ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా! | National priority status to National Institute of Design | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా!

Published Wed, Jul 9 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా!

ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా!

ఎడ్యూ న్యూస్: అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)కు అరుదైన హోదా దక్కనుంది. ఈ సంస్థకు జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ప్రభుత్వం గతేడాది సభలో ప్రవేశపెట్టింది. తాజాగా దీనికి ఆమోదముద్ర లభించింది. దీనిప్రకారం.. ఎన్‌ఐడీ డిజైనింగ్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో శిక్షణ, పరిశోధనలు నిర్వహించవచ్చు. ఈ రంగంలో డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లను, అవార్డులను ప్రదానం చేయొచ్చు. అంతేకాకుండా స్పాన్సర్డ్, ఫండెడ్ రీసెర్చ్‌ను, కన్సల్టెన్సీ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం-1860, బాంబే పబ్లిక్ ట్రస్టు చట్టం-1950 ప్రకారం ఎన్‌ఐడీ 1961లో ఏర్పాటైంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ. ఎన్‌ఐడీ.. డిజైన్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్, పోస్టు-గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. తాజాగా లభించే హోదా ద్వారా ఎన్‌ఐడీ ఇకపై నాణ్యమైన డిజైనింగ్ విద్యను అందించే అవకాశం ఉంటుందని, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీజీతోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీలను కూడా ప్రదానం చేస్తుందని వెల్లడించారు.
 
 ఎన్‌ఐడీ కోర్సులు: ప్రస్తుతం ఎన్‌ఐడీ మూడు క్యాంపస్‌లు (అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు) ద్వారా బ్యాచిలర్ స్థాయిలో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో కోర్సులు అందిస్తోంది. అవి..
 యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; ఎగ్జిబిషన్ డిజైన్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; టెక్స్‌టైల్ డిజైన్.
 కోర్సుల వ్యవధి: నాలుగేళ్లు
 అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 
 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో.. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో పలు స్పెషలైజేషన్లలో డిజైన్ కోర్సులను అందిస్తోంది. అవి..
 యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; అపరెల్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్; డిజైన్ ఫర్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్‌ఫేజ్ డిజైన్; లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్; న్యూ మీడియా డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్; టెక్స్‌టైల్ డిజైన్; టాయ్ అండ్ గేమ్ డిజైన్; ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఆటోమొబైల్ డిజైన్.
 ఈ కోర్సుల కాల వ్యవధి : రెండున్నర సంవత్సరాలు.
 అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ స్థాయి కోర్సులో ఉత్తీర్ణత
 
 ఎన్‌ఐడీలో ప్రవేశ ప్రక్రియ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.  ఈ ఎంట్రెన్స్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పీజీ కోర్సు చేయాలనుకునే ఔత్సాహికులు ఎన్‌ఐడీ నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిర్వహించే ప్రవేశ పరీక్ష (నిఫ్ట్ పీజీ ఎంట్రెన్స్) ద్వారా కూడా ఎన్‌ఐడీలో ప్రవేశం పొందొచ్చు. ఎన్‌ఐడీ వెబ్‌సైట్: http://www.nid.edu/

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement