ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ హామీ
న్యూఢిల్లీ: తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దూకిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అవినీతి నిర్మూలన, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అవినీతి నిర్మూలనకు పటిష్టమైన జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకొస్తామని, పోలీసు, న్యాయవ్యవస్థల్లో సంస్కరణలు చేపడతామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చే యడానికి ఉన్న కనీస వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పింది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారమిక్కడ మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. అధికార వికేంద్రీకరణ, సుపరిపాలన, పౌరసేవలను సకాలంలో అందించడం తమ పార్టీ ప్రాథమ్యాలని వివరించారు.