
ఇండియన్ హిస్టరీ
గుప్తానంతర యుగం-2
(6వ శతాబ్దం- 8వ శతాబ్దం)
హర్షుడి అనంతరం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో అతి ముఖ్యమైనవి బాదామి రాజధానిగా పాలించిన చాళుక్యులు (వీరినే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు), కంచి రాజధానిగా పాలించిన పల్లవులు (వీరిని మలి పల్లవులు అని కూడా పిలుస్తారు). ఈ రెండు వంశాల్లో ఒకరు కర్ణాటకను, మరొకరు తమిళనాడును పాలిస్తూ పరస్పరం నిరంతర యుద్ధాల్లో మునిగి ఉండేవారు. అయితే, సాహిత్యం, వాస్తు, శిల్పకళా రంగాల్లో దక్షిణ భారతదేశ సంస్కృతికి ఈ వంశాలు అమూల్యమైన సేవలందించాయి.
బాదామి చాళుక్యులు: క్రీ.శ. 6వ శతాబ్దంలో వీరు దక్కన్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. బ్రహ్మచుళుకం నుంచి జన్మించి నందునతాము చాళుక్యులమని వీరు పేర్కొన్నారు. చాళుక్యుల జన్మభూమిపై పలు వివాదాస్పద సిద్ధాంతాలున్నాయి. అయితే, బిల్హణుడు అనే కవి తన విక్రమాంక దేవచరిత్ర గ్రంథంలో వీరి జన్మస్థలం అయోధ్య అని పేర్కొన్నాడు. చాళుక్యుల రాజధాని వాతాపి(బీజాపూర్ జిల్లాలోని బాదామి నగరం). అందుకే వీరిని వాతాపి చాళుక్యులు అని కూడా పిలుస్తారు.
మొదటి పులకేశి: ఇతడు బాదామి చాళుక్యవంశ వాస్తవ స్థాపకుడు. తన రాజ్య స్థాపనను పురస్కరించుకుని అశ్వమేథ యాగాన్ని నిర్వహించాడు. మొదటి పులకేశి తర్వాత అతడి కుమారుడు కీర్తివర్మ రాజ్యానికి వచ్చాడు.
మొదటి కీర్తివర్మ: ఇతడు తన సోదరుడు మంగళేశుడితో కలిసి తన తండ్రి స్థాపించిన రాజ్యాన్ని పలు దిశల్లో విస్తరింపచేశాడు. కొంకణ్‌ను పాలించే మౌర్యులను, వైజయంతిని పాలించే కాదంబులను, మహారాష్ర్ట, మాళ్వాలను పాలించే కాలచురి రాజులను మొదటి కీర్తివర్మ ఓడించాడు.
మంగళేశ: కీర్తివర్మ కుమారుడైన పులకేశి బాలుడిగా ఉండడంతో అతడి తరఫున కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. కానీ అతడు పులకేశికి రాజ్యాన్ని అప్పగించకుండా తన కుమారులకు దాన్ని సంక్రమింపచేసే ప్రయత్నం చేసాడు. దీంతో పులకేశి అతడిని వధించాడు.
రెండో పులకేశి: ఇతడు క్రీ.శ. 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. తన పినతండ్రితో ఏర్పడిన వారసత్వ యుద్ధం నుంచి రాజ్యాన్ని రక్షించడమే కాకుండా తన దిగ్విజయ యాత్రల ద్వారా దానిని ఒక మహా సామ్రాజ్యంగా మార్చాడు. ఇతడి రాజ్య సరిహద్దులు నర్మద నుంచి కావేరి వరకూ విస్తరించాయి. దక్కన్‌పై జరిగిన హర్షుడి దాడిని ఇతడు విజయవంతంగా ఎదుర్కోవడమే గాక హర్షుడిని ఓడించినట్లుగా పులకేశి వారసుల శాసనాలు తెలియజేస్తున్నాయి.
కోస్తాంధ్రపై దాడిచేసి రణదుర్జయుల పిష్టపుర రాజ్యాన్ని, విష్ణుకుండినుల రాజ్యాన్ని ఇతడు అంతం చేశాడు. ఆంధ్ర ప్రాంతాలకు పిష్టపురాన్ని కేంద్రంగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్థనుడిని తన ప్రతినిధిగా నియమించాడు. అనంతర కాలంలో కుబ్జ విష్ణువర్థనుడు తన రాజధానిని వేంగీకి మార్చి స్వతంత్ర తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించా డు. రెండో పులకేశి పల్లవ రాజ్యంపై దాడిచేసి మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు. పర్షియా రాజు రెండో ఖుస్రూతో రెండో పులకేశి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అజంతాలోని చిత్రాల్లో కూడా ఈ అంశాన్ని చిత్రీకరించారు. క్రీ.శ. 642లో పల్లవరాజ్యంపై ఇతడు రెండోసారి దాడిచేశాడు. ఈ యుద్ధంలో పులకేశికి ఓటమితో పాటు ప్రాణహాని కూడా కలిగింది. పల్లవరాజు మొదటి నరసింహావర్మ ఈ దాడిని తిప్పికొట్టడమే గాక రెండో పులకేశిని తరుముతూ రాజధాని వాతాపివరకు వచ్చి పులకేశిని వధించాడు. వాతాపి నగరాన్ని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదును పొందాడు.
మొదటి విక్రమాదిత్యుడు: తన తండ్రి పులకేశి కాలంలో పల్లవులు జయించిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఆక్రమించాడు. కంచిపై దాడిచేసి పల్లవరాజు రెండో మహేంద్రవర్మను అంతం చేశాడు.
విజయాదిత్యుడు: ఇతడు 40 ఏళ్లపాటు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు. తన కాలంలో రాజ్యంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాడు. ఇతడి కాలం దేవాలయాల నిర్మాణానికి పేరెన్నికగన్నది. ఇతడు సుమారు 70 దేవాలయాలను నిర్మించినట్లుగా భావిస్తారు.
రెండో విక్రమాదిత్యుడు: ఇతడు తన పూర్వీకుల సాంప్రదాయమైన కంచిపై దాడులను పునరుద్ధరించాడు. ఇతని కాలంలో మొత్తం మూడు సార్లు కంచిపై దాడులు చేశాడు.
రెండో కీర్తివర్మ: బాదామి చాళుక్య వం శంలో చివరిరాజు. క్రీ.శ. 753లో సామంత రాజై న దంతిదుర్గుడు రెండో కీర్తివర్మను తొలగించి స్వతంత్ర రాష్ర్టకూట రాజ్యాన్ని స్థాపించాడు.
బాదామి చాళుక్యుల సాంస్కృతిక సేవ: బాదామి చాళుక్యులు తమ సామ్రాజ్యంలోని పలు ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణంలో ఓ కొత్త వాస్తు, శిల్పకళా శైలిని అభివృద్ధి చేశారు. దీనిని ‘వేసర’ శిల్పకళా శైలి అని పిలుస్తారు. దీన్ని ఉత్తర భారతంలోని నగర, దక్షిణాదిలోని ద్రావిడ శిల్పకళా శైలుల కలయికతో అభివృద్ధి చేశారు. చాళుక్యులు నిర్మించిన వాస్తు కట్టడాల్లో గుహాలయాలు, రాతి కట్టడాలున్నాయి.
రాజధాని నగరమైన బాదామిలో చాళుక్యులు నాలుగు గుహాలయాలను నిర్మించారు. ఇందులో ఒకటి తప్ప మిగిలినవన్నీ శైవమతానికి సంబంధించినవే. ఐహోల్ నగరంలో దాదాపు 70 దేవాలయాలు నిర్మించారు. పట్టడకల్ నగరంలోనూ వీరు పలు దేవాలయాలు నిర్మించారు. ఇంకా అలంపూర్, మహానంది మొదలైన ప్రాంతాల్లో వీరు నిర్మించిన దేవాలయాలు నేటికీ నిలిచి ఉన్నాయి. బాదామి చాళుక్యులు ప్రారంభించిన వేసర శైలి... హోయసాలులు, రాష్ర్టకూటుల కాలంలో అత్యున్నత దశకు చేరింది.