
సాక్షి,భోపాల్: కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.కొంతకాలంగా బీజేపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జేఎన్‌యూ నేత కన్నయ్య కుమార్, పటేల్ ఉద్యమనేత హార్థిక్ పటేల్‌లను పోరాట యోధులుగా ఆమె అభివర్ణించారు. వారికి చురకలు వేస్తూనే మరోవైపు ప్రశంసలు గుప్పించారు. వారిద్దరూ మంచి పోరాట పటిమ కలవారేనని, అయితే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడంతో వారు ప్రజల మద్దతును కూడగట్టలేకపోయారని అన్నారు. ‘హార్థిక్ పటేల్ మంచి చురుకైన కుర్రాడు..అతను రాజకీయాలకు దూరంగా ఉంటేనే అతని బలం మరింత పెరుగుతుంది..కన్నయ్యను కూడా నేను గమనిస్తూనే ఉన్నా..అతను మంచి పోరాటపటిమను కనబరుస్తాడు..కన్నయ్య ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సింది కాద’ని ఉమాభారతి వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ గుజరాత్‌కు గర్వకారణమని, తమ రాష్ర్టానికి చెందిన నేత కాకున్నా యూపీ ప్రజలు మోదీని ఆదరించిన విషయం హార్థిక్ పటేల్ గుర్తెరగాలన్నారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీకి అండగా నిలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. హార్థిక్ పటేల్ రాజకీయాలకు దూరంగా ఉండి పటేళ్ల రిజర్వేషన్ అంశంపైనే దృష్టిసారించాలని ఉమా భారతి సూచించారు. కన్నయ్య సైతం మోదీని విమర్శించడం మానుకోవాలని అన్నారు. మోదీని తిడితే తమకు ఆదరణ లభిస్తుందని వారు భావిస్తున్నారన్నారు.