అసెంబ్లీ ఫలితాలపైనే అందరి దృష్టి | Assembly to focus on results | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఫలితాలపైనే అందరి దృష్టి

Published Thu, May 15 2014 3:48 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

అసెంబ్లీ ఫలితాలపైనే అందరి దృష్టి - Sakshi

అసెంబ్లీ ఫలితాలపైనే అందరి దృష్టి

 సాక్షి, చిత్తూరు: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సాధారణ ఎన్నికలపై పడింది. జిల్లాలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభలతోపాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. గెలుపోటములపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌పై జనాల్లో విస్తృతంగా చర్చ సాగు తోంది. అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.

మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు రెండు రోజులుగా ఇదే అంశంపై చర్చల్లో మునిగి తేలుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎవరికెన్ని స్థానాలు వస్తాయనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అదే సమయంలో అధికారులు కౌంటింగ్ ఎలా చేయాలనే అంశంపై జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన సిబ్బందికి చిత్తూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఎగ్జిట్ పోల్స్‌పై చర్చ
 జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగి యడంతో మంగళవారం సాయంత్రం నుంచి వరుసగా చానెళ్లు ఎగ్జిట్‌పోల్స్  హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం-బీజేపీ కూట మికి ఎన్నెన్ని స్థానాలు వస్తాయనే దానిపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిపైనా జిల్లావ్యాప్తంగా ప్రజలు చర్చలు సాగిస్తున్నారు. జిల్లాలో తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలు బీజేపీకి కేటాయించడంతో ఈ రెండింటి ఫలితాలపైనా చర్చ సాగుతోంది. అసెంబ్లీ స్థానాలపై టీవీ చానెళ్లు ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించలేదు.

బెట్టింగ్‌ల జోరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని రూ.లక్ష, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం అవుతారని రూ.లక్షకు మూడు లక్షల చొప్పున ఇరు పార్టీల అభిమానులు, కొందరు ఉత్సాహవంతులు పందేలు కాస్తున్నారు. జిల్లాలో ఏ పార్టీకెన్ని ఎమ్మెల్యే స్థానాలు దక్కుతాయి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనే అంశాలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. డబ్బు లేకపోతే గ్యారెంటీ కింద తమ ఏటీఎం కార్డులను మధ్యవర్తులకు అప్పగిస్తున్నారు.

ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి ఏటీఎం ద్వారా డబ్బు డ్రాచేసి ఇచ్చే విధంగా ఒప్పందానికి వస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు దళారులు సైతం రంగ ప్రవేశం చేశారు. వారే బెట్టింగ్‌లు నడుపుతూ ముందే ఇరువర్గాల వద్ద డబ్బు కట్టించుకుంటున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో అటువైపు ఎక్కువగా పందేలు కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement