మెకట్రానిక్స్.. మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను వివరిస్తుంది.
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
‘క్లినికల్ రీసెర్చ్’కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- కావ్య, ఖమ్మం
ఔషధాలు, వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధరణ విధానాలు, చికిత్సా పద్ధతులు వంటి వాటిని మూల్యాంకనం చేయడాన్ని క్లినికల్ రీసెర్చ్ వివరిస్తుంది. ముఖ్యంగా వివిధ ఔషధాలు ఎంత వరకు సురక్షితమైనవి? వాటి వాడకం వల్ల దుష్పరిణామాలేవైనా తలెత్తుతున్నాయా? వంటి విషయాలను తెలుసుకునేందుకు నిర్వహించే క్లినికల్ పరీక్షలపై దృష్టిసారిస్తుంది.
‘క్లినికల్ రీసెర్చ్’ కోర్సులను ఆఫర్ చేస్తున్న వివిధ సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, హైదరాబాద్.. ఎంఎస్సీ క్లినికల్ రీసెర్చ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: బోటనీ, జువాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనిటిక్స్, బయోటెక్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాంతో బయోసైన్స్/ లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీని కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా కెమిస్ట్రీ సబ్జెక్టుగా బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీని కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, మెడిసిన్ తదితర కోర్సుల్లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. వెబ్‌సైట్: www.icriindia.com
క్లిన్నోవో, హైదరాబాద్.. క్లినికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. దీనికి సైన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.clinnovo.com
మణిపాల్ యూనివర్సల్ లెర్నింగ్, బెంగళూర్.. క్లినికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్‌లో డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: www.crra.manipal.edu
ఉద్యోగావకాశాలు: ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, మెడికల్ ఎక్విప్‌మెంట్ కంపెనీలు తదితరాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
మెకట్రానిక్స్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- కాంతిమతి, నందిగామ
మెకట్రానిక్స్.. మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను వివరిస్తుంది. రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ల్లో మెకట్రానిక్స్ అప్లికేషన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది.
కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు:
విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కోర్సులో చేరాలంటే మెకానికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌ను కనీసం 50 మార్కులతో పూర్తిచేయాలి. వెబ్‌సైట్: www.vit.ac.in
అమిటీ యూనివర్సిటీ, నోయిడా.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.amity.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, జబల్‌పూర్.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్:www.iiitdmj.ac.in
ఉద్యోగావకాశాలు: కోర్సు పూర్తిచేసిన వారికి అగ్రికల్చర్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, ఏరోనాటిక్స్, రోబోటిక్స్ తదితర రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సు వివరాలు తెలియజేయండి?
- పరమేష్, మిర్యాలగూడ
కంపెనీ సెక్రటరీ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్) ఉత్తీర్ణత.
సీఎస్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం, ప్రొఫెషనల్ ప్రోగ్రాం.
డిగ్రీ ఉత్తీర్ణతతో కోర్సులో చేరాలనుకుంటే మొదటి దశను పూర్తిచేయాల్సిన అవసరం లేదు. నేరుగా రెండో దశలోకి అడుగుపెట్టొచ్చు.
ఫౌండేషన్ ప్రోగ్రాం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది.
ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.icsi.edu