
ఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు ప్రతిరూపం
అధికారం పూర్తిగా ఒకరి చేతిలోనే ఉంటే ఆ ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వ వ్యవస్థగా పిలుస్తారు. కొద్దిమంది చేతిలో
అధికారం పూర్తిగా ఒకరి చేతిలోనే ఉంటే ఆ ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వ వ్యవస్థగా పిలుస్తారు. కొద్దిమంది చేతిలో ఉంటే దాన్ని కులీన ప్రభుత్వం అంటారు. ఈ విధంగా కాకుండా అధికారం ప్రజలందరి చేతిలో ఉంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది. ఈ విధానంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ న్యాయం, హక్కులు ఉంటాయి. ఇదిఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు ప్రతిరూపం.
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ (Democracy)అంటారు. ఇది గ్రీకు భాషకు చెందిన డెమోస్ (Demos),క్రోటోస్ (Crotos) అనే పదాల కలయికతో ఏర్పడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రోటోస్ అంటే అధికారం అని అర్థం. దీని ప్రకారం ప్రజాస్వామ్యమంటే ప్రజా ప్రభుత్వం, ప్రజాధికారం, ప్రజా పాలన, ప్రజా శక్తి అని చెప్పొచ్చు.
ప్రజాస్వామ్యంపై ప్రముఖుల నిర్వచనాలు
అబ్రహం లింకన్: ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.
అరిస్టాటిల్: సార్వభౌమాధికారం ప్రజలందరిలో ఉన్న అత్యుత్తమ ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.
హెరిడోటస్: సమాజంలో ఉండే వారందరికీ పాలనాధికారం చెందితే అది ప్రజాస్వామ్యం అవుతుంది.
డైసీ: జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములైతే అదే ప్రజాస్వామ్యం.
సీలీ: ప్రజలందరికీ భాగస్వామ్యమున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.
ప్రజాస్వామ్యం రెండు రకాలు
1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 2. పరోక్ష ప్రజాస్వామ్యం
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: పరిపాలనలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రజ లందరూ సమావేశమై ప్రభుత్వ పాలనకు కావాల్సిన చట్టాలను, బడ్జెట్‌ను, పాలనా విధానాలను ఆమోదిస్తారు. తమకు కావాల్సిన ఉద్యోగులను నియమించుకుంటారు. ఇది ప్రాచీన గ్రీకు రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టాలతోపాటు రోమ్ నగరంలో ఉండేది. చిన్న చిన్న దేశాల్లో ఈ విధానం సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆధునిక దేశాల పాలనకు ఈ వ్యవస్థ అనువైంది కాదు. అయినప్పటికీ స్విట్జర్లాండ్, అమెరికాల్లోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు
1. ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం): రెఫరెండం అంటే ప్రజలకు నివేదించండి అని అర్థం. దేశంలో ఏదైనా చట్టం చేయాలన్నా, రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నా ఈ విషయాన్ని ప్రజలముందు పెట్టాలి. వారి అభిప్రాయాలు, ఆమోదం లభించిన తర్వాతే అమలు నిర్ణయం తీసుకుంటారు. ఇది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ దేశాల్లో వాడుకలో ఉంది.
2. రీకాల్: అంటే వెనుకకు పిలవడం. ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులు తమ విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినా, అసమర్థులని తేలినా ప్రజలందరూ సమావేశమై తీర్మానం ద్వారా వారిని పదవి మధ్యకాలంలోనే తొలగిస్తారు. ఈ పద్ధతి స్విట్జర్లాండ్, అమెరికాలలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది.
3. ప్రజానిర్ణయం (ప్లెబిసైట్): ప్రభుత్వ విధానాల మీద, ప్రజాసమస్యలపై ఓటు ద్వారా ప్రజల నిర్ణయాలను సేకరిస్తారు. ఈ పద్ధతి ద్వారా రాజకీయ సమస్యలను పరిష్కరించడం సులువవుతుంది.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని వారితో ప్రభుత్వాన్ని నడిపించడమే పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రభుత్వ నిర్వహణలో పరోక్ష బాధ్యత నిర్వర్తిస్తారు. ప్రజాభిప్రాయాలు ప్రతినిధుల ద్వారా వ్యక్తమవుతాయి. ప్రతినిధుల నిర్ణయాలు కూడా ప్రజాభీష్టానికి అద్దం పడతాయి. ఈ పద్ధతి మొదట బ్రిటన్‌లో ప్రారంభమైంది. తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, భారత్ మొదలైన దేశాలకు విస్తరించింది.
పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో మూడు ముఖ్య స్తంభాలు 1. కార్య నిర్వాహక శాఖ 2. శాసన శాఖ 3. న్యాయశాఖ
కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు, అధికారులు, ఉద్యోగులుంటారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలను అమలు చేస్తారు. శాసన శాఖలో ప్రజా ప్రతినిధులు చట్టాల రూపకల్పనలో భాగస్వాములై, ప్రభుత్వాన్ని నియంత్రిస్తారు. న్యాయశాఖ ప్రభుత్వ చట్టాల న్యాయ బద్ధతను పర్యవేక్షిస్తూ రాజ్యాంగ నిబంధనల అమలుకు ప్రయత్నిస్తుంది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో మంత్రివర్గం శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. వారి విశ్వాసం పొందినంత కాలమే ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. లేకపోతే వారు రాజీనామా చేయాలి. ఈ విధానంలో రాష్ట్రపతి (అధ్యక్షుడు)కి నామమాత్ర అధికారాలు ఉంటాయి. మంత్రిమండలికి వాస్తవ అధికారాలుంటాయి. ప్రధానమంత్రి సూపర్ పవర్‌గా ఉంటాడు. మనదేశంలో ఇదే పద్ధతి అమల్లో ఉంది.
అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం
ఈ విధానంలో సర్వాధికారాలు అధ్యక్షుడు (రాష్ట్రపతి)కే ఉంటాయి. కార్య నిర్వాహక వర్గం, శాసనసభకు బాధ్యత వహించదు. అమెరికాలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్య విజయానికి ప్రభుత్వం పౌరులకు సమకూర్చే హక్కులు ప్రాతిపదికలవుతాయి. పౌరుల హక్కులు రాజ్యాంగపరంగా నిర్ణయించి ఉంటాయి. ఇవి ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదపడతాయి.
బొమ్మనబోయిన శ్రీనివాస్
సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ