనే ఉత్సుకత ఉన్న యువతకు ఆర్‌అండ్‌డీ విభాగంలో అవకాశాలు అపారం. బోధన రంగంలో స్థిరపడే వీలుంది. కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రానమీతో అవకాశాలు పుష్కలం’’
- డాక్టర్ ఎస్.ఎన్.హసన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ హెడ్,
ఉస్మానియా విశ్వవిద్యాలయం