మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా చేర్చారు?
రాజ్యాంగ ప్రవేశిక - ఉన్నత ఆదర్శాలు
స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. ఉదా: మత స్వేచ్ఛ లౌకిక రాజ్య స్థాపనకు పునాది.
సమానత్వం (Liberty): ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం. సమానత్వం అంటే అన్ని రకాల అసమానత్వాలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనకు తాను పూర్తిగా వికాస పర్చుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదరభావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షత లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది.
ఐక్యత, సమగ్రత (Unity & Integrity): దేశ ప్రజలందరూ కలిసి ఉండటానికి ఐక్యతాభావం దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మత, కుల, ప్రాంత అనే సంకుచిత ఆలోచనకు అతీతమైన ఆదర్శం. ‘సమగ్రత’ అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
1970 తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో, ప్రాంతీయవాదం, వేర్పాటు వాదం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్ర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘సమగ్రత’ అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
ప్రవేశిక సవరణకు అతీతం కాదు
ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 ప్రకారం ఉంటుందని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనంలోకి వస్తుంది కాబట్టి, దాని సారాంశం (ఞజీటజ్టీ) మార్చకుండా ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత’ అనే పదాలను చేర్చారు. ఇదే మొదటి, చివరి సవరణ కూడా.
ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా?
రాజ్యాంగ సారాంశమంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినప్పుడు కూడా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.
ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత
ప్రవేశిక రాజ్యాంగ ఆధారాన్ని పేర్కొంటుంది. ఇది రాజ్యాంగ ఆమోద తేదీని తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపరమైన సహాయకారిగా ఉపయోగపడుతుంది.
విమర్శలు: ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు చేయకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్థావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. అదేవిధంగా పరిమితికాదు.
ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ప్రవేశికలో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి.
మాదిరి ప్రశ్నలు
1. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించాల్సిన
లక్ష్యం?
1) సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సమానహోదా, అవకాశం
2) ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ
3) వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని సాధించాలి
4) పైవన్నీ
2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఫ్రెంచి 2) బ్రిటిష్
3) ఐర్లాండ్ 4) రష్యా
3. కిందివాటిలో సరికాని జత ఏది?
1) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు - గోలక్‌నాథ్ కేసు
2) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే - కేశవానంద భారతీ కేసు
3) లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే - ఎన్.ఆర్. బొమ్మయ్ కేసు
4) పైవన్నీ సరైనవే
4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం?
ఎ) సామ్యవాదం బి) లౌకిక
సి) సమగ్రత డి) సార్వభౌమ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
5. మనదేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపర్చారు?
1) ఇండియా - భారత్
2) హిందూస్థాన్ 3) అఖండ్ భారత్
4) సింధూస్థాన్
6. భారతదేశం ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది?
1) ప్రజాస్వామిక వ్యవస్థ
2) పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ
3) అధ్యక్ష తరహా వ్యవస్థ
4) సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
7. భారత రిపబ్లిక్ రాజ్యాంగం అనేది?
1) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై, గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదం పొందింది.
2) బ్రిటిష్ పార్లమెంట్ ప్రతిపాదించగా, రాజ్యాంగసభ ఆమోదించింది.
3) భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావించగా, రాజ్యాంగ సభ ఆమో దించింది.
4) రాజ్యాంగ పరిషత్తు రచించి, స్వీకరించింది.
8. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించింది ఎవరు?
1) మహాత్మాగాంధీ 2) అంబేద్కర్
3) వల్లభాయ్ పటేల్
4) ఠాకూర్‌దాస్ భార్గవ
9. రాజ్యాంగ ప్రవేశిక?
1) సూచనాత్మకమైంది.
2) విషయ సూచిక లాంటిది
3) 1, 2
4) ఏదీకాదు
10. ప్రవేశిక నుంచి దేన్ని తెలుసుకోవచ్చు?
1) రాజ్యాంగ ఆమోద తేది
2) రాజ్యాంగ ఆధారాలు
3) రాజ్యాంగ ఆశయాలు
4) పైవన్నీ
11. ప్రవేశికకు సంబంధించి సరైంది?
1) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది
2) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు
3) సవరణకు అతీతం కాదు
4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
1) 4; 2) 1; 3) 4; 4) 3; 5) 1; 6) 4; 7) 4; 8) 4; 9) 1; 10) 4;
11) 4.