కాయ్ రాజా కాయ్
ప్రత్తిపాడు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరు..? సీమాంధ్రలో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కేది వైఎస్సార్ సీపీకా.. టీడీపీకా..? ప్రస్తుతం ఏ ఇద్దరు తారసపడినా ఇదే చర్చ నడుస్తోంది. చర్చ తో సరిపెట్టకుండా బెట్టింగ్ రాయుళ్లు భారీగా రంగంలోకి దిగారు. ఇదే అంశాలపై లక్షల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి.
భారీ పోలింగ్ కొత్త పార్టీకి కలిసొచ్చే అంశం..
బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగి రాష్ట్రంలోనే అధికంగా నమోదయింది. పోలింగ్‌కు ముందుగానే పందేలు కాసిన వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. పోలింగ్ శాతం అంచనాలకందని రీతిలో పెరగడంతో గెలుపోటములను పక్కనబెట్టి అభ్యర్థుల మెజారిటీలపై దృష్టిపెట్టారు. గెలుపు మాదంటే మాదేనంటూ వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలింగ్ సరళిని చూసి టీడీపీ అభ్యర్థులు మాత్రం కలవరపడుతున్నారు. పూర్వపు అనుభవాలను బట్టి గెలుపోటములను అంచనాలు వేసుకుంటున్నారు. కొత్త పార్టీ ఆవిర్భవించిన తరువాత జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే, అది కచ్చితంగా ఆ పార్టీకే కలిసి వచ్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు మహిళలతో పాటు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చేరువయ్యేలా ఉండటంతో ఆ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఆది నుంచీ టీడీపీ వెనుకంజ.:
అభ్యర్థుల ప్రకటనలో తడబాటు.. గ్రూపులు, అసమ్మతి, ఆధిపత్య పోరు వంటి అనేక అంశాలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని వెనుకంజలో పడేశాయని, రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే డిపాజిట్లు దక్కితే చాలనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ మంచి జోరు మీదున్నట్లు స్పష్టమైన అంచనాకు వచ్చేశారు. టీడీపీ నాయకులు సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మెజారిటీపై పందేలు కాసేందుకు ముందుకు వస్తుండటం విశేషం. ఐదు వేల మెజారిటీ నుంచి పదిహేను, పాతిక వేల మెజారిటీ వరకు పందాలు పెట్టేందుకు బెట్టింగ్ రాయుళ్లు ముందుకొస్తున్నారంటే ఆ పార్టీ విజయంపై ఎంత ధీమాతో ఉన్నారో తెలుస్తోంది.