ఇండియన్ హిస్టరీ | indian history | Sakshi
Sakshi News home page

ఇండియన్ హిస్టరీ

Published Mon, Sep 16 2013 6:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

ఇండియన్  హిస్టరీ

ఇండియన్ హిస్టరీ

 మధ్యయుగ భారతదేశ చరిత్ర
 (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)
 తొలి మధ్యయుగం:
 హర్షుడి అనంతర యుగం నుంచి ఢిల్లీ సుల్తనత్ ఏర్పడే వరకు  ఉన్న  కాలాన్ని భారతదేశ చరిత్రలో తొలి మధ్యయుగంగా పిలుస్తారు. ఉత్తర భారతదేశ చరిత్రలో అప్పటి వరకు పాటలీపుత్రం అధికార కేంద్రంగా ఉండగా.. ఈ యుగంలో దాని స్థానాన్ని కనౌజ్ ఆక్రమించింది. అందుకే కనౌజ్‌ను  దక్కించుకునేందుకు మధ్యయుగంలోని మూడు ముఖ్యమైన రాజ్యాల మధ్య ఎడతెరపిలేని యుద్ధాలు జరిగాయి. అందుకే ఈ యుగాన్ని ఉత్తర భారత చరిత్రలో త్రిరాజ్య సంఘర్షణ యుగంగా పేర్కొంటారు. ఈ ఘర్షణల్లో పాల్గొన్న మూడు రాజవంశాలు... రాష్ర్టకూటులు, ఘార్జర ప్రతిహారులు, పాలరాజులు. ఈ కాలంలో ఉత్తర భారతదేశం పూర్తిగా రాజపుత్రుల ఆధీనంలో ఉంది. మూడు డజన్లకు పైగా రాజపుత్ర రాజ్యాలు ఈ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాయి. ఈ యుగంలో దక్కన్‌లో ప్రాబల్యంలో ఉన్న రాజులు రాష్ర్టకూటులు, వారి తర్వాత వచ్చిన కల్యాణి చాళుక్యులు. ఇక దక్షిణ భారతదేశంపై సార్వభౌమాధికారాన్ని స్థాపించిన ప్రముఖ రాజవంశం చోళులు. వీరు 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణదేశాన్ని పాలించారు. చోళుల తర్వాత వీరి రాజ్యాన్ని హోయసాలులు, పాండ్యులు ఆక్రమించుకున్నారు.
 
 ఉత్తర భార తదేశ రాజవంశాలు
 తొలి మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని దాదాపు 36 రాజ వంశాలు పరిపాలించాయి. వీటిలో నాలుగు రాజవంశాలు తమను తాము అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాయి. అవి ప్రతీహారులు, చాళుక్యులు లేదా సోలంకీలు, పరమారులు లేదా పవార్‌లు, చౌహాన్ లు.
 ప్రతీహారులు: వీరు ఘార్జర అనే తెగకు చెందినవారు. ఇది మధ్యాసియాకు చెందిన తెగ. హూణులతోపాటుగా వీరు భారత్‌కు వచ్చారు.
 మొదటి నాగభటుడు: భారతదేశంలో పలు ప్రతీహార రాజ్యాలున్నాయి. వాటిలో తొలి ప్రతీహార రాజ్యస్థాపకుడు హరిశ్చంద్రుడు. అయితే భారత్‌లోని ప్రతీహార రాజ్యాలన్నింటిలోకి అతి ముఖ్యమైంది... నాగభటుడు స్థాపించిన ప్రతీహార రాజ్యమే. ఇది 8వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఏర్పడింది. నాగభటుడు పశ్చిమ భారతదేశంపై జరిగిన అరబ్బుల దాడిని తిప్పి కొట్టాడు.
 
 వత్సరాజు: మొదటి నాగభటుడి అనంతరం కాకుత్స, దేవరాజ అనే రాజులు పాలించారు. వారి తర్వాత వత్సరాజు రాజ్యానికి వచ్చాడు. ఇతడు నాగభటుడి మనుమడు. వత్సరాజు... పాలరాజు ధర్మపాలుడిని ఓడించాడు. కానీ రాష్ర్టకూట ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వా మొదలైన ప్రాంతాలను కోల్పోయాడు.
 
 రెండో నాగభటుడు: ఇతడు కనౌజ్‌ను పాలించే చక్రాయుధుడిని ఓడించి తన రాజధానిని బిన్‌మల్ నుంచి కనౌజ్‌కు మార్చాడు. మాంఘీర్ యుద్ధంలో ధర్మపాలుడిని ఓడించాడు. కానీ ఇతడు రాష్ర్టకూట రాజు 3వ గోవిందుని చేతిలో ఓడిపోయాడు.
 
 మిహిర భోజ: రెండో నాగభటుడి అనంతరం రామభద్రుడి స్వల్పకాల పాలన తర్వాత మిహిరభోజుడు రాజయ్యాడు. ఇతడు ప్రతీహార వంశంలో అందరి కంటే గొప్పవాడు. అటు పాల రాజులను, ఇటు రాష్ర్టకూటులను ఓడించి విశాలమైన సామ్రాజ్యాన్ని మిహిర భోజుడు నిర్మించాడు. క్రీ.శ. 851లో సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు ఇతడి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు. మిహిర భోజుడు మహ్మదీయుల బద్ధశత్రువు అని సులేమాన్ పేర్కొన్నాడు.
 
 మహేంద్రపాల: ఇతడి కాలంలో ప్రతీహార రాజ్యం హిమాలయాల నుంచి వింధ్య వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. మహేంద్రపాల ఆస్థానంలో ఉన్న గొప్ప సంస్కృత కవి రాజశేఖరుడు. ఇతడు కర్పూర మంజరి, బాల రామాయణం, బాల భారతం, కావ్య మీమాంస, భువనకోశ, హరవిలాస వంటి గ్రంథాలను రచించాడు.
 
 మహీపాల: మహేంద్రపాలుడి అనంతరం రెండో భోజుడు కొంతకాలం పాటు రాజ్యాన్ని పాలించాడు. అతడి అనంతరం మహీపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాష్ర్టకూట రాజు మూడో ఇంద్రుడి దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. మహీపాలుడి కాలంలో క్రీ.శ. 915-916 మధ్య అరబ్ యాత్రికుడు అల్‌మసూది ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు.
 
 మహీపాలుడి అనంతరం ఈ రాజ్యం బలహీనమైంది. పలు సామంత రాజ్యాలు స్వతం త్రం ప్రకటించుకున్నాయి. మహీపాలుడి అనంతరం రెండో మహేంద్రపాల, దేవపాల, విజయపాల, రాజ్యపాల మొదలైనవారు పాలించారు. ఈ వంశంలో చివరి రాజు.. యశపాలుడు.
 
 పరమారులు: ధార రాజధానిగా మాళ్వా ప్రాంతాన్ని పాలించిన రాజపుత్ర వంశమే పరమార లేదా పవార్ వంశం. ఉపేంద్ర ఈ వంశ స్థాపకుడు. వీరు మొదట ప్రతీహారులకు, రాష్ర్టకూటులకు సామంతులుగా ఉండేవారు.
 రెండో సియాకుడు: ఇతడు స్వతంత్ర పరమార రాజ్య స్థాపకుడు. రాష్ర్టకూట రాజు మూడో కృష్ణుడి అనంతరం ఇతడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
 
 వాక్పతి ముంజరాజు: ఇతడు కాలచూరి రాజులను, కల్యాణి చాళుక్యులను ఓడించాడు. చాళుక్య రాజు రెండో తైలపుడు ఆరుసార్లు మాళ్వాపై దాడులు చేశాడు. చివరికి ఈ దాడుల్లోనే ముంజరాజు మరణించాడు. రాజధాని ధారలో ఇతడు తన పేరుతో ముంజసాగర అనే చెరువును నిర్మించాడు. తన రాజ్యంలో అనేక దేవాలయాలు నిర్మించాడు. సాహిత్యాన్ని, కళలను పోషించాడు. ముంజరాజు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో పలువురు కవులుండేవారు. వారిలో ముఖ్యమైనవారు పద్మగుప్త, ధనిక, ధనుంజయ.
 
 భోజ: పరమార రాజులందరిలో అత్యంత గొప్పవాడు. ఇతడు గొప్ప సైనికుడే కాక సా హిత్య ప్రియుడు కూడా. స్వయంగా వివిధ అంశాలపై 24 గ్రంథాలను రచించాడు. అనేక మంది కవులను పోషించాడు. పలు వాస్తు శిల్ప నిర్మాణాలు చేపట్టాడు. భోజుడు రాసిన గ్రంథాలు సమరాంగన సూత్రధార, ఆయుర్వేద సర్వస్వ, యుక్తి కల్పతరు, తత్త్వ ప్రకాశ మొదలైనవి. ఇతడు భోజపుర అనే నూతన నగరాన్ని కూడా నిర్మించాడు. తన రాజధాని ధారలో భోజశాల అనే పేరుతో ఒక కళాశాలను నిర్మించాడు.
 
 భోజుడి తర్వాత పరమార రాజ్య వైభోగం క్షీణించింది. అతడి తర్వాత పాలించిన రాజుల్లో ము ఖ్యమైన వారు జయసింహ, ఉదయాదిత్య. లక్ష్మదేవ, నరవర్మ మొదలైనవారు. ఈ వంశ ంలో చివరి రాజు మహాలకదేవ. ఇతడి తర్వాత ఈ రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ జయిం చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement