కరెంట్ అఫైర్స్ | Current affairs | Sakshi
Sakshi News home page

కరెంట్ అఫైర్స్

Published Thu, Sep 24 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

 రాష్ట్రీయం
  పట్టిసీమ పథకం ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 16న ప్రారంభించారు. రూ.1300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నదీ జలాలను పోలవరం కుడి కాల్వ ద్వారా 174 కి.మీ తరలించి కృష్ణా నదిలో కలపనున్నారు. ఈ నీటిని కృష్ణా బ్యారేజ్ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టుకు అందిస్తారు.
 
 సీఎం కేసీఆర్ చైనా పర్యటన
 విజయవంతం తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబరు 7 నుంచి 16 వరకు పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని సీఎం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా చైనాకు చెందిన బహుళజాతి సంస్థ వాండా కంపెనీ గ్రేటర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
 
 ఆత్మహత్య చేసుకున్న రైతులకు
 పరిహారం రూ.6 లక్షలకు పెంపు తెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెప్టెంబరు 19న సమావేశమైన రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తంలో రూ.5 లక్షలు రైతు కుటుంబానికి, రూ.1 లక్షను రైతులు చెల్లించాల్సిన అప్పుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌గా అందజేస్తారు.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
  అమోఘ-1 క్షిపణి పరీక్ష విజయవంతం యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్ అమోఘ-1ను సెప్టెంబరు 10న భారత్ విజయవంతంగా పరీక్షించింది. యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్‌ను మధ్యప్రదేశ్‌లోని బాబినా ఆర్మీ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తెలిపింది. ఈ క్షిపణి 2.8 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో దీన్ని అభివృద్ధి చేశారు.
 
 సతీష్‌రెడ్డికి మోక్షగుండం అవార్డు
 రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు, రక్షణ శాఖ పరిశోధనా కేంద్రం ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్‌రెడ్డికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు లభించింది. సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సతీష్‌రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేసింది.
 
 20 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా
 ఉపగ్రహ వాహక నౌక లాంగ్ మార్చ్-6 ద్వారా చైనా ఒకేసారి 20 సూక్ష్మ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 20న షాంఘై ప్రావిన్సులోని తైయువాన్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌లో ఇంధనంగా కాలుష్య రహిత ఇంధనాలు ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఉపయోగించారు.
 
 అంతర్జాతీయం
  అమల్లోకి వచ్చిన నేపాల్ రాజ్యాంగం  నేపాల్‌లో సెప్టెంబరు 20 నుంచి చారిత్రాత్మక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో నేపాల్ పూర్తి స్థాయి లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 239 ఏళ్ల నేపాల్ రాచరికం 2008లో రద్దయింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్ట సభలు ఉంటాయి. ప్రతినిధుల సభ, దిగువసభలో 375 మంది, ఎగువసభలో 60 మంది సభ్యులు ఉంటారు. ఏడు ప్రావిన్సు(రాష్ట్రాలతో)లతో సమాఖ్య ఏర్పడుతుంది. దక్షిణ మైదాన ప్రాంతంలో మైనారిటీ గ్రూపులు తమ ప్రావిన్సుల విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
 
 ఐరాసలో సంస్కరణలకు తొలి అడుగు
 ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన చర్చా పత్రానికి ఐరాస సర్వప్రతినిధి సభ సెప్టెంబరు 14న ఆమోదం తెలిపింది. ఏడేళ్ల అనంతరం సభలో ముసాయిదా ఆధారంగా చర్చ జరుగనుంది. ఈ చర్చా పత్రంలో భద్రతా మండలి సంస్కరణలపై సభ్యదేశాల వైఖరి, భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాన్ని ఏవిధంగా విస్తరించాలి వంటి అంశాలున్నాయి. భద్రతామండలిలో సంస్కరణ లు చేపట్టాలని భారత్ కోరుతోంది.
 
 ఆస్ట్రేలియా ప్రధానిగా మాల్కొమ్ టర్న్‌బుల్
 ఆస్ట్రేలియా నూతన  ప్రధానిగా మాల్కొమ్ టర్న్‌బుల్ సెప్టెంబరు 15 పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 14న లిబరల్ పార్టీ ఆయన్ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. పార్టీ అధినేత కోసం జరిగిన ఎన్నికల్లో గత ప్రధాని టోనీ అబాట్‌కు 44 ఓట్లు రాగా, టర్న్‌బుల్‌కు 54 ఓట్లు లభించాయి. దీంతో టోనీ అబాట్ ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చింది. అబాట్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో లిబరల్ పార్టీ టర్న్‌బుల్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. 2017 జనవరిలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
 
 కంబోడియాతో రెండు ఒప్పందాలు
 భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మూడు రోజుల కంబోడియా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 15న ఆ దేశ ప్రధానమంత్రి హున్ సేన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య టూరిజం, ఐదు క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన మొకాంగ్-గంగా సహకార కార్యక్రమంపై అవ గాహన ఒప్పందాలు కుదిరాయి. పర్యటనలో భాగంగా అన్సారీ కంబోడియా మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
 
 రచయిత్రి జాకీ కోలిన్స్ మృతి
 ప్రముఖ బ్రిటన్ రచయిత్రి జాకీ కోలిన్స్ (77) లాస్ ఏంజిలెస్‌లో సెప్టెంబరు 20న మరణించారు. ఆమె రాసిన 30కి పైగా పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆమె 1968లో రాసిన మొదటి నవల ‘ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యారీడ్ మెన్’ బాగా ప్రాచుర్యం పొందింది. ద స్టడ్, రాక్‌స్టార్ ఆమె ఇతర ప్రముఖ నవలలు.
 
 గ్రీస్ ప్రధానిగా సిప్రాస్ తిరిగి ఎన్నిక
 అలెక్సిస్ సిప్రాస్ సెప్టెంబరు 21న గ్రీసు ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గ్రీసు పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 300 స్థానాలకు వామపక్ష పార్టీ సిరిజా నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ 145 స్థానాల్లో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి న్యూ డెమొక్రసీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్‌కు 75 స్థానాలు దక్కాయి. రుణ సంక్షోభం నేపథ్యంలో ఆగస్టులో సిప్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు.
 
 జాతీయం
 ఎస్‌పీఎంఆర్‌ఎం మిషన్‌కు కేబినెట్ ఆమోదం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రర్బన్(రూరల్-అర్బన్) మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)కు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 16న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో రూ.5,142.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300 గ్రామీణ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పురపథకం స్థానంలో ప్రభుత్వం గతేడాది ఎస్‌పీఎంఆర్‌ఎంను ప్రకటించింది. క్లస్టర్స్ అభివృద్ధిలో 14 అంశాలను పేర్కొన్నారు. ఇందులో డిజిటల్ అక్షరాస్యత, సంచార ఆరోగ్య కేంద్రం, రోడ్ల అనుసంధానం, ఆర్థిక కార్యక్రమాలతో ముడిపడిన నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం తగ్గించడం,గ్రామీణ వలసలను తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటారు.
 
 శ్రీలంక ప్రధానమంత్రి భారత్ పర్యటన
 శ్రీలంక ప్రధానమంత్రి విక్రమ సింఘే భారత పర్యటనలో భాగంగా సెప్టెంబరు 15 భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. భారత్ భాగస్వామ్యం, హిందూ మహాసముద్రంలో భద్రత, ఉగ్రవాదం, తమిళుల సమస్యలు, శ్రీలంకలో మానవ హక్కుల పరిస్థితి తదితర అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. శ్రీలంక ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో సార్క్ ఉపగ్రహ ప్రయోగం, ఆరోగ్య రక్షణ, అంతరిక్ష శాస్త్రాలకు సంబంధించినవి ఉన్నాయి.
 
 క్రీడలు
 నేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ ఛాంపియన్‌గా రైల్వేస్ కోల్‌కతాలో సెప్టెంబరు 19లో ముగిసిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా రైల్వేస్ నిలిచింది. మొత్తం 267 పాయింట్లతో రైల్వేస్ మొదటి స్థానంలో నిలువగా, ఓఎన్‌జీసీ(185),సర్వీసెస్(174.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
 
 బీసీసీఐ అధ్యక్షుడు  జగ్మోహన్ దాల్మియా మృతి

 భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) అనారోగ్యంతో సెప్టెంబరు 20న కోల్‌కతాలో మరణించారు. ఈ ఏడాది మార్చి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఆయన బీసీసీఐ (2001-2004), ఐసీసీ(1997-2000) అధ్యక్షులుగా సేవలందించారు. 1987, 1996 ప్రపంచకప్‌ల నిర్వహణలో దాల్మియా కీలకపాత్ర పోషించారు.
 
 వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్
 ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సింగపూర్‌లో సెప్టెంబరు 20న జరిగిన రేసులో వెటల్ మొదటి స్థానంలో నిలువగా, డేనియల్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు.
 
 కొరియా ఓపెన్ టైటిల్
 కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. సెప్టెంబరు 20న సియోల్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అజయ్ జయరామ్ (భారత్)ను చెన్ లాంగ్ ఓడించాడు.
 
 సంక్షిప్తంగా
 రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి సీవై సోమయాజులతో న్యాయ విచారణ కమిటీని నియమించింది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తమ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంబ్రిడ్జి ప్రతినిధి జెన్నిఫర్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.విజయవాడ (ఏపీ), కురుక్షేత్ర (హర్యానా), భోపాల్ (మధ్యప్రదేశ్), జోరాట్ (అసోం)లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐడీలకు నలుగురు డెరైక్టర్ల నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.యూపీ సచివాలయంలోని 368 ప్యూన్ పోస్టులకు రికార్డు స్థాయిలో 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 1.5 లక్షల గ్రాడ్యుయేట్లు, 255 పీహెచ్‌డీలు ఉండటం విశేషం.నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement