భీమవరంలో రూ.10కోట్లపైనే బెట్టింగ్
Published Sun, Mar 30 2014 11:52 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
భీమవరం, న్యూస్‌లైన్ : కోడి పందేలు, జూదానికి పెట్టింది పేరైన జిల్లాలోని డెల్టా ప్రాంతమైన భీమవరంలో ఎన్నికల పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల ఫలితాలపై, మెజార్టీపై కోట్ల రూపాయల్లో పందేల రాయుళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. పోలింగ్ ముందు వరకు హెచ్చు పందేలు జరగగా, పోలింగ్ తరువాత సమాంతర పందేలు జరుగుతున్నాయి. పోలింగ్‌కు ముందు నాలుగు రోజుల వరకు భీమవరం మునిసిపాలిటీలో టీడీపీకి 39 వార్డుల్లో 28 వార్డులు వస్తాయంటూ పట్టణంలోని కొంత మంది హెచ్చు పందేలు కాసినట్టు తెలిసింది.
అయితే ఈ పందేలలో పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రూ. కోటి వరకు టీడీపీ వైపు పందెం కట్టి పోలింగ్ తీరు తెలుసుకుని ఖంగుతిన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా పలువురు వ్యక్తులు రూ. లక్షల్లో పందేలు కాసి లబోదిబోమంటూ వాటిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వార్డుల్లో పోలింగ్ తీరు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు గమనించి టీడీపీపై పందేలు కట్టిన వారంతా తిరిగి రూటు మార్చినట్టు చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పట్టణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయంటున్నారు. భీమవరం పరిసర ప్రాంతాలలోని ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు, వీరవాసరం వంటి ప్రాంతాల్లో సైతం భీమవరం మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు పట్టినట్టు తెలుస్తోంది.
టీడీపీకి అనుకూలంగా ఒకటికి రెండు, రెండుకు ఆరు లెక్కలతో హెచ్చు స్థాయిలో ఇప్పటికే పందేలు పట్టిన పందాల రాయుళ్లు ఆనక పరిణామాలు మారాయన్న సొంత సర్వేల సమాచారంతో పందెం ఓడిపోయి భారీగా నష్టపోతామనే ఆందోళనతో వైఎస్సార్ సీపీ వైపు పందేలు కట్టేందుకు హైరానా పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే పట్టణ ఎన్నికల్లో టీడీపీ పట్టు కోల్పోయిందనే ప్రచారంతో పందేలు ఒక్కసారిగా పడిపోయాయని అంటున్నారు. పోలింగ్ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ 21 నుంచి 25 స్థానాలు గెలుచుకుంటుందనే దిశగా భారీగా పందేలు పట్టారని చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పందేలు జరగగా, పరిసర గ్రామాల్లో మరో రూ. 5 నుంచి రూ.7 కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం.
Advertisement
Advertisement