రాష్ర్టం నుంచి రాజ్యసభకు ఆరుగురు
రాజ్యసభకు రాష్ర్టం నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. 2014 ఫిబ్రవరి 7న జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎం.ఎ. ఖాన్, కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం నుంచి సీతారామలక్ష్మి, జి. మోహన్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి కె. కేశవరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు.
రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
2014-15 సంవత్సరానికి రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2014 ఫిబ్రవరి 10న శాసనసభకు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వచ్చే ఆర్నెల్ల కాలానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్నెల్ల కాలానికి రూ. 79,460 కోట్లు కేటాయించారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
మొత్తం బడ్జెట్: రూ. 1,83,129 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ. 1,15,179 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 67,950 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 25,402 కోట్లు(జీఎస్‌డీపీలో 2.6 శాతం)
రెవెన్యూ మిగులు: రూ. 474 కోట్లు
ప్రధాన కేటాయింపులు: వ్యవసాయం,
అనుబంధ రంగాలు: రూ. 6,685.33 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ. 13,661.77 కోట్లు
నీటిపారుదల: రూ. 23,311.98 కోట్లు
సాధారణ విద్య: రూ. 22,123.09 కోట్లు
సంక్షేమం: రూ. 11,650.85 కోట్లు
సాధారణ సేవలు: రూ. 62,678.74 కోట్లు
అంతర్జాతీయం
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల
‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ల(46) 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యా రు. ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ స్థానంలో నాదెళ్ల బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బిల్‌గేట్స్ స్థానంలో జాన్ థాంప్సన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
మలాలాకు బాలల నోబెల్ పురస్కారం
పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్(16) ప్రపంచ బాలల పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమెతో పాటు అమెరికాకు చెందిన జాన్‌ఉడ్, నేపాల్‌కు చెందిన రాణామగర్ కూడా 2014 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. స్వీడన్‌కు చెందిన సంస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తుంది. జాన్‌ఉడ్, రాణామగర్ కూడా పిల్లల విద్య, హక్కుల కోసం పాటుపడుతున్నారు.
తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు
మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 2014 ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన జనరల్స్‌కు పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించారు.
క్రీడలు
ఐసీసీ చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ 2014 ఫిబ్రవరి 8న సింగపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్‌గా ఉన్నారు.
ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ 2014 ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ఈ టోర్నమెంట్ బెంగళూరులో 2014 ఫిబ్రవరి 8న ముగిసింది.
విజేతలు: పురుషుల సింగిల్స్: అనూప్ శ్రీధర్(కర్ణాటక). ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ(పెట్రోలియం)ను ఓడించాడు.
పురుషుల డబుల్స్: చోప్రా ప్రణవ్ జెర్రీ, అక్షయ్ దెవాల్కర్. వీరు ఫైనల్స్‌లో నందగోపాల్, హేమనాగేంద్రబాబులను ఓడించారు.
మహిళల సింగిల్స్: తాన్వి లాడ్. ఫైనల్స్‌లో రితూపర్ణాదాస్‌ను ఓడించింది.
మహిళల డబుల్స్: జె. మేఘన, సిక్కి రెడ్డి. వీరు ఫైనల్స్‌లో ప్రజక్తా సావంత్, ఆరతీ సారా సునీల్‌ను ఓడించారు.
జాతీయం
పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్ మృతి
మేఘాలయ మొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్(103) షిల్లాంగ్‌లో 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అనేక హోదాల్లో పని చేశారు.
జమ్మూలో 101 సైన్‌స కాంగ్రెస్
2014 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు జమ్మూ విశ్వవిద్యాలయంలో జరిగిన 101 సైన్‌స కాంగ్రెస్‌ను ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. సైన్‌స కాంగ్రెస్‌లో మన్మోహన్‌సింగ్ ప్రసంగించడం ఇది ఏడోసారి. రూ. 9,000 కోట్లతో చేపట్టే శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు.
వాటిలో రూ. 4,500 కోట్లతో చేపట్టే నేషనల్ మిషన్ ఆన్ హైపర్ఫార్మెన్‌స కంప్యూటింగ్, రూ. 1,450 కోట్లతో తమిళనాడులో ఏర్పాటు చేసే న్యూట్రినో ఆధారిత అబ్జర్వేటరీ,రూ. 3,000 కోట్లతో జాతీయ భౌగోళిక సమాచార వ్యవస్థ ఉన్నాయి. ప్రఖ్యాత విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో ఏడాది పాటు పనిచేసేందుకు 25 జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసినందుకు హోమీ జె. బాబా స్మారక అవార్డును రీసెర్‌చ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్ రెడ్డికి ప్రదానం చేశారు.
7వ వేతన సంఘం చైర్మన్‌గా అశోక్ కుమార్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడో వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 4న నియమించింది. 50 లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, 30 లక్షల మంది పెన్షనర్ల చెల్లింపులపై వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. రెండేళ్లలో ఈ సంఘం తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది.
‘బ్రహ్మోస్’ క్షిపణి పరీక్ష విజయవంతం
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ని సాల్వో మోడ్ పద్ధతిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) 2014 ఫిబ్రవరి 7న విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రికండ్ నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.
సాల్వో మోడ్ పద్ధతిలో ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగిస్తారు. బ్రహ్మోస్ 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఇండో-రష్యన్ సంస్థ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ దీన్ని నిర్మించింది.
సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అర్చనా రామసుందరం 2014 ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. మహిళా అధికారి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఈమె తమిళనాడు కేడర్‌కు చెందిన అధికారి. ఆమె గతంలో తమిళనాడు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు.
2013-14లో జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతం
2013-14 సంవత్సర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం 2014 ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా సీఎస్‌ఓ అంచనా వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-14లో వృద్ధికి తోడ్పడ్డాయి. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది.ఇది దశాబ్ద కాలంలో అతి తక్కువ.
తలసరి ఆదాయం 2004-05 ధరల్లో వాస్తవ ప్రాతిపదికన 2013-14లో రూ. 39,961 ఉండొచ్చని అంచనా. ఇది 2012-13లో రూ. 38,856. ఈ పెరుగుదల 2.8 శాతం మాత్రమే ఉంది. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2013-14లో రూ. 74,920 ఉంటుందని సీఎస్‌ఓ అంచనా వేసింది. ఇది గతేడాది *67,839 కంటే 10.4 శాతం ఎక్కువ.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన 2013 సెప్టెంబర్ 3 నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు.
73వ రాజ్యాంగ సవరణ వర్తింపునకు జమ్మూ కాశ్మీర్ ఆమోదం
జమ్మూకాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టం 1989కు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తింపచేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన 2014 ఫిబ్రవరి 8న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందువల్ల పంచాయతీలకు ప్రణాళికలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధు ల వినియోగంలో స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్ కల్పించేందుకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు పడుతుంది. పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థుల వయసును 25 నుంచి 21కి తగ్గించొచ్చు.
జాతీయ అటవీ వ్యవసాయ విధానానికి కేబినెట్ ఆమోదం
జాతీయ అటవీ వ్యవసాయ (ఆగ్రోఫారెస్ట్రీ) విధానానికి కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 6న ఆమోదం తెలిపింది. ప్రతికూల విధానాలు, చట్టపరమైన అడ్డం కులు, పెట్టుబడుల లేమి, అందు బాటులో లేని మార్కెట్ వంటి సమస్యలను అధిగమించడానికి, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఈ విధానాన్ని రూపొందించారు.
ఈ విధానం కింద రైతులకు రుణాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తారు. ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు.రూ. 200 కోట్లతో నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ మిషన్, నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ బోర్డులను ఏర్పాటు చేస్తారు.
సివిల్స్‌కు రెండు అవకాశాలు పెంచిన కేంద్రం
సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరో రెండు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించి 2014 ఫిబ్రవరి 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి అమల్లోకి వస్తుంది. ఓసీ అభ్యర్థులు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు వరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్షలు రాయొచ్చు. వెనుకబడిన వర్గాల వారు ఏడుసార్లు రాయొచ్చు. వీరికి మూడేళ్లు సడలింపు ఉంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాయొచ్చు. వీరికి వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంది. ప్రస్తుతం కల్పించిన రెండు అవకాశాల వల్ల అన్ని వర్గాల వారికి రెండేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.
కరెంట్ అఫైర్స్
Published Wed, Feb 12 2014 11:05 PM | Last Updated on Thu, Aug 16 2018 4:12 PM
Advertisement
Advertisement