ఇంజనీరింగ్ తొలి అడుగులో వెలుగులీనాలంటే..! | The first step in engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ తొలి అడుగులో వెలుగులీనాలంటే..!

Published Thu, Sep 18 2014 4:11 PM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

ఇంజనీరింగ్ తొలి అడుగులో వెలుగులీనాలంటే..! - Sakshi

ఇంజనీరింగ్ తొలి అడుగులో వెలుగులీనాలంటే..!

శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానంగా, ఆపై విజయవంతమైన ఆవిష్కరణగా మలచడంలో ఇంజనీరింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. మనిషి దైనందిన జీవితంలో ఉపయోగపడే అనేక వస్తువులు దీని ఔన్నత్యానికి ప్రతీకలే! అలాంటి ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవడం లక్ష్యంగా నిర్దేశించుకున్న ఔత్సాహికులు తొలి అడుగుగా బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలోకి ప్రవేశించారు. తాజాగా వీరికి తరగతులు మొదలైన నేపథ్యంలో కొత్త కాలేజీ వాతావరణానికి, కొత్త కోర్సుకు ఎలా అలవాటు పడాలి? భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలంటే ఎలాంటి నైపుణ్యాలను అలవరచుకోవాలి? తదితరాలపై స్పెషల్ ఫోకస్..
 
 ప్రస్తుత ‘కార్పొరేట్’ విద్యా వాతావరణంలో ఇంటర్మీడియెట్ అంటే ఉరుకుల పరుగుల జీవితం! తరగతుల్లో పాఠాలు, స్టడీ అవర్లు, వారాంతపు పరీక్షలు, పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు.. ఇలాంటి వాటితో రెండేళ్లపాటు అంతా హడావిడిగా సాగిపోతుంది. ఇలాంటి వాతావరణం నుంచి బయటపడి, ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల ముందు ఓ సరికొత్త ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ‘కష్టపడి చదివాం, కోరుకున్న కాలేజీలో సీటు సంపాదించాం. ఇక సాధించాల్సిందేమీ లేద’నే భావనలో కొందరు ఉంటారు. ఇలాంటి ధోరణిని విడిచి, ఉన్నత కెరీర్ లక్ష్యంగా తొలి రోజు నుంచే శ్రమించాలి.
 
వీలైనంత త్వరగా అలవాటుపడాలి
 కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు ఎదురవుతారు. వారందరితో కలిసిపోయి క్యాంపస్ జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలంటే వ్యక్తిగత లేదా లైఫ్ స్కిల్స్‌ను అలవరచుకోవాలి. వీటి కోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. స్వతహాగా ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది. సానుకూల దృక్పథం, ఎదుటి వారి గొప్పతనాన్ని అభినందించే గుణం, ఒత్తిడిని జయించడం వంటి స్కిల్స్‌ను పెంపొందించుకుంటే కాలేజీ క్యాంపస్ లైఫ్‌లో ఎదురే ఉండదు. తొలి రోజుల్లో వివిధ అంశాలకు సంబంధించి రకరకాల సందేహాలు వస్తాయి. వీటిని నివృత్తి చేసుకునేందుకు వెనకడుగు వేయకూడదు. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించాలి. అప్పుడే వీలైనంత త్వరగా కాలేజీ వాతావరణానికి అలవాటుపడగలరు.
 
 స్నేహితుల విషయంలో
 స్నేహితుల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలి. మంచి ప్రవర్తన, వ్యక్తిత్వం, అలవాట్లతోపాటు చదువు పట్ల శ్రద్ధ చూపే విద్యార్థులతో స్నేహం చేయడం ఇద్దరికీ మేలు చేస్తుంది. స్పోర్ట్స్ క్లబ్‌లు, సైన్స్ క్లబ్‌లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి వాటి గురించి తెలుసుకొని విద్యార్థులు తమకిష్టమైన వాటిలో చేరడం ద్వారా నలుగురిలో త్వరగా ఇమిడిపోగలగటం, లీడర్‌షిప్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
 
కోర్సుపై అవగాహన
ఇంజనీరింగ్ కోర్సులో కరిక్యులం భిన్నంగా, లోతుగా ఉంటుంది. అందువల్ల కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత రెండు, మూడు వారాలను మాత్రమే తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీతో పరిచయాలకు కేటాయించాలి. తర్వాత దృష్టం తా చేరిన కోర్సుపైనే కేంద్రీకరించాలి. తొలుత కరిక్యులం మొత్తాన్ని పరిశీలించాలి. సీనియర్లు, ఫ్యాకల్టీ సహాయంతో అవగాహన పెంపొందించుకోవాలి. దీనివల్ల కోర్సుపై పట్టు సాధించేందుకు మార్గం సుగమమం అవుతుంది.
 
 ముఖ్యమైన అంశాలు
 
ఇంటర్మీడియెట్ తరహాలో వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (Individual learning)కి పరిమితం కాకూడదు. గ్రూప్‌గా చదవడాన్ని అలవరచుకోవాలి. దీనివల్ల పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవడానికి వీలవుతుంది. తెలియని విషయాలను తెలుసుకునేందుకు అవకాశముంటుంది.
 
 రోజూ తరగతులకు హాజరవుతూ, సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనికోసం కాన్సెప్టులపై ఫ్యాకల్టీ వివరణలు, రిఫరెన్స్ పుస్తకాలు, ఇంటర్నెట్, గ్రంథాలయంను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి.
 
 ప్రస్తుతం కంపెనీలు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేని వారికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి.
 
 సాధారణంగా ఉదయం థియరీ తరగతులు, మధ్యాహ్నం ల్యాబ్ సెషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. సంబంధిత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు బేసిక్స్‌ను నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్ దోహదం చేస్తాయి. అందువల్ల లేబొరేటరీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 
 స్వీయ అభ్యసనమే రక్ష రక్ష!
 ఇంటర్మీడియెట్‌లో సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ప్రశ్న-సమాధానం రూపంలో విద్యార్థులు అధిక మార్కులను సాధించడమే లక్ష్యంగా బోధన జరుగుతుంది. కాలేజీ మెటీరియల్ కూడా అందిస్తారు. ఇలా విద్యార్థులకు కోర్సులో స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో వాతావరణం దీనికి పూర్తిగా భిన్నం. కోర్సుకు సంబంధించి సిలబస్ మాత్రమే ఉంటుంది.
 
  విద్యార్థులు ఫ్యాకల్టీ సూచనల ఆధారంగా ఉపయోగపడే ఏ పుస్తకాన్నయినా అధ్యయనం చేయొచ్చు. తరగతి గదిలో బోధనా సిబ్బంది.. కాన్సెప్టులను వివరిస్తారు. కొన్ని సమస్యలను సాధించడంలో సహకరిస్తారు. వీటి ఆధారంగా ఆయా అంశాల్లో పట్టు సాధించేందుకు ప్రభావవంతమైన స్వీయ అభ్యసన (ట్ఛజ ట్టఠఛీడ) ముఖ్యం. అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఆయా అంశాల్లో విసృ్తత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. తొలి ఏడాదిలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌తో పాటు సీ-ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేస్తారు. వీటిలోని అంశాలు ఇంజనీరింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి? అనే కోణంలో సబ్జెక్టులు ఉంటాయి. అందువల్ల వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ బ్రాంచ్‌లో అయినా ఇష్టంగా చదివితే ఉజ్వల కెరీర్‌కు ఢోకా ఉండదు.
 
 కాలేజీ క్యాంపస్‌లో జరిగే బృంద చర్చలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఎక్స్‌ట్రా, కో కరిక్యులర్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు అవకాశముంటుంది.
 
 క్యాంపస్‌లో రకరకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది.
 - వి. ఉమా మహేశ్వర్,
 ప్లేస్‌మెంట్ ఆఫీసర్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్
 ఇంజనీరింగ్, ఓయూ.
 
స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు!
ఇంటర్మీడియెట్‌తో పోల్చితే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా విధానం
 
 కాస్త భిన్నంగా ఉంటుంది. కొంత స్వేచ్ఛాపూరిత వాతావరణం లభిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంటర్‌లో శ్రమించిన మాదిరిగానే ఇంజనీరింగ్‌లోనూ కష్టపడాలి. ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో ఇంటర్‌లో చదివిన అంశాలకు కొనసాగింపు ఉంటుంది. వీటిని ఆకళింపు చేసుకుంటూ ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే సబ్జెక్టుల్లో రాణించడం తేలికవుతుంది. విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఉండాలి. వస్త్రధారణ, నడవడిక, మాటతీరు తదితర అంశాలు కీలకంగా మారుతాయి. సమయపాలన పాటిస్తూ, ఆచార్యులు బోధించే అంశాలను ఆకళింపు చేసుకోవడం చాలా ముఖ్యం. తరగతి గదిలో రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. సందేహాలు ఉంటే తరగతి బోధన ముగిసిన తర్వాత ప్రొఫెసర్లను అడిగి, నివృత్తి చేసుకోవాలి. వీలైనంత అధిక సమయం ల్యాబ్‌లో ఉంటూ, ప్రాక్టికల్స్ చేస్తూ సబ్జెక్టుల్లోని అంశాలకు సంబంధించి ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విలువైన సమయాన్ని వృథా కాకుండా చూడాలి. కబుర్లతో కాలక్షేపం చేయకూడదు. ప్రశాంతంగా ఉండే ఉదయం 4-7 గంటల వరకు చదవడానికి కేటాయించాలి.
 
 వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు ప్రధానమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, సొంతంగా రాయడం చేస్తూ ఆంగ్లంపై పట్టు సాధించాలి.
 
 కళాశాలల్లో ఆన్‌లైన్ జర్నల్స్, డిజిటల్ పుస్తకాలు, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రధాన గ్రంథాలయంతో పాటు ప్రతి విభాగాలకు విడివిడిగా గ్రంథాలయాలు ఉంటున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 
 - డాక్టర్ వై.రామకృష్ణ,
 కోఆర్డినేటర్ (స్టూడెంట్ అఫైర్స్),
 ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
 
నైపుణ్యాలుంటే నెగ్గగలరు!
 ఉద్యోగావకాశాలు వందలు, వేలల్లో ఉంటే పోటీ మాత్రం లక్షల్లో ఉంటోంది. ఇంతటి తీవ్ర పోటీ వాతావరణంలో కోర్సు పూర్తయిందే తడవు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొందాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పుకునే వీటిని కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే పుణికిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి.
 
 సాఫ్ట్ స్కిల్స్:
 భావ ప్రసార నైపుణ్యాలు
 మౌఖికంగా/ లిఖితపూర్వకంగా భావాలను స్పష్టంగా చెప్పగలగటం.
 క్రియాశీలకంగా వినడం, ప్రతిస్పందించటం.
 తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు
 క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను గుర్తించడం, అర్థం చేసుకోవడం.
 సమస్యను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనటం.
 బృందంగా పనిచేసే నైపుణ్యం
 ఐటీ కంపెనీల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారికి అవసరమైన ముఖ్యమైన నైపుణ్యం.
 బృంద సభ్యుల వైఖరి(Attitude), ప్రవర్తన, విశ్వసనీయతను గుర్తించడం, గౌరవించడం.
 బృందంగా విధులను సమర్థంగా నిర్వహించడం.
 నిరంతర అభ్యసనం,సమాచార నిర్వహణ నైపుణ్యాలు
 వివిధ వనరుల నుంచి అవసరమైన సమాచారాన్ని గ్రహించగల నైపుణ్యం.
 సమాచారాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం.
 వ్యవస్థాపక నైపుణ్యాలు (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)
 ఉపాధి అవకాశాలను గుర్తించడం, వ్యవస్థాపక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం.
 నైతిక, వృత్తిపర విలువలు
 ఆర్థిక సంక్షోభం, సామాజిక-సాంస్కృతిక అంశాలను వృత్తిపరంగా అర్థం చేసుకోగల నైపుణ్యం.
 నైతికతకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.
 బృందానికి నేతృత్వం వహించే నైపుణ్యం
 ప్రాజెక్టును చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
 ...............................................................
 యాక్సెంచర్, డెల్, గూగుల్, హెచ్‌పీ, ఐబీఎం తదితర ప్రముఖ సంస్థలు.. తమ వద్ద చేరింది మొదలు సమర్థవంతంగా పనిచేసే (ఐఛీఠట్టటడ ఖ్ఛ్చఛీడ) వారికోసం అన్వేషిస్తున్నాయి. అందువల్ల ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. అప్పుడే క్యాంపస్
 నియామకాల్లో విజయం సాధించగలరు.
 ...............................................................
 సహకారం:
 -వేదుల నరసింహం, ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement