ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం? | The first drama to be translated from English to Telugu? | Sakshi
Sakshi News home page

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం?

Published Sat, Nov 1 2014 10:50 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం? - Sakshi

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం?

తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పారశీకం, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంది.

తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృతం,  ఆంగ్లం,  ఉర్దూ, పారశీకం, ఒరియా, తమిళం,  మలయాళం, కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంది. ఈ అంశంపై గత డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌లో రెండు ప్రశ్నలు, లాంగ్వేజ్ పండిట్‌లో మూడు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టి సారించి సన్నద్ధతకు మెరుగులు దిద్దుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
 
తెలుగు సాహిత్యంపై ఇతర భాషల ప్రభావం
సంస్కృతం ప్రభావం:
ప్రపంచ భాషా కుటుంబాల్లో పెద్దది ఇండో ఆర్యన్ లేదా హిందార్య కుటుంబం. వీటిలో అతి ప్రాచీనమైంది సంస్కృతం. దీనికి సంబంధించి రెండు భేదాలున్నాయి. అవి:
 1. వైదిక సంస్కృతం
 2. లౌకిక సంస్కృతం

వైదిక సంస్కృతం: వైదిక ఆచార వ్యవహారాల్లో ఉపయోగించేది వైదిక సంస్కృతం. కావ్యాల్లోని భాష లౌకిక సంస్కృతం. భారతీయ భాషలన్నింటిపై సంస్కృతం ప్రభావం ఉంది. తెలుగు భాషపై ప్రత్యేకించి ఎక్కువ.
మన దేశంలో అతి ప్రాచీనగ్రంథం ‘రుగ్వేదం’. ఇది క్రీ.పూ. 1500 నాటిదని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వేదాలన్నీ మౌఖికాలు. పూర్వకాలంలో వాటిని విని, వల్లెవేసేవారు కాబట్టి వేదాలను ‘శ్రుతులు’ అని కూడా అంటారు. మన దేశంలో లిఖిత పూర్వకంగా ముద్రణలో లభించిన మొదటి గ్రంథం యాస్కుని నిరుక్తం.రుగ్వేదం తర్వాత యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు వచ్చాయి. వేదాలకు వి వరణాత్మక వ్యాఖ్యానాలుగా బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఆవిర్భవించాయి.

లౌకిక సంస్కృతం: కావ్యాల్లో వాడిన భాష లౌకిక సంస్కృతం. దీని కాలం క్రీ.పూ. 1000 నుంచి 600 నాటిదని భాషాశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం, వ్యాసుడి మహాభారతం, ‘పాణి’ని అష్టాధ్యాయి వంటి గ్రంథాలు లౌకిక సంస్కృతంలోనే ఉన్నాయి. పాణిని అష్టాధ్యాయి వ్యాకరణం ప్రపంచంలో ప్రముఖ భాషా శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. ‘మానవ మేధాశక్తికి మహత్తర గోపురం’ పాణిని వ్యాకరణం అని ‘బ్లూమ్‌ఫీల్డ్’ అభివర్ణించాడు.
 
మహాకవి కాళిదాసు కుమార సంభవం, రఘు వంశం, రుతు సంహారం లాంటి ప్రసిద్ధ కావ్యాలను రచించారు. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం లాంటి గొప్ప నాటకాలు రాశారు. భాసుడు రచించిన ‘ప్రతిమ’, ‘స్వప్న వాసవదత్తం’ నాటకాలు కూడా ప్రసిద్ధికెక్కాయి. భర్తృహరి ‘సుభాషితాలు’, శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ నాటకం పండితుల ప్రశంసలు పొందాయి.
 
తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. తొలిదశలో తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యాన్ని అనుసరించింది. పురాణాలు, కావ్యాలు, నాటకాల్లో సంస్కృత ప్రభావం కనిపిస్తుంది. ఆదికవి నన్నయ భారతాంధ్రీకరణలో ఐదింట నాలుగుపాళ్లు తత్సమ పదాలను ప్రయోగించారు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలన్నీ సంస్కృతం నుంచి అనువాదమైనవే. తిక్కన, ఎర్రన, శ్రీనాథ యుగం సంస్కృత కావ్యాలనే అనుసరించింది. శ్రీనాథుడి శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం కావ్యాలు సంస్కృత అనుసరణలుగా, సంస్కృత సమాస భూయిష్టమైన నారికేళ పాకంలో సాగాయి.

శ్రీనాథుడు  ‘క్రీడాభిరామం’ కావ్యంలో అన్ని భాషలకు సంస్కృతం అమ్మ లాంటిదని (జనని సంస్కృ తంబు సకల భాషలకును) ప్రశంసించారు. 19 వ శతాబ్ది చివరలో బిషప్ కాల్డ్‌వెల్ తెలుగు ద్రావిడ భాషా జన్యమని సిద్ధాంతీకరించేంత వరకు పండితులంతా సంస్కృత భాష నుంచి పుట్టిందనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రబంధ కవులు చాలా వరకు సంస్కృత కావ్యాల ఆధారంగా రచనలు సాగించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద, రామరాజభూషణుడి వసుచరిత్ర సంస్కృత సమాస భూయిష్టంగా నారికేళపాకంలో సాగాయి. మనుచరిత్రలో పెద్దన కొంత కదళీపాకాన్ని, కొంత నారికేళ పాకాన్ని మిళితం చేశారు. రాజకీయ, సాంస్కృతిక, భౌగోళిక సంబంధాల వల్ల తెలుగులో సంస్కృత పదాలు ప్రవేశించాయి. ప్రస్తుతం పూజలు, కర్మకాండలకే సంస్కృతాన్ని ఉపయోగిస్తున్నారు.
 
ఆంగ్ల భాషా ప్రభావం: సంస్కృతం తర్వాత తెలుగు సాహిత్యంపై అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసింది. వీరేశలింగం, గురజాడ, గిడుగు, చిలకమర్తి లాంటి కవులు ఆంగ్ల భాషా సాహిత్యాలను అధ్యయనం చేశారు. వీరేశలింగం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర ప్రక్రియలను తెలుగులో రాశారు. గురజాడ పాశ్చాత్యుల హేతువాద దృక్పథాన్ని ప్రశంసిస్తూ ‘కన్నుగానని వస్తు తత్వము కాంచ నేర్వరు/ లింగిరీజులు’ అని మెచ్చుకున్నారు. పాశ్చాత్యుల సంస్కరణ దృక్పథానికి ప్రభావితుడై బాల్య వివాహాలు, కన్యాశుల్కాన్ని నిరసించారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని శిల్పవంతంగా తీర్చిదిద్దారు.

చిలకమర్తి లక్ష్మీ నరసింహం వీరేశలింగం అడుగుజాడల్లో ప్రసిద్ధ నవలలు, ప్రహసనాలు, నాటకాలను రాశారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆంగ్లభాషా ప్రభావంతో గ్రాంథిక భాష వద్దన్నాడు. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టి విజయాన్ని సాధించారు. వ్యావహారిక భాషా ఉద్యమ ఫలితంగా తెలుగు ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగింది. సృజనాత్మక వచన రచనలు వెలువడ్డాయి.
 
20వ శతాబ్ది మొదటి భాగంలో ఆధునిక కవులైన రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి, తల్లావజ్జల, కవికొండల వెంకట రావు మొదలైన కవులు షెల్లీ, కీట్స్, వర్‌‌డ్సవర్‌‌త, డ్రెడైన్ లాంటి రొమాంటిక్ కవుల ప్రభావంతో భావ కవితా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక సాహితీ ప్రక్రియలైన నవల, కథానిక, నాటకం, వ్యాసం, విమర్శ లాంటి రచనలు అందుబాటులోకి వచ్చాయి.

పాలనా పరమైన గవర్నర్, కమిషనర్, మేయర్, చైర్మన్, మినిస్టర్, న్యాయ సంబంధమైన కోర్టు, లాయర్, జడ్జి, డిక్రీ లాంటి పదాలు తెలుగులో కలిసిపోయాయి. అలాగే విద్యారంగంలో కాలేజీ, స్కూలు, యూనివర్సిటీ, ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్ పదాలు చేరాయి. నిత్య వ్యవహారంలో మిళితమైన రోడ్డు, రైలు, బస్సు, పేపరు, పెన్ను, గన్ను పదాలను ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ‘నవీన తత్సమాలు’గా పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యంపై ఆంగ్లం ప్రభావాన్ని తెలియజేసే ప్రసిద్ధ గ్రంథాలు:
     1.    తెలుగు సాహిత్యంపై ఇంగ్లిషు ప్రభావం - ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు
     2.    తెలుగులో ఆంగ్ల పదజాలం - ఆచార్య టి. అక్కిరెడ్డి
     3.    ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభా వం - ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం
     4.    బాల వ్యాకరణం - వికాస వ్యాఖ్య - ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం
 
ఉర్దూ ప్రభావం:
అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర ప్రభావంతో ఉర్దూ భాష భారత దేశంలో ప్రవేశించింది. నవీన ఔత్తరాహ భాష హిందీ తర్వాత ప్రముఖమైంది ఉర్దూ. ఈ భాషా వ్యవహర్తలు దేశమంతా ఉన్నారు. మహమ్మదీయుల పాలనలో ఉర్దూ 13వ శతాబ్ది నుంచి పాలనా భాషగా ఉంది. మల్కీభరామ్ ఉర్దూతోపాటు తెలుగును ఆదరించారు. ఆయన పొన్నెగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్ర’ను అంకితం తీసుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో 1835లో ఉర్దూను రాజభాషగా ప్రకటించారు. హిందీ బోధన కంటే ఉర్దూ బోధనకే ప్రాధాన్యమిచ్చారు.

ముస్లిం ప్రభువుల పాలనలో సైనిక శిబిరాల్లో పుట్టిన ఉర్దూ సాంఘిక, రాజకీయ కారణాల వల్ల బాగా అభివృద్ధి చెందింది. క్రీ.శ. 15వ శతాబ్ది నాటికే ఉర్దూ సాహిత్యం ఉంది. ఈ భాషా సాహిత్య రూపాన్ని ‘దఖానీ’ అని పిలుస్తారు. ఉర్దూ, హిందీలు హిందూస్థానీ భాషలుగా ప్రసిద్ధి చెందాయి. రాజకీయ పాలనా పరంగా నవాబు, నౌకరు, తహసీల్‌దార్, దరఖాస్తు , రసీదు, కుర్తా, కండువా, లంగా మొదలైన ఉర్దూ పదాలు తెలుగులో పూర్తిగా కలిసిపోయాయి. అదేవిధంగా సాంస్కృతికపరంగా మసీదు, సలాం, మక్కా, నమాజు లాంటి పదాలు తెలుగులో చేరాయి.ఆధునిక కవితా రూపాలైన గజల్స్, రుబాయీలు ఉర్దూ సాహిత్య ప్రభావితాలే. ఆధునిక కవుల ప్రయోగాల్లో ఉర్దూ పదాలు విరివిగా ఉన్నాయి. ఉర్దూలో ఇక్బాల్‌చంద్, రాజేందర్ సింగ్ బేడీ ప్రముఖ రచయితలు.
 
 ప్రసిద్ధగ్రంథాలు - రచయితలు
     1.    తెలుగులో ఉర్దూ పదాలు
 - డాక్టర్ టి. స్వరాజ్యలక్ష్మి
     2.    తెలుగు భాషకు మహమ్మదీయుల సేవ
 - డాక్టర్ షేక్ మస్తాన్
     3.    తెలుగుపై ఉర్దూ - పారశీకుల ప్రభావం
 - ఆచార్య కె. గోపాల కృష్ణారావు
 
 గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు
 1.    తెలుగులో ప్రస్తుతం వాడుకలో ఉన్న లైటు, స్విచ్, కాఫీ అనే ఆంగ్ల పదాలు?
     (ఎస్.ఎ. - 2012)
     1) నిత్యావసరాలకుసంబంధించినవి
     2) సాంస్కృతిక సంబంధమైనవి
     3) పరిపాలనా సంబంధ పదాలు
     4) శాస్త్ర పరిభాషా సంబంధమైనవి
 2.    తెలుగు మాట ‘వేయి’ పదం?
     (ఎస్.ఎ. - 2012)
     1) సంస్కృత పదం
     2) తమిళ పదం    3) కన్నడ పదం
     4) ద్రావిడ వ్యుత్పత్తి ఉన్న స్వతంత్ర పదం
 3.    ‘జమిలి’ శబ్దానికి మూలరూపం ‘యమల’.  ఇది ఏ భాషా పదం?    (ఎల్‌పీ - 2012)
     1) కన్నడం    2) మలయాళం
     3) సంస్కృతం    4) తమిళం
 4.    ‘చాకిరీ’ అనే పదం ఏ భాషలోనిది?
     (ఎల్‌పీ - 2012)
     1) కన్నడం    2) మలయాళం
     3) ఉర్దూ    4) తమిళం
 
 సమాధానాలు
 1) 1;    2) 4;    3) 3;    4) 3.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    సంస్కృతం ఏ భాషా కుటుంబానిది?
     1) ఆర్య భాష    2) ఇండో ఆర్యన్ భాష
     3) సినోటిబెటన్    4) ఆస్ట్రో ఏషియాటిక్
 2.    తెలుగులో ప్రవేశించిన పాలనా సంబంధ సంస్కృత పదం?
     1) ఆదేశం    2) నిర్బంధం
     3) పరిపాలన    4) పైవన్నీ
 3.    తెలుగుతో సంస్కృత భాషకు ఉన్న సంబంధం?
     1) సజాతీయ భాష
     2) విజాతీయ భాష    3) సమీప భాష
     4) మత సంబంధ భాష
 4.    సంస్కృత సమాస భూయిష్టమైన శైలిని ఏమంటారు?
     1) ద్రాక్షాపాకం    2) కదళీపాకం
     3) నారికేళ పాకం    4) పాషాణ పాకం
 5.    సంస్కృతం నుంచి తత్సమాలుగా ఎలాంటి మార్పు లేకుండా తెలుగులోకి వచ్చిన మాటలు?
     1) మకారాంత శబ్దాలు
     2) సకారాంత శబ్దాలు
     3) అకారాంత శబ్దాలు
     4) దీర్ఘాచ్చులు ఉన్న ఏకాక్షర పదాలు
 6.    అన్య దేశ్యాల ద్వారా తెలుగులోకి వచ్చిన అనుబంధ రూపాలు?
     1) దారు, నామా    2) పోతు, గారు
     3) ఖానా, రికం    4) కోరు, పోతు
 7.    ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం?
     1) మర్చంట్ ఆఫ్ వెనిస్
     2) జూలియస్ సీజర్
     3) రోమియో జూలియట్
     4) కామెడీ ఆఫ్ ఎరర్‌‌స
 8.    జీవిత చరిత్ర - స్వీయ చరిత్రలకు మూలమైన ఆంగ్ల ప్రక్రియలు?
     1) లైఫ్ హిస్టరీ - బయోగ్రఫీ
     2) ఆటో బయోగ్రఫీ - లైఫ్ హిస్టరీ
     3) బయోగ్రఫీ - ఆటో బయోగ్రఫీ
     4) బయోగ్రఫీ - సెల్ఫ్ హిస్టరీ
 సమాధానాలు:
 1) 2;    2) 4;    3) 2;    4) 3;
 5) 4;    6) 1;    7) 2;    8) 3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement