intermediate special
-
బ్యాచిలర్ పాపులర్!
ఇంటర్మీడియట్ స్పెషల్ ఇంటర్మీడియెట్.. అకడమిక్ ప్రయాణంలో కీలక మైలురాయి. దీన్ని దాటిన తర్వాత ఎంపిక చేసుకునే కోర్సుపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ముఖ్యమైన దశలో ఉన్నత విద్య, ఉపాధి కోణంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుబాటులో ఉన్న అవకాశాలను విశ్లేషించుకొని కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో దేశంలో ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న పాపులర్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులపై ఫోకస్.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) ఉత్తమ కెరీర్ అవకాశాలకు బీటెక్ మంచి మార్గం. అందుకే ఎక్కువ మంది ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలపై ఉత్సాహం ఉన్నవారికి ఈ కోర్సు సరైంది. దీన్ని పూర్తిచేశాక వృత్తి జీవితంలో ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ట్రిపుల్‌ఐటీలు, బిట్స్-పిలానీ వంటివి ఇంజనీరింగ్ విద్యకు ప్రముఖ సంస్థలు. ఇంటర్ ఎంపీసీ/10+2 అర్హతతో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, బిట్‌శాట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శాస్త్రీయ దృక్పథం, ప్రజాసేవపై ఆసక్తి, ఒత్తిడిని ఎదుర్కొనే తత్వం ఉన్నవారికి ఈ కోర్సులు సరైనవి. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఢిల్లీ), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్-వెల్లూర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణె, మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ (ఢిల్లీ), జిప్మర్ - పుదుచ్చేరి ప్రముఖమైనవి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ద్వారా అడ్మిషన్ పొందొచ్చు! అయితే ఈసారి నీట్ ర్యాంకుతో ప్రవేశాలు జరిగే అవకాశముంది! బ్యాచిలర్ ఆఫ్ లా కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, పెరుగుతున్న కేసులు, చట్టాల్లో క్లిష్టత కారణంగా ప్రస్తుతం న్యాయ సేవలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసి, సంబంధిత వృత్తినైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సహనం, లాజికల్‌గా ఆలోచించగల నైపుణ్యాలు ఉన్నవారికి లా బెస్ట్ కెరీర్ చాయిస్! ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ద్వారా దేశంలోని 17 ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీల్లో అడ్మిషన్ పొందొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ-ఫ్యాకల్టీ ఆఫ్ లా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (బెంగళూరు), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్) అందించే లా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రస్తుతం విద్యార్థుల్లో ఫ్యాషన్ డిజైన్ గ్లామరస్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటే ఈ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రముఖమైనవి. బ్యాచిలర్ స్థాయిలో ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సామాజికంగా ప్రజలను మేల్కొలిపే ఉన్నత వృత్తిగా జర్నలిజం నిలుస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వారికి జర్నలిజం కోర్సులు సరైనవి. యాంకరింగ్, జర్నలిజం, ఆర్జే, ఫొటో జర్నలిజం.. తదితర విభాగాల్లో కోర్సులు పూర్తిచేయొచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ) కోర్సులను పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఢిల్లీ), బెంగళూరు యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటివాటితోపాటు రాష్ట్రస్థాయిలోని పలు వర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో చేరొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దేశంలో ఆతిథ్య పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ఐహెచ్ఎం-ఢిల్లీ, ఐహెచ్ఎం-ముంబై, ఐహెచ్ఎం-కోల్‌కతా, ఐహెచ్ఎం-చెన్నై, ఐహెచ్ఎం హైదరాబాద్ తదితర కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఇన్స్టిట్యూట్స్ అందించే బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు మంచి ఆదరణ ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మ్యాథమెటికల్, అనలిటికల్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)ను ఎంపిక చేసుకోవచ్చు. బీకాం (ఆనర్స్), బీకాం (కంప్యూటర్స్), బీకాం (ఈ-కామర్స)లకు కూడా విద్యార్థుల్లో ఆదరణ ఉంది. బీకామ్ కోర్సుతోపాటు సీఏ/సీఎస్/సీఎంఏ చేసినవారు కెరీర్‌పరంగా ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. బీకామ్ తర్వాత మాస్టర్ ఆఫ్ కామర్స (ఎంకామ్) కూడా చేయొచ్చు. ఎంకామ్‌లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ-కామర్స వంటి కోర్సులను దేశంలో వివిధ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారు ఆర్థిక సేవల సంస్థలు, బ్యాంక్‌లు, కార్పొరేట్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో ఇంజనీరింగ్ ముందుంది. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ప్రిన్సిపాల్, ఓయూసీఈ. -
ఇంటర్‌తో సీఏ
ఇంటర్మీడియట్ స్పెషల్ కోర్సు: చార్టర్డ్ అకౌంటెన్సీ అర్హత: ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వెంటనే సీపీటీ ద్వారా కోర్సులో ప్రవేశించొచ్చు. ఒకవైపు బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ.. సీపీటీ, ఐపీసీసీలను పూర్తి చేయొచ్చు. చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సులో అడుగుపెట్టిన విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ మూడేళ్లు, తర్వాత రెండేళ్లు మొత్తం ఐదేళ్లలో కోర్సు పూర్తి చేసుకోవచ్చు. కోర్సు స్వరూపం ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ (ఐపీసీసీ), ఫైనల్ మొత్తం మూడు దశలుగా ఉండే కోర్సు సీఏ. రెండు గ్రూప్‌లుగా ఉండే ఐపీసీసీ దశలో ఉత్తీర్ణులైతే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఐపీసీసీ, ఫైనల్ ఎగ్జామ్స్ మధ్యలో మూడేళ్ల ఆర్టికల్‌షిప్ తప్పనిసరి. ఆర్టికల్‌షిప్ చేసినట్లు ధ్రువీకరణ సర్టిఫికెట్ చూపితేనే ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు అర్హత కల్పిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. ఎవరికి అనుకూలం కంప్యూటేషన్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు, అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణలో ఆసక్తి, మారుతున్న చట్టాలపై నిరంతర అవగాహన ఏర్పరచుకునే నేర్పు ఉన్న వారికి సీఏ కోర్సు అనుకూలంగా ఉంటుంది. డొమైన్ స్కిల్స్ అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణ (అకౌంటింగ్, ఆడిటింగ్, ట్యాక్సేషన్)లో నైపుణ్యాలు ఉండాలి. వ్యాపార నిర్వహణ పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో స్కిల్స్ పెంపొందించుకోవాలి. ఉపాధి అవకాశాలు.. సీఏలకు వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. స్వయం ఉపాధి పొందొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్వర్క్ ఉంటే కెరీర్లో వేగంగా రాణించవచ్చు. సీఏ సానుకూలతలు, ప్రతికూలతలు అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో అపారమైన నైపుణ్యాలు రెగ్యులర్ అప్డేట్స్ అందించే విధంగా మారుతున్న కరిక్యులం ఇంటర్మీడియెట్ నుంచే కోర్సు అభ్యసించే అవకాశం. కేవలం ఒక విభాగానికే పరిమితమయ్యే విధంగా కరిక్యులం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోణంలో ప్రధాన సమస్యగా మారుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంబీఏ ఫైనాన్స్ విద్యార్థులకు.. సీఏల నుంచి పోటీ ఉందనే మాటల్లో వాస్తవం కొంత మాత్రమే. అకౌంటింగ్లో సీఏలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంబీఏ విద్యార్థులకు సంస్థల్లో ఆర్థిక విభాగాల్లో అవకాశాలున్నాయి. సీఏలో నిరంతరం కరిక్యులం అప్డేట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. - కె. రామచంద్రారెడ్డి, చైర్మన్, ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ -
భవితకు దిక్సూచి
ఇంటర్మీడియట్ స్పెషల్ బైపీసీ.. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూప్‌తో ఉన్నటువంటి ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు మరే గ్రూపునకు లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బైపీసీతో ఉన్న ఉన్నత విద్య అవకాశాలేమిటో తెలుసుకుందాం.. ఎంసెట్‌తో.. ఇంటర్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బైపీసీ) చదివినవారు మన రాష్ర్టంలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ రాయొచ్చు. ఈ ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్చికల్చర్), బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ (బయోటెక్నాలజీ) చేయొచ్చు. బీఎస్సీతో కెరీర్ షైనింగ్ ఇంటర్ పూర్తయ్యాక బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకొని డిగ్రీ పూర్తిచేయొచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. తర్వాత ఆసక్తి ఉన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చు. తర్వాత సీఎస్ఐఆర్ నిర్వహించే నెట్ రాయొచ్చు. మంచి మార్కులు సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు/విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేయొచ్చు. జేఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ. 25,000 తర్వాత మూడేళ్లు నెలకు రూ. 28,000 పొందొచ్చు. పీహెచ్‌డీతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. పీజీ వద్దనుకుంటే సివిల్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఉపాధికి పారామెడికల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ, రేడియోథెరపీ, పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ, డెంటల్ టెక్నీషియన్, మైక్రో సర్జరీ, అనస్థీషియా, క్యాత్‌ల్యాబ్, ఈసీజీ, కార్డియాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో వేతనం నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఫిజియోథెరపి.. వ్యాయామ పరికరాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు ఇస్తారు. నర్సింగ్.. మన దేశంతోపాటు అమెరికా, పశ్చిమ ఆసియాల్లోనూ అపార ఉద్యోగ అవకాశాలను అందిస్తున్న కోర్సు. భారత్‌లో 2016 నాటికి 24 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అంచనా. -
కెరీర్ ప్లానింగ్ ఇలా..
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. తర్వాత ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి? ఆ కోర్సులతో భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్నాయి. వీటికి సమాధానం.. కెరీర్ ప్లానింగ్.. సరైన ప్లానింగ్‌తో అడుగులు వేస్తే ఏ కోర్సయినా.. ఏ రంగమైనా.. ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో కెరీర్ ప్లానింగ్ విషయంలో నిపుణులు అందిస్తున్న సలహాలు.. ఆసక్తే ప్రధానం: విద్యార్థులు వ్యక్తిగత ఆసక్తికి అనుగుణంగా కోర్సుల వివరాలు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి పజిల్స్, సుడోకు వంటివాటిపై ఆసక్తి ఉంటే మ్యాథమెటిక్స్, సైన్స్ విభాగాల్లో రాణించగలరు. జనరల్ నాలెడ్జ్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు కలిసొస్తాయి. యాటిట్యూడ్.. ఆప్టిట్యూడ్: విద్యార్థికి వ్యక్తిగతంగా ఉన్న లక్ష్యాలు, వాటిని అందుకునే దిశగా వారి దృక్పథాన్ని పరిశీలించాలి. విద్యార్థులు పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా వారి దృక్పథం ఉందా? లేదా? అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అత్యున్నత అవకాశాలు: ఆయా కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవాలి. ఇటీవల మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. ఇలాంటి అప్‌కమింగ్ కోర్సులు, కెరీర్‌స విషయంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, జాబ్ ట్రెండ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి బేరీజు వేసుకుని ఆచితూచి అడుగులు వేయాలన్నది నిపుణుల సలహా. కోర్స్ వర్సెస్ కాలేజ్: కెరీర్ ప్లానింగ్‌లో ముఖ్య దశ... తమకు ఆసక్తి ఉన్న కోర్సుకా?లేదా కాలేజ్‌కు ప్రాధాన్యమివ్వాలా? అనే అంశంపై స్పష్టత. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలను లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు ఈ విషయంలో ఎంతో కసరత్తు చేయాలి. తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్/కోర్సుకు సంబంధించి ప్రతిష్టాత్మక కళాశాలలు, మంచి చరిత్ర ఉన్న కళాశాలలను గుర్తించాలి. కోర్స్ వర్సెస్ కాలేజ్ విషయంలో కోర్స్కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సూచన. లక్ష్య సాధన దిశగా: ఏ కోర్సు విద్యార్థులకైనా తుది లక్ష్యం చక్కటి జాబ్ సొంతం చేసుకోవడం. సుస్థిర కెరీర్‌కు మార్గం వేసుకోవడం. ఇంటర్మీడియెట్ తర్వాత పలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము లక్ష్యంగా చేసుకున్న కెరీర్స్.. వాటికి లభించే అవకాశాలు.. అందుకు అవసరమైన అర్హతలు తెలుసుకుని వాటిని మెరుగుపరచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలి.