నవ పధం | National Council of Educational Research and Training | Sakshi
Sakshi News home page

నవ పధం

Published Mon, Jul 17 2017 5:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

నవ పధం

నవ పధం

దేశంలో ఉపాధ్యాయ విద్యకు సరికొత్త రూపు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.ఉపాధ్యాయ విద్యలో వినూత్న మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈర్‌టీ బిల్లు–2017ను రూపొందించింది. పాఠశాల స్థాయి నుంచి 12వ తరగతి వరకు.. ముఖ్యంగా బోధన పరంగా పలు కీలక మార్పులు తీసుకురానుంది. ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు సంబంధిత కోర్సుల్లో లక్షల సంఖ్యలో చేరుతున్నా.. బోధన వృత్తికి అవసరమైన నైపుణ్యాలు అధికశాతం మందిలో ఉండటంలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఎన్‌సీఈఆర్‌టీ బిల్లు–2017పై విశ్లేషణ..

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌.. సంక్షిప్తంగా ఎన్‌సీఈఆర్‌టీ. ప్రాథమిక విద్య నుంచి సీనియర్‌ సెకండరీ వరకు బోధన, కరిక్యులం, సిలబస్‌ రూపకల్పన దిశగా కార్యకలాపాలు నిర్వహించే సంస్థ. ఎన్‌సీఈఆర్‌టీ సలహా మేరకే కేంద్ర స్థాయిలో సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులుచేర్పులు జరుగుతాయి. రాష్ట్రాల స్థాయిలో ఎస్‌సీఈఆర్‌టీలకు సైతం మార్గనిర్దేశకాలను ఎన్‌సీఈఆర్‌టీ జారీ చేస్తుంది. దీన్ని మరింత పటిష్టం చేసేందుకు.. మరింత స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు హెచ్‌ఆర్‌డీ శాఖ ఉపక్రమించింది. ఆ క్రమంలోనే ఎన్‌సీఈఆర్‌టీ బిల్లు–2017కు శ్రీకారం చుట్టింది.

జాతీయ ప్రాధాన్య సంస్థగా
ఎన్‌సీఈఆర్‌టీ బిల్లులోని ముఖ్య ప్రతిపాదన.. ఎన్‌సీఈఆర్‌టీని జాతీయ ప్రాధాన్యం (ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌–ఐఎన్‌ఐ) గల సంస్థగా గుర్తించాలని నిర్ణయించడం. అంతేకాకుండా ఎన్‌సీఈఆర్‌టీకి అనుబంధంగా ఉన్న రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లకు కూడా ఈ హోదా ఇవ్వనున్నారు. ఫలితంగా ఈ సంస్థ పూర్తిస్థాయిలో స్వయం ప్రతిపత్తి పొందుతుంది. దాంతో ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధుల పరంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. తద్వారా ఎన్‌సీఈఆర్‌టీ విద్యారంగంలో నాణ్యమైన పరిశోధనలు, శిక్షణ దిశగా మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

ఎన్‌సీఎఫ్‌ రూపకల్పన బాధ్యత
ఎన్‌సీఈఆర్‌టీ బిల్లు ప్రకారం–నేషనల్‌ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌)ను సిద్ధం చేయడం.. ప్రాథమిక విద్య నుంచి సీనియర్‌ సెకండరీ వరకు సిలబస్‌ రూపొందించడం.. సంబంధిత పుస్తకాల ముద్రణను సైతం ఎన్‌సీఈఆర్‌టీ నేరుగా పర్యవేక్షించనుంది.

  ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ఉపాధ్యాయ బోధన ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ పరంగా ఆకర్షణీయమైన కొత్త పద్ధతుల ఆవిష్కరణ జరుగుతుంది. కరిక్యులంలో చేయాల్సిన మార్పులపై పరిశోధన చేస్తారు. దాంతో యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌కు అనుకూలమైన కొత్త విధానాలను ఆవిష్కరించేందుకు అవకాశం ఎన్‌సీఈఆర్‌టీకి లభించనుంది.

డిగ్రీలు అందిస్తుంది
ఎన్‌సీఈఆర్‌టీ ముసాయిదా బిల్లు–2017లోని మరో ముఖ్యాం శం.. ఎన్‌సీఈఆర్‌టీకి యూనివర్సిటీ హోదా అందించడం. ఫలితంగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన కోర్సులు పూర్తిచేసిన వారికి ఎన్‌సీఈఆర్‌టీ డిగ్రీలు అందించగలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ఉపాధ్యాయ విద్య, బోధన కళాశాలలు.. అవి ఏర్పాటైన ప్రాంతంలోని యూనివర్సిటీకి అనుబంధంగా మనుగడసాగిస్తూ... కోర్సులు, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం– ఆ పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది. నేరుగా ఎన్‌సీఈఆర్‌టీయే డిగ్రీలు అందించేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా.. ప్రస్తుతం ఎన్‌సీఈఆర్‌టీకి అనుబంధంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ఐఈ)–న్యూఢిల్లీ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ–న్యూఢిల్లీ, పండిట్‌ సుందర్‌లాల్‌ శర్మ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌–భోపాల్‌తోపాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్‌లలోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్స్‌లో పలు ఉపాధ్యాయ విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

అంతర్జాతీయ ఒప్పందాలు
విదేశాలకు చెందిన టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కొలాబరేటివ్‌ రీసెర్చ్‌కు అవకాశం కల్పించాలన్నది ఎన్‌సీఈఆర్‌టీ ముసాయిదా బిల్లులోని మరో ప్రతిపాదన. అలాగే ఎన్‌సీఈఆర్‌టీ.. కొత్తగా దేశంలో ఎక్కడైనా అనుబంధ యూనిట్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆ యూనిట్‌ వల్ల సంబంధిత ప్రాంతంలోని వారికి లభించే ప్రయోజనాలపై కార్యనిర్వాహక కమిటీకి ఆమోదయోగ్యమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యను అందిస్తున్న యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లతో అనుసంధానమవుతూ అక్కడ అమలవుతున్న కరిక్యులంను నిరంతరం సమీక్షించడంతో పాటు సలహాలు సూచనలు అందించాల్సి ఉంటుంది. ఈ సలహాలు, సూచనలను సంబంధిత యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు తప్పనిసరిగా పాటించాలి.

టీచర్లకు నిరంతర శిక్షణ
ఎన్‌సీఈఆర్‌టీ బిల్లు ప్రకారం.. ఎన్‌సీఈఆర్‌టీ, ఇకపై నిరంతరం టీచర్లకు ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ పరంగా ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. వీటిద్వారా టీచింగ్‌ ఎడ్యుకేషన్‌లో వస్తున్న మార్పులపై టీచర్లకు అవగాహన కల్పించనుంది.

బిల్లులో సానుకూలంగా ఉండే మరో అం శం.. ఈ సంస్థ అందిస్తున్న కోర్సుల ఫీజులు, ఆయా కోర్సుల వ్యవధికి సంబంధించి సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం కల్పించడం. పరిశోధన దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్స్‌ అందించడం, అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లభిస్తుంది.

ఎస్‌సీఈఆర్‌టీలకు మార్గనిర్దేశకాలు
తాజా బిల్లులో ప్రతిపాదించిన విధానాల ప్రకారం.. రాష్ట్రాల స్థాయిలో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీలకు మార్గనిర్దేశకాలు జారీచేసే అధికారం ఎన్‌సీఈఆర్‌టీకి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలోని ఎస్‌సీఈఆర్‌టీలు.. తమ స్వేచ్ఛకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ అనుసరిస్తున్న విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ బిల్లు ద్వారా ఎస్‌సీఈఆర్‌టీలు తప్పనిసరిగా ఎన్‌సీఈఆర్‌టీ మార్గనిర్దేశకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలుస్తోంది. బిల్లులో ప్రతిపాదించిన అంశాల కార్యాచరణ, అమలు, పర్యవేక్షణ దిశగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పేరుతో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇది ఎప్పటికప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టిన చర్యలను పర్యవేక్షించడమే కాకుండా ఆర్థిక, కార్యనిర్వాహక పరమైన అంశాలకు సంబంధించి సూచనలిస్తుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement