
అడ్వాన్‌సడ్ అందకున్నా.. ఎన్నో ప్రత్యామ్నాయాలు..
అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! ఐఐటీలు మినహా ఎన్నో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు...
వాట్ ఆఫ్టర్
ఇంటర్మీడియట్
* జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించలేదా?
* మెయిన్‌లో కటాఫ్ స్కోర్ సొంతం కాలేదా?
అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! ఐఐటీలు మినహా ఎన్నో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటికీ అవకాశాలు సజీవంగానే ఉన్నాయంటున్నారు నిపుణులు! ఇతర ప్రత్యామ్నాయాలపైనా దృష్టిసారించాలని సూచిస్తున్నారు. ఆయా మార్గాలపై ఫోకస్!
ఈ కటాఫ్ మార్కులు సాధించని వారికి ఇంకా 32 నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌లు), 18 ట్రిపుల్ ఐటీలు, 18 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. వీటిలో 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, జూన్‌లో ర్యాంకులు ప్రకటిస్తారు. ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించినవారికి జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది.
ప్రముఖ ప్రైవేటు సంస్థలు
బిట్స్ పిలానీ, విట్ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీలు వరుసగా బిట్‌శాట్, విట్‌ఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంయూఓఈటీ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నాయి. ఇవి రాసిన వారు అవకాశాలను విశ్లేషించుకొని, ముందడుగు వేయాలి.
ఇతర రాష్ట్రాల కళాశాలల్లో
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ యూనివర్సిటీలు/కళాశాలలు ప్రవేశాలకు తమ సొంత ప్రవేశపరీక్షల్లో సాధించిన ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్ ర్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
* ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ర్యాంకుల ద్వారా నచ్చిన కాలేజీలో, నచ్చిన బ్రాంచ్‌లో చేరేందుకు అవకాశముంది.
* ఇతర రాష్ట్రాలు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు కన్షార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్క్ యూజీఈటీ), కర్ణాటక సెట్, ఎంహెచ్‌టీ-సెట్ (మహారాష్ర్ట), కేరళ సెట్ వంటివాటిని చెప్పుకోవచ్చు. వీటిలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు.
* కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా యూజీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో మెయిన్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటున్న కాలేజీలు 1000కు పైగా ఉన్నాయి.
‘ఐఐటీ’ లక్ష్యమైతే!
ఈసారి నిరాశ ఎదురైనా, వచ్చే ఏడాది మరోసారి పరీక్ష రాసి, ఐఐటీలో చేరాలనే దృఢ సంకల్పం ఉన్నవారు ఆ దిశగా ప్రయత్నించవచ్చు. బలాలు, బలహీనతలను గుర్తించి, ఏడాదిపాటు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి. ఇప్పటికే కోచింగ్ తీసుకున్నవారు, ఇకపై ప్రాక్టీస్‌కు పూర్తిగా సమయం కేటాయించాలి. సందేహాల నివృత్తికి ఫ్యాకల్టీ సహాయం తీసుకోవాలి. ఈ ఏడాది సొంతంగా ప్రిపేరైన వారు రెగ్యులర్ కోచింగ్ లేదా సబ్జెక్టు నిపుణుల గెడైన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఎం.ఎన్.రావు,సీనియర్ ఫ్యాకల్టీ
శ్రీ చైతన్య విద్యాసంస్థలు,హైదరాబాద్.