
వన్డేల్లో మిథాలీ రాజ్ రికార్డు
జాతీయం
జంతువధ నిషేధంపై స్టే కొనసాగింపు
జంతువధను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు జూలై 10న నిర్ణయం తీసుకుంది. ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు తదితరాలను మాంసం, మతావసరాల కోసం వధించడాన్ని లేదా విక్రయించడాన్ని కేంద్రం నిషేధించింది. అయితే కేంద్రం చర్యపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అనిశ్చితి కారణంగా ప్రజల జీవనాధారానికి ఇబ్బంది కలగరాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.
జూన్‌లో 0.90 శాతంగా నమోదైన టోకు ద్రవ్యోల్బణం
కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది.
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగావెంకయ్యనాయుడు
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి అధికార పక్ష అభ్యర్థిగా జూలై 18న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికవ్వడంతో ఆయన వద్ద ఉన్న సమాచార, ప్రసార శాఖను స్మృతి ఇరానీకి, పట్టణాభివృద్ధి శాఖను నరేంద్రసింగ్ తోమర్‌కు అప్పగించారు. కాగా, ఉప రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ కూడా జూలై 18నే నామినేషన్ దాఖలు చేశారు.
అంతర్జాతీయం
ఖతార్‌తో అమెరికా ఉగ్ర వ్యతిరేక ఒప్పందం
ఖతార్‌తో అమెరికా జూలై 11న ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపిస్తూ నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తాజా ఒప్పందం కుదుర్చుకుంది.
మానవ అక్రమ రవాణాలో ముందున్న చైనా
ప్రపంచంలో అత్యధికంగా మానవుల అక్రమ రవాణా చైనాలో జరుగుతోందని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో జూలై 10న వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలిపింది.
అంటార్కిటికాలో బద్ధలైన భారీ ఐస్‌బర్గ్
అంటార్కిటికాలో అత్యంత భారీ పరిమాణంలోని ఐస్‌బర్గ్ బద్ధలైంది. జూలై 10–13 మధ్య ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అంటార్కిటికాలో జరిగే మార్పులను పర్యవేక్షిస్తున్న స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ‘లార్సెన్ సి’ అనే మంచు పలక ప్రధాన విభాగం నుంచి విడిపోయింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్వీడన్ ఫస్ట్
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఫిన్‌లాండ్ ఉన్నాయి. కాగా 58.1 పాయింట్లతో భారత్.. నేపాల్, శ్రీలంక, భూటాన్, చైనాల కంటే దిగువన ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
తొలి సౌరశక్తి రైలు ప్రారంభం
సౌరశక్తిని ఉపయోగించుకొని నడిచే తొలి డీఈఎంయూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలును ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు జూలై 14న ప్రారంభించారు. ఈ రైలు బోగీల్లోని విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, సమాచార ప్రదర్శక వ్యవస్థలకు అవసరమైన విద్యుత్.. సౌరశక్తి ద్వారా అందుతుంది. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు.
కజకిస్థాన్‌లో యురేనియం బ్యాంక్
కజకిస్థాన్‌లోని ఒస్కెమెన్ నగరంలో యురేనియం బ్యాంకును ఏర్పాటుచేయాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) జూలై 10న నిర్ణయించింది. అణు రియాక్టర్లలో వాడే యురేనియంను సోవియట్ యూనియన్ కాలం నాటి కర్మాగారంలో భద్రపరచనున్నారు. ఈ బ్యాంకు నుంచి ఐఏఈఏ సభ్యదేశాలు మార్కెట్ ధరకు యురేనియంను పొందవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో తమ అణుకర్మాగారాలకు ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఆయా దేశాలకు ఇది ఉపయోగపడుతుందని ఐఏఈఏ పేర్కొంది.
గెలాక్సీల సమూహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల సమూహాన్ని గుర్తించారు. సుమారు 20 బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి ‘సరస్వతి’ అని నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ ఆస్ట్రోఫిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళాల్లో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదొకటని, 10 బిలియన్ ఏళ్లున్న ఈ సమూహం భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పేర్కొంది.
క్రీడలు
వన్డేల్లో మిథాలీ రాజ్ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా జూలై 12న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆమె ఈ రికార్డును సాధించింది. మిథాలీ 183 వన్డేల్లో 6,028 పరుగులు సాధించి.. 5,992 పరుగులతో చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.
బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన హామిల్టన్
ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్నాడు. సిల్వర్‌స్టోన్(బ్రిటన్) లో జూలై 16న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, వాల్టేరి బొట్టాస్ రెండో స్థానం సాధించాడు.
విక్టోరియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న హరీందర్
భారత స్క్వాష్ ఆటగాడు హరీందర్ పాల్ సంధు విక్టోరియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. మెల్‌బోర్న్‌లో జూలై 16న జరిగిన ఫైనల్లో రెక్స్ హెడ్రిక్(ఆస్ట్రేలియా)పై హరీందర్ గెలుపొందాడు.
8వ సారి వింబుల్డన్ నెగ్గిన ఫెదరర్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. లండన్‌లో జూలై 16న జరిగిన ఫైనల్లో మారిన్ సిలిక్ (క్రొయేషియా) ను ఓడించి ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలిచిన ఫెదరర్‌కు రూ 18.53 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. కాగా, ఫెదరర్‌కు కెరీర్‌లో ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల ఫెదరర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను గార్బిన్ ముగురుజా (స్పెయిన్) గెలుచుకోగా, మహిళల డబుల్స్ టైటిల్‌ను ఎకటేరినా మకరోవా–ఎలెనా వెస్నినా(రష్యా) జోడీ, పురుషుల డబుల్స్ టైటిల్‌ను లుకాజ్ కుబోట్–మర్సెలో మీలో జోడీ కైవసం చేసుకుంది.
వార్తల్లో వ్యక్తులు
యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా లిల్లీ సింగ్
భారత సంతతికి చెందిన లిల్లీ సింగ్.. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీలో జూలై 15న ‘యూత్ ఫర్ ఛేంజ్’ పేరుతో యూనిసెఫ్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జియావోబో మృతి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త లియు జియావోబో అనారోగ్యంతో జూలై 13న షెన్యాంగ్‌లో మరణించారు. చైనాలో అత్యంత ప్రముఖ రాజకీయ ఖైదీ అయిన జియావోబో.. ఆ దేశ రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు, మానవ హక్కుల కోసం పోరాడారు. ఆయనకు 2009లో 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2010లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
గణిత మేధావి మిర్జాఖానీ మృతి
గణితశాస్త్ర ప్రావీణ్యురాలు, ఇరాన్ సంతతికి చెందిన మరియమ్ మిర్జాఖానీ(40).. కేన్సర్‌తో బాధపడుతూ జూలై 14న అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు.
సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి మృతి
సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి (77) జూలై 15న ఢిల్లీలో మరణించారు. ఆయన తొలిసారి 1979లో, తర్వాత 1984, 1989లో సిక్కిం సీఎంగా ఎన్నికయ్యారు.