క్లిష్టత పెరిగినా.. ఫలితాల్లో హవా | IIT , NIIT Special Focus | Sakshi
Sakshi News home page

క్లిష్టత పెరిగినా.. ఫలితాల్లో హవా

Published Wed, May 7 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

IIT , NIIT Special Focus

నిట్‌లు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశించడానికి.. అదే విధంగా అత్యున్నత విద్యకు వేదికలుగా నిలిచే ఐఐటీలు, ఐఎస్‌ఎం (ధన్‌బాద్)లో సీట్లను పొందేందుకు వీలుకల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి జేఈఈ మెయిన్ మార్కులు కీలకం. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలు, అడ్వాన్స్‌డ్ రాయడానికి
 కటాఫ్ మార్కులు తదితరాలపై స్పెషల్ ఫోకస్..
 
 13.57 లక్షలు.. దేశవ్యాప్తంగా
 జేఈఈ మెయిన్ 2014కు
 దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.
 
 1,22,863.. ఈ పరీక్షకు హాజరైన
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య.
 (దాదాపు పది శాతం)
 
 1.54 లక్షలు.. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత
 సాధించిన విద్యార్థులు. ఈసారి విద్యార్థినుల
 సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఉత్తీర్ణుల్లో
 28,666 మంది విద్యార్థినులున్నారు.
 
 మరోసారి రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ:
 గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ, జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో టాప్ మార్కులు, ర్యాంకులతో ప్రతిభ కనబరుస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఈ ఏడాది కూడా అదే హవా కొనసాగించారు. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో 355 మార్కులతో రాష్ట్రానికి చెందిన వాకచర్ల ప్రమోద్ మొదటి స్థానంలో నిలవగా.. మహమ్మద్ అక్రమ్ ఖాన్ అనే మరో విద్యార్థి 350 మార్కులతో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. గత ఏడాది కూడా జేఈఈ-మెయిన్ మార్కుల విషయంలో మన రాష్ట్ర విద్యార్థులే తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
 
 ఇక.. మొత్తం ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతానికి సంబంధించి ప్రస్తుత సమాచారం ప్రకారం మొత్తం ఉత్తీర్ణుల్లో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉంటుందని అంచనా. ‘సీబీఎస్‌ఈ సిలబస్‌కు సరితూగేలా ఇంటర్మీడియెట్ సిలబస్‌లో మార్పులు తేవడం, కెమిస్ట్రీ ప్రశ్నలు గత ఏడాదితో పోల్చితే కాసింత సులభంగా ఉండటం, మరోవైపు విద్యార్థుల్లోనూ ప్రాక్టికల్ అప్రోచ్ పెరగడమే ఈ ఫలితాలకు కారణమని’ పోటీ పరీక్షల నిపుణులు పేర్కొన్నారు.
 
 పెరుగుతున్న మార్కులు:
 జేఈఈ పరీక్ష క్లిష్టత ఏటా పెరుగుతున్నప్పటికీ.. విద్యార్థులు సాధిస్తున్న మార్కుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఐఐటీ-జేఈఈకి బదులు..  జేఈఈ మెయిన్ - అడ్వాన్స్‌డ్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన 2013తో పోల్చినా అత్యధిక మార్కుల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఏడాది అత్యధిక మార్కులు 345. కాగా, ఈ ఏడాది అత్యధిక మార్కులు 355. అదే విధంగా గత ఏడాది రెండో స్థానంలో 341 మార్కులు నిలవగా.. ఈ ఏడాది అవి 350కి పెరిగాయి.
 
 కటాఫ్‌లలోనూ పెరుగుదల:
 ఒకవైపు మార్కులు పెరుగుతున్నట్లే.. జేఈఈ-అడ్వాన్స్‌డ్ కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతున్నాయి. జనరల్ కేటగిరీ నుంచి అన్ని వర్గాల వరకు ఈ కటాఫ్‌లు గత ఏడాది కంటే పెరిగాయి. వివరాలు..
 
 కేటగిరీ    2014 కటాఫ్    2013 కటాఫ్
 జనరల్    115    113
 ఓబీసీ    74    70
 ఎస్సీ    53    50
 ఎస్టీ    47    45
 
 ఆప్షన్లలో దోషాలు.. అదనపు మార్కులు:
 ఈ ఏడాది ఫలితాల విషయంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం.. ఆయా ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో లోపాల కారణంగా విద్యార్థులందరికీ అదనపు మార్కులు కేటాయించినట్లు సీబీఎస్‌ఈ ప్రకటించడం. ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఒక ప్రశ్నకు; అదే విధంగా ఏప్రిల్ 19న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో మూడు ప్రశ్నలకు ఆప్షన్లు సరిగా లేవని.. సీబీఎస్‌ఈ విడుదల చేసిన ‘కీ’ ఆధారంగా పలువురు విద్యార్థులు ఆరోపించిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో హాజరైన విద్యార్థులకు నాలుగు, ఏప్రిల్ 19న ఆన్‌లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు 12 మార్కులు అదనంగా కేటాయించినట్లు .. మెయిన్ ఫలితాల వెల్లడి సమయంలో సీబీఎస్‌ఈ చైర్మన్ వినీత్ జోషి ప్రకటించారు. ప్రతి మార్కు కీలకంగా నిలిచే జేఈఈలో అదనపు మార్కులు కేటాయించడం ర్యాంకుల విషయంలోనూ ప్రభావం చూపుతుంది.
 
 తొలుత 1.5 లక్షల మందికి:
 ప్రస్తుతం మెయిన్‌లో మార్కులు.. ఆయా కేటగిరీల్లో ప్రకటించిన కటాఫ్ ర్యాంకుల ఆధారంగా తొలుత 1.5 లక్షల మందికి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకునేందుకు అర్హత లభించింది. వీరంతా 9వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అడ్వాన్స్‌డ్ పరీక్ష తదుపరి దశలో ఎంపిక క్రమంలో.. మూడు విధానాలను అనుసరిస్తారు. అవి.. జేఈఈ మెయిన్‌లో పొందిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షల్లో పొందిన మార్కులకు 40 శాతం వెయిటేజీ కల్పిస్తూ తొలి జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత నార్మలైజేషన్ ద్వారా మెయిన్ తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ జాబితా ఆధారంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలు పొందొచ్చు. తర్వాత దశలో ఐఐటీలు, ఐఎస్‌ఎం (ధన్‌బాద్)ల్లో ప్రవేశానికి.. అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు ఆయా బోర్డ్ పరీక్షల్లో టాప్ 20 పర్సెంటైల్‌లో ఉండాలి. గత ఏడాది గణాంకాలు.. ఈ ఏడాది మెయిన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది కూడా టాప్-20 పర్సెంటైల్‌లో మన రాష్ట్ర విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది టాప్-20 పర్సెంటైల్ జాబితాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 91.8 శాతం మార్కులకే ఈ జాబితా పూర్తికాగా.. తమిళనాడు బోర్డ్ 90.9 శాతంతో, తర్వాత స్థానంలో కేరళ 85.2 శాతంతో నిలిచాయి.
 
 జేఈఈ - మెయిన్ మార్కులు.. ర్యాంకుల అంచనా:
 ఇంటర్మీడియెట్ తత్సమాన బోర్డ్ మార్కులు, జేఈఈ మెయిన్ మార్కులు, నార్మలైజేషన్  ఆధారంగా పర్సెంటైల్ గణించి జూలై 7న ఆలిండియా ర్యాంకులు విడుదల చేయనున్నారు.
 ఈ నేపథ్యంలో తాజాగా మెయిన్‌లో పొందిన మార్కులు.. వాటికి లభించే ర్యాంకులపై అంచనా..
 
  జేఈఈ మెయిన్ మార్కులు    ర్యాంకు అంచనా
 320 పైన    100 లోపు
 290 - 310    100 నుంచి 200
 270 - 290    200 నుంచి 550
 250 - 270    550 నుంచి 1000 లోపు
 240 - 250    1000 నుంచి 1500
 220 - 240    1500 నుంచి 3500
 210 - 220    3500 నుంచి 4000
 200 - 210    4000 నుంచి 5500
 190 - 200    5500 నుంచి 7000
 185 - 190    7000 నుంచి 7700
 180 - 185    7700 నుంచి 8000
 175 - 180    8000 నుంచి 9500
 170 - 175    9500 నుంచి 10000
 160 - 170    10 వేల నుంచి 12 వేలు
 
 గత ఏడాది కామన్ మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంకుకు లభించిన మార్కులు 332. కాగా, చివరి ర్యాంకు విద్యార్థికి లభించిన మార్కులు 156. దీని ప్రకారం మెయిన్‌లో అత్యధిక మార్కులు పొందినా.. నార్మలైజేషన్ తర్వాత ర్యాంకుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
 
 అడ్వాన్స్‌డ్ మార్కుల ఆధారంగా 15 ఐఐటీలు, ఐటీ-బీహెచ్‌యూ, ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లలో లభించే సీట్లు -
 9,885. వీటిలో అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,341 సీట్లు అందుబాటులో ఉండగా.. అత్యల్పంగా ఐఐటీ-మండి, ఇండోర్, రోపార్ క్యాంపస్‌లలో 120 చొప్పున ఉన్నాయి.
 
 జేఈఈ-మెయిన్ మార్కులతో లభించే సీట్లు
     నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు - 15,500 సీట్లు
     పుల్ ఐటీలు - 850
     ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు - 15 వేలు
 
 
 అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి
 మెయిన్‌లో మార్కులు తెలిశాయి. ఇంటర్మీడియెట్ బోర్డ్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా నిర్ణయించిన టాప్-20 పర్సెంటైల్‌లో నిలవడం అనే విషయంలో అంచనా వచ్చి ఉంటుంది. కాబట్టి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇక మే 25న నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి. రెండు రోజుల వ్యవధిలో ఎంసెట్, అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగనున్న తరుణంలో ఈ రెండింటి సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు, మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెయిన్ పరీక్ష సరళిని పరిశీలిస్తే ప్రాక్టీస్, పేపర్- వర్క్ అవసరమైన ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే తరహా ప్రశ్నలు కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫిజిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
 
 జేఈఈ - 2014
 మే 2 అర్ధరాత్రి జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి.
 
 1,50,000
 మంది
 విద్యార్థులు
 అడ్వాన్స్‌డ్‌కు
 అర్హత సాధిస్తారు.
 
 
 జేఈఈ
 అడ్వాన్స్‌డ్
 మే 25, 2014
 (ఆఫ్‌లైన్)
 
 20,000
 మంది
 విద్యార్థులకు ర్యాంక్
 కేటాయిస్తారు
 
 ఇంటర్‌లో టాప్ 20
 పర్సంటైల్‌లో
 ఉంటే ఐఐటీలు, ఐఎస్‌ఎం - ధన్‌బాద్‌లో సీటు
 కేటాయిస్తారు
 
 పరీక్ష రాసిన
 విద్యార్థులందరికీ
 జేఈఈ మెయిన్‌కు 60 శాతం, ఇంటర్‌కు  40 శాతం వెయిటేజీతో జూలై 7న ర్యాంక్ కేటాయిస్తారు
 
 నిట్స్, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో  సీటు కేటాయిస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement