బ్యాచిలర్ పాపులర్! | Intermediate Special | Sakshi
Sakshi News home page

బ్యాచిలర్ పాపులర్!

Published Fri, May 13 2016 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

బ్యాచిలర్ పాపులర్!

బ్యాచిలర్ పాపులర్!

ఇంటర్మీడియట్ స్పెషల్
ఇంటర్మీడియెట్.. అకడమిక్ ప్రయాణంలో కీలక మైలురాయి. దీన్ని దాటిన తర్వాత ఎంపిక చేసుకునే కోర్సుపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ముఖ్యమైన దశలో ఉన్నత విద్య, ఉపాధి కోణంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుబాటులో ఉన్న
అవకాశాలను విశ్లేషించుకొని కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో దేశంలో ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న పాపులర్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులపై ఫోకస్..


బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)
ఉత్తమ కెరీర్ అవకాశాలకు బీటెక్ మంచి మార్గం. అందుకే ఎక్కువ మంది ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలపై ఉత్సాహం ఉన్నవారికి ఈ కోర్సు సరైంది. దీన్ని పూర్తిచేశాక వృత్తి జీవితంలో ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు), ట్రిపుల్‌ఐటీలు, బిట్స్-పిలానీ వంటివి ఇంజనీరింగ్ విద్యకు ప్రముఖ సంస్థలు. ఇంటర్ ఎంపీసీ/10+2 అర్హతతో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు.

ఎంబీబీఎస్, బీడీఎస్
ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శాస్త్రీయ దృక్పథం, ప్రజాసేవపై ఆసక్తి, ఒత్తిడిని ఎదుర్కొనే తత్వం ఉన్నవారికి ఈ కోర్సులు సరైనవి. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఢిల్లీ), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్-వెల్లూర్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణె, మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ (ఢిల్లీ), జిప్‌మర్ - పుదుచ్చేరి ప్రముఖమైనవి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ద్వారా అడ్మిషన్ పొందొచ్చు! అయితే ఈసారి నీట్ ర్యాంకుతో ప్రవేశాలు జరిగే అవకాశముంది!

బ్యాచిలర్ ఆఫ్ లా
కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, పెరుగుతున్న కేసులు, చట్టాల్లో క్లిష్టత కారణంగా ప్రస్తుతం న్యాయ సేవలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసి, సంబంధిత వృత్తినైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సహనం, లాజికల్‌గా ఆలోచించగల నైపుణ్యాలు ఉన్నవారికి లా బెస్ట్ కెరీర్ చాయిస్! ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ద్వారా దేశంలోని 17 ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీల్లో అడ్మిషన్ పొందొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ-ఫ్యాకల్టీ ఆఫ్ లా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (బెంగళూరు), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్)  అందించే లా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది.

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్
ప్రస్తుతం విద్యార్థుల్లో ఫ్యాషన్ డిజైన్ గ్లామరస్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటే ఈ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రముఖమైనవి. బ్యాచిలర్ స్థాయిలో ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
సామాజికంగా ప్రజలను మేల్కొలిపే ఉన్నత వృత్తిగా జర్నలిజం నిలుస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వారికి జర్నలిజం కోర్సులు సరైనవి. యాంకరింగ్, జర్నలిజం, ఆర్‌జే, ఫొటో జర్నలిజం.. తదితర విభాగాల్లో కోర్సులు పూర్తిచేయొచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ) కోర్సులను పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఢిల్లీ),  బెంగళూరు యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటివాటితోపాటు రాష్ట్రస్థాయిలోని పలు వర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో చేరొచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్
దేశంలో ఆతిథ్య పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ఐహెచ్‌ఎం-ఢిల్లీ, ఐహెచ్‌ఎం-ముంబై, ఐహెచ్‌ఎం-కోల్‌కతా, ఐహెచ్‌ఎం-చెన్నై, ఐహెచ్‌ఎం హైదరాబాద్ తదితర కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఇన్‌స్టిట్యూట్స్ అందించే బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు మంచి ఆదరణ ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీహెచ్‌ఎం) జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
 మ్యాథమెటికల్, అనలిటికల్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)ను ఎంపిక చేసుకోవచ్చు. బీకాం (ఆనర్స్), బీకాం (కంప్యూటర్స్), బీకాం (ఈ-కామర్‌‌స)లకు కూడా విద్యార్థుల్లో ఆదరణ ఉంది. బీకామ్ కోర్సుతోపాటు సీఏ/సీఎస్/సీఎంఏ చేసినవారు కెరీర్‌పరంగా ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. బీకామ్ తర్వాత మాస్టర్ ఆఫ్ కామర్‌‌స (ఎంకామ్) కూడా చేయొచ్చు. ఎంకామ్‌లో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఈ-కామర్‌‌స వంటి కోర్సులను దేశంలో వివిధ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారు ఆర్థిక సేవల సంస్థలు, బ్యాంక్‌లు, కార్పొరేట్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు.

ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో ఇంజనీరింగ్ ముందుంది. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్‌డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే      భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు         అధిరోహించొచ్చు.

ప్రొఫెసర్
ఎస్.రామచంద్రం,
ప్రిన్సిపాల్,
ఓయూసీఈ.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement