స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం | ISRO successfully test-fires Scramjet Rocket Engine | Sakshi
Sakshi News home page

స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం

Published Thu, Sep 1 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం

స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం

బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు
 జైపూర్‌లో రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఆగస్టు 21న ముగిసింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధులు బ్రిక్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాలని అభిలషించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సదస్సు ముగింపులో ఆమోదించిన జైపూర్ డిక్లరేషన్.. ఆర్థిక వృద్ధి, సామాజిక సమ్మిళితం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాల పటిష్టతకు మహిళా పార్లమెంటేరియన్లు ప్రతినబూనాలని పేర్కొంది.
 
 సరోగసీ (నియంత్రణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 24న ఆమోదం తెలిపింది. పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దె గర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.  దీన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్నవారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు అర్హులు. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పెంచుకుంటున్నారు. దాంతో వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు.
 
 మయన్మార్‌లో పర్యటించిన సుష్మా స్వరాజ్
 మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 22న ఆ దేశంలో పర్యటించారు. భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని ఆ దేశం తెలిపింది. పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు యు హిటిన్ క్యా, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూకీతో సుష్మ సమావేశమయ్యారు.
 
 అంతర్జాతీయం
  2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లు
 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్‌బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్‌లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది.
 
 ఇటలీ భూకంపంలో 247 మంది మృతి
 ఇటలీలో పర్వత ప్రాంతాల్లో ఆగస్టు 24న భారీ భూకంపం సంభవించింది. ఇందులో 247 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.
 
 కొలంబియా ప్రభుత్వంతో ఫార్క్ శాంతి ఒప్పందం
 వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్‌ఏఆర్‌సీ-ఫార్క్)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడనుంది. దీనివల్ల ఇప్పటివరకు 2.6 లక్షల మంది మరణించగా, 68 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు.
 
 వార్తల్లో వ్యక్తులు

 ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్
 ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్ రెండోసారి ఆగస్టు 24న ఎంపికయ్యారు. కిమ్ తొలి విడత పదవీ కాలంలో దారిద్య్ర నిర్మూలన, వాతావరణ మార్పులకు సంబంధించి విశేష కృషి చేశారని అమెరికా ఆర్థికశాఖ మంత్రి జాకోబ్ జే లూ పేర్కొన్నారు.
 
 ఐక్యరాజ్యసమితి ప్రచారకర్తగా ఐశ్వర్య ధనుష్
 తమిళ సినీ నటుడు రజినీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం (యూఎన్-ఉమెన్) ప్రచారకర్తగా ఎంపికయ్యారు. భారత్‌లో సమానత్వం, మహిళా సాధికారత కోసం పనిచేసేందుకు ఆగస్టు 29న ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
 
 
 రచయిత్రి సచ్‌దేవ్‌కు సరస్వతీ సమ్మాన్ ప్రదానం
 ప్రముఖ డోగ్రీ రచయిత్రి పద్మా సచ్‌దేవ్‌కు ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ (2015)ను ఆగస్టు 29న ఢిల్లీలో ప్రదానం చేశారు. స్వీయ చరిత్ర చిత్‌ఛటేకు ఆమె ఈ పురస్కారాన్ని పొందారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ పురస్కారం కింద పద్మా సచ్‌దేవ్‌కు రూ.15 లక్షల నగదు, ప్రశంసపత్రాన్ని అందించారు. బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డులను అందిస్తోంది.
 
 క్రీడలు

 టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
 భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకుంది. సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఆర్.అశ్విన్ ఎంపికయ్యాడు.
 
 నికో రోస్‌బర్గ్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్
 ఫార్ములావన్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ తొలిసారి బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా, రికియార్డో రెండో స్థానం దక్కించుకున్నాడు.
 
 సానియా జోడీకి కనెక్టికట్ ఓపెన్ టైటిల్
 సానియా మీర్జా (భారత్), మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలిసి కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని న్యూ హవెన్‌లో ఆగస్టు 27న జరిగిన ఫైనల్లో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించారు.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
  స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్క్రామ్‌జెట్ రాకెట్ (ఏటీవీ) ఇంజన్ సామర్థ్యాన్ని ఆగస్టు 28న శ్రీహరికోట నుంచి విజయవంతంగా పరీక్షించింది. దీంతో వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి ప్రయాణించే స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
 
 కుష్టు వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్
 భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరె క్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బిహార్, గుజరాత్‌ల్లోని ఐదు జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 2013-14 లెక్కల ప్రకారం మన దేశంలో 1.27 లక్షల మంది లెప్రసీతో బాధపడుతున్నారు.
 
 లీకైన స్కార్పిన్ జలాంతర్గాముల రహస్య సమాచారం
 ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్  జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం లీకైంది. దీంతో దీనిపై దర్యాప్తు చేసి నివేదిక అందించాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆగస్టు 23న ఆదేశించారు.
 
 రాష్ట్రీయం
 ఏపీ, తెలంగాణల్లో ముగిసిన కృష్ణా పుష్కరాలు
 పన్నెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కృష్ణా పుష్కరాలు ఆగస్టు 23న ముగిశాయి. పుష్కరాల కోసం ఏపీ రూ.1200 కోట్లు, తెలంగాణ రూ.800 కోట్లు ఖర్చు చేశాయి.
 
 3 ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ
 గోదావరిపై మేడిగడ్డ (కరీంనగర్), ప్రాణహితపై తుమ్మిడిహెట్టి (ఆదిలాబాద్), పెన్‌గంగపై చనాఖ-కొరాట (ఆదిలాబాద్) బ్యారేజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆగస్టు 23న ముంబైలో సంతకాలు చేశారు.
 
 27 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర పటం
 ప్రతిపాదిత 17 కొత్త జిల్లాలతోపాటు మొత్తం 27 జిల్లాలతో కూడిన తెలంగాణ పటాన్ని రెవెన్యూ శాఖ ఆగస్టు 26న అందుబాటులోకి తెచ్చింది. 27 జిల్లాల వివరాలు: ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం (మంచిర్యాల), నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, జయశంకర్ (భూపాలపల్లి), మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం (భద్రాద్రి), రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, శంషాబాద్, హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి.
 
 ఆర్థికం
 ఆర్‌బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు ఖేల్ ప్రోత్సాహన్ 2016 పురస్కారం లభించింది. దీన్ని ఆగస్టు 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా స్వీకరించారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగానూ ఆర్‌బీఐకి ఈ అవార్డు లభించింది.
 
 వైఫల్యం చెందకూడని బ్యాంకులుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 26న వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా ప్రకటించింది. ఇలాంటి హోదా ఈ బ్యాంకులకు లభించడం ఇది వరుసగా రెండోసారి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థీకృతంగా చాలా ప్రాముఖ్యత కలిగినవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఆయా బ్యాంకుల పటిష్టతకు గట్టి నిఘా, పర్యవేక్షణలు ఉంటాయి.
 
 ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement