ఇంటర్‌డిసిప్లినరీ.. అవకాశాల సమ్మిళితం | Interdisciplinary opportunities blended with | Sakshi
Sakshi News home page

ఇంటర్‌డిసిప్లినరీ.. అవకాశాల సమ్మిళితం

Published Thu, Jul 31 2014 3:10 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంటర్‌డిసిప్లినరీ.. అవకాశాల సమ్మిళితం - Sakshi

ఇంటర్‌డిసిప్లినరీ.. అవకాశాల సమ్మిళితం

 సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్సులను సమ్మిళితం చేసి.. ఒకే కోర్సుగా రూపొందించే విధానాన్ని ఇంటర్‌డిసిప్లినరీగా వ్యవహరిస్తారు. మరొవిధంగా చెప్పాలంటే విభిన్న బ్రాంచ్‌ల సబ్జెక్ట్‌లను ఒకే పరిధిలోకి చేర్చి ప్రత్యేకంగా ఒక కోర్సుగా బోధించడాన్ని ఇంటర్‌డిసిప్లినరీ స్టడీస్‌గా వ్యవహరిస్తారు. ఈ కోర్సులు ఒకే రంగానికి చెందినవి కావచ్చు లేదా భిన్న రంగాల కలయికగా కూడా ఉండొచ్చు. ప్రస్తుత సాంకేతిక యుగంలో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా అవసరమైన నిపుణులను తయారు చేసే ఉద్దేశంతో.. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఈ ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టారు.
 
 ఇంజనీరింగ్‌లో:
 ఇంజనీరింగ్‌లో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెటడ్టం వెనక ఉన్న ఉద్దేశం.. ఏదైనా ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను తీసుకుంటే.. అందులోని సమాచారం సదరు బ్రాంచ్‌కు మాత్రమే పరిమితమై ఉంటుంది. దాంతో వేరే రంగానికి చెందిన సమాచారం లభించదు. ఉదాహరణకు ఒక ఇంజనీర్ ఏదైనా మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేయాలంటే.. అతనికి అనాటమీ, ఫిజియాలజీ, బయాలజీ వంటి మెడికల్ సబ్జెక్ట్‌లపై అవగాహన ఉండాలి. కానీ ఇంజనీరింగ్ సిలబస్‌లో అటువంటి అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టారు.
 
 క్రమంగా ఆదరణ :
 ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్ అవకాశాలను అందుకోవడమే కాకుండా ఆర్థిక, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ కోర్సులు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులను బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో అందిస్తున్నారు. ఐఐటీలు, నిట్‌లు రెండు మూడు బ్రాంచ్‌ల కలయికతో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులను బీటెక్, ఎంటెక్ స్థాయిలో బోధిస్తున్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు హ్యూమానిటీస్, టెక్నికల్ అంశాల కలయికతో ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో ఇంజనీరింగ్‌కు సంబంధించి పునాదులుగా భావించే మ్యాథ్స్, కెమిస్ట్రీ, మెకానిక్స్ సబ్జెక్ట్‌లతోపాటు లిబరల్ ఆర్ట్స్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. కొందరు ఆసక్తితో ఈ కోర్సులను ఎంచుకుంటే మరికొందరు భిన్నంగా వెళ్లాలనే ఉద్దేశంతో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సుల వైపు చూస్తున్నారు.
 
 అవకాశాలు.. మెరుగు:
 సంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో పోల్చితే ఇంటర్‌డిసిప్లినరీ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంటర్‌డిసిప్లినరీ కోర్సుల్లో భిన్న నేపథ్యాలకు చెందిన అంశాలను బోధిస్తారు. తద్వారా ఆయా రంగాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. దాంతో కేవలం ఒకే రంగంలో కాకుండా బహుళ రంగాల్లోని అవకాశాలను (మల్టిపుల్ కెరీర్స్) దక్కించుకోవచ్చు. అంతేకాకుండా ఇంజనీరింగ్‌లో ఎంతో కీలకమైన ప్రాజెక్ట్‌వర్క్‌ను భిన్న దృకోణాల్లో చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా సబ్జెక్ట్ పరంగా చక్కటి జ్ఞానం అలవడుతుంది. ఈ కోర్సులు చదివిన విద్యార్థులు భిన్న రకాల ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి రిక్రూటర్లు కూడా ఇంటర్‌డిసిప్లినరీ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
 
 కొన్ని ఇంటర్‌డిసిప్లినరీ బ్రాంచ్‌లు
 మెకట్రానిక్స్:మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కలయికతో రూపొందిన బ్రాంచే మెకట్రానిక్స్. దీనికి చక్కటి ఉదాహరణ మనం నిత్యం వినియోగించే వాషింగ్ మెషీన్. వాస్తవానికి ఇది ఎలక్ట్రానిక్ ఉత్పత్తిగా భావిస్తాం. కానీ ఇందులో మెకానికల్ డ్రమ్ దానికి అనుసంధానంగా ఉండే టైమర్‌లు మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సమ్మిళితం. మెకట్రానిక్స్ కోర్సులో భాగంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌‌స, అడ్వాన్‌‌సడ్ మెకానికల్ సబ్జెక్ట్స్ (అడ్వాన్‌‌సడ్ రోబోటిక్స్, అడ్వాన్‌‌సడ్ సీఎన్‌సీ మెషీన్‌‌స, అడ్వాన్‌‌సడ్ న్యుమాటిక్ హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్) వంటివి ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏరోస్పేస్, ఆటోమోటివ్, రోబోటిక్స్, డిఫెన్స్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో.. టెక్నీషియన్స్, టెస్ట్ ఇంజనీర్స్, అనలిస్ట్, రీసెర్చర్‌గా స్థిరపడొచ్చు. ఉన్నత విద్యా పరంగా బీటెక్ తర్వాత ఎంటెక్ (మెకట్రానిక్స్) కోర్సులో చేరొచ్చు.
 
 బయోఇన్ఫర్మాటిక్స్:
 మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికతో రూపుదిద్దుకున్న కోర్సు బయోఇన్ఫర్మాటిక్స్. బయోటెక్నాలజీ పరిశోధనలకు సంబంధించి సమాచార సేక రణ, నిక్షిప్తం, నిర్వహించడం, విశ్లేషించడం వంటి విధుల కోసం బయోఇన్ఫర్మాటిక్స్ అవసరమవుతుంది. ఈ క్రమంలో స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ అనువర్తనాలను ఉపయోగిస్తారు. ఈ కోర్సును పూర్తిచేసిన వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, హెల్త్‌కేర్, బయో మెడికల్ పరిశ్రమలు, పరిశోధనాశాలల్లో అవకాశాలు ఉంటాయి. బీటెక్ తర్వాత ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్)తోపాటు పలు స్పెషలైజేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
 ఏరో స్పేస్ ఇంజనీరింగ్:
 ఇది బేసిక్ ఇంజనీరింగ్ సూత్రాలు, ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, గ్రౌండ్ కంట్రోల్ అంశాల కలయికగా ఉంటుంది. విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్,డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు.
 
  ఉన్నత విద్య విషయానికొస్తే.. బీఈ/బీటెక్ తర్వాత ఆయా స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేయవచ్చు. పీజీలో ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఏరో థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, వంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ దశాలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ-అంతర్జాతీయ సంస్థల్ల్లో అవకాశాలు ఉంటాయి.
 
 పెట్రోలియం ఇంజనీరింగ్:
 సహజ వాయువు-చమురు వెలికితీయడానికి అవసరమైన డ్రిల్లింగ్ పద్ధతుల్లో బేసిక్ ఇంజనీరింగ్ సూత్రాలను అన్వయించడమే పెట్రోలియం ఇంజనీరింగ్. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లపై పట్టు ఉండాలి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై అవగాహన, ఆసక్తి అవసరం. బీటెక్ తర్వాత ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్), ఎంటెక్ (గ్యాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), ఎంటెక్ (పైప్ లైన్ ఇంజనీరింగ్), ఎంబీఎ (పెట్రోలియం ఇంజనీరింగ్, గ్యాస్ మేనేజ్‌మెంట్) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సును పూర్తిచేసిన తర్వాత ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు.
 
 నానోటెక్నాలజీ :
 నానోటెక్నాలజీ ఒక వినూత్నమైన బ్రాంచ్. అణువులు, పరమాణువులు వంటి సూక్ష్మ పదార్థాలను లెక్కించడానికి ఉపయోగించే ప్రమాణం నానోమీటర్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు/మెకానికల్ పరికరాలను సూక్ష్మ స్థాయిలో రూపొందించడం నానోటెక్నాలజీలోని ప్రధాన అంశం. ఇందులో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. దీని అనువర్తనాలను సైన్స్, ఇంజనీరింగ్‌లోని ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తారు. వస్త్ర పరిశ్రమ నుంచి ఔషధ పరిశ్రమ వరకు ప్రతి విభాగంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా మారుతోంది. దాంతో విస్తృత అవకాశాలకు ఈ కోర్సు వేదికగా నిలుస్తోంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లలో పట్టున్న వారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. బ్యాచిలర్ తర్వాత ఎంటెక్ (నానోటెక్నాలజీ) కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, ప్రొడక్ట్ టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
 
 అగ్రికల్చరల్ ఇంజనీరింగ్:
 ఆహార ఉత్పత్తులకు సంబంధించిన శాస్త్ర, సాంకేతిక అంశాలను అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అధ్యయనం చేస్తుంది.  ఇంజనీరింగ్ సూత్రాలు, వ్యవసాయ అంశాల కయికగా రూపొందిన కోర్సు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. యానిమల్ బయాలజీ, ప్లాంట్ బయాలజీ వంటి అంశాలను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్ సూత్రాలతో సమ్మిళితం చేసి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. వ్యవసాయ పరికరాల డిజైన్, వ్యవసాయ వనరుల నిర్వహణ, సర్వేయింగ్, వాతావరణ అధ్యయనం వంటి కార్యకలాపాలు ఇందులో ఉంటాయి. బీటెక్ తర్వాత ఫార్మ్ మెషినరీ, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, డెయిరీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, అప్లయిడ్ బోటనీ అండ్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్/ఎంఎస్ చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్,  ఫార్మాస్యూటికల్ కంపెనీలు,  హెల్త్ కేర్ ఫార్మ్స్ వంటి రంగాల్లో స్థిరపడొచ్చు.
 
 బయలాజికల్ ఇంజనీరింగ్:
 బయాలజీ, మెడిసిన్ రంగాలకు చెందిన అంశాలను ఇంజనీరింగ్ సూత్రాలతో సమ్మిళితం చేసి రూపొందించిన కోర్సు బయలాజికల్ ఇంజనీరింగ్. ఇందులో బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో కెమికల్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి ఇంటర్‌డిసిప్లినరీ బ్రాంచ్‌లు ఉంటా యి. ఇంజనీరింగ్ సూత్రాలు, టెక్నిక్స్‌ను మెడికల్ విభాగానికి అనువర్తింపచేసి, సమస్యలను పరిష్కరించేదే బయోమెడికల్ ఇంజనీరింగ్. జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోప్రాసెస్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, కెమికల్, యాక్షన్ ఇంజనీరింగ్ వంటివి ఇందులోని కోర్ సబ్జెక్ట్‌లు. జెనెటిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ సూత్రాలను అన్వయించడం జెనెటిక్ ఇంజనీరింగ్. బయోకెమికల్ ఇంజనీరింగ్‌లో కెమికల్ ఇంజనీరింగ్, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అంశాల కలయికగా ఉంటుంది.ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఇంజనీరింగ్ వంటి మరెన్నో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయి.
 
 ఐఐటీల్లో: కొన్ని ఐఐటీల్లో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులు..
 ఐఐటీ-ఢిల్లీ, ఎంటెక్ టెలికామ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఎంటెక్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ ఆప్టో కమ్యూనికేషన్స్, ఎంటెక్ (వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, టూల్ అండ్ టెక్నాలజీ) ఐఐటీ-ఖరగ్‌పూర్, బీటెక్ (ఆనర్స్) ఇన్ కోర్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ (ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), బీటెక్ (ఆనర్స్) ఇన్ కోర్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ (ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)
 ఐఐటీ-మద్రాస్ ఎంటెక్ (న్యూక్లియర్ ఇంజనీరింగ్, క్యాటాలిసిస్ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement