సివిల్స్ ప్రిలిమ్స్‌లో హిస్టరీకి ఎలా సిద్ధమవ్వాలి?
- అలేఖ్య, అమీర్‌పేట
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో భారతదేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్రోద్యమం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘ సంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం - ముఖ్య ఘట్టాలు, చట్టాలు - ఫలితాలు వంటివాటిపై దృష్టి సారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా.. మారు మూల అంశాల నుంచి కూడా ఇస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి.
చదవాల్సిన పుస్తకాలు:
ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాలు
ఇండియన్ హిస్టరీ -వి.కె.అగ్నిహోత్రి
ప్రాచీన చరిత్ర - ఆర్. శర్మ, రొమిల్లా థాపర్
మధ్యయుగ చరిత్ర - సతీశ్ చంద్ర
మోడ్రన్ ఇండియా - బిపిన్ చంద్ర
ఇన్‌పుట్స్: కరీం, సీనియర్ ఫ్యాకల్టీ
ఎస్‌బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌కు ఎలా సిద్ధమవాలి?
- హిమబిందు, హిమాయత్‌నగర్
బ్యాంక్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబులరీపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దిన పత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్స్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తం మీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే.
జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం - వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్‌బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు - కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు - విజేతలు, అవార్డులు - విజేతలు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన రోజులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇన్‌పుట్స్: కె.వి. జ్ఞానకుమార్
డెరైక్టర్, డీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్.
సివిల్స్-ప్రిలిమ్స్: బయాలజీ
బ్యాంక్ ఎగ్జామ్స్: రీజనింగ్
పేజీలను www.sakshieducation.com
నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.