అదే ఘన వారసత్వం..అదే జనప్రియత్వం
రాజకీయమంటే ప్రతి ఎలక్షన్లప్పుడు.. ప్రజల తలుపు తట్టడం కాదు- ప్రతి క్షణం వారి బాగు గురించి తలపోయడమనీ; నాయకుడంటే కంటి నిండా పదవి కోసం కలల్ని నింపుకున్న వాడు కాడు- ప్రజల కన్నీటిని తుడిచే తపన తొణికే వాడనీ చాటిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి! ప్రజాప్రస్థానంతో ప్రజల బతుకు వెతల చిత్రాన్ని హృదయానికి హత్తుకున్న ఆయన.. తిరుగులేని జనాభిమానంతో పదవిని స్వీకరించగానే.. ఆ వెతలకు ముగింపు పలికే పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమెన సంక్షేమ పథకాలతో.. ‘పాలకుడు అంటే ప్రజలపైఅధికారం చలాయించేవాడు కాడు-అనుక్షణం వారి రుణం తీర్చుకునే వాడు’ అని రుజువు చేశారు. ఆయన రక్తాన్నే కాదు.. సమున్నత లక్ష్యాన్నీ అణువణువునా నింపుకొన్న జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ దివంగతనేత నడిచిన బాటనే అనుసరిస్తూ.. జనకోటికి ఆప్తబంధువయ్యారు. ఆ లక్ష్యసాధనకు పార్టీని స్థాపించిన జననేత.. రానున్న సార్వత్రిక ఎన్నికల పోరుకు సంబంధించి విడుదల చేసిన మేనిఫెస్టో.. ప్రతిపదంలో మహానేత ఘనవారసత్వాన్ని ప్రతిఫలించింది. ప్రతిపుటలో జనసంక్షేమానికి పట్టం కట్టి.. ప్రజల నేటి స్వప్నం.. రేపటి నిత్యసత్యం కాగలదన్న భరోసానిచ్చింది.
24 గంటల్లో రేషన్ కార్డు.. గొప్ప విషయం
రేషన్‌కార్డు కోసం చాలాకాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రాలేదు. ఇద్దరు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ప్రతి గ్రామంలో కార్యాలయం ఏర్పాటు చేసి అర్హులందరికీ రేషన్‌కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు 24 గంటల్లో ఇస్తామనడం సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడే ఉన్నతాధికారుల సంతకాలతో పథకాలకు మంజూరు ఇస్తామనడం గొప్ప విషయం. మాలాంటి పేదోళ్ల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అయితేనే పేదల అభ్యున్నతి జరుగుతుంది.
- సుంకవిల్లి రాధిక, గృహిణి, పెదపూడి
సాక్షి, కాకినాడ :మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఇచ్చిన పలు హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చడంతో జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్‌పోర్టు, సీ పోర్టు ఏర్పాటు చేస్తామని, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని, 2019 కల్లా కరెంట్ కోతల్లేని రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని, రైతులకు ఏడుగంటల ఉచిత విద్యుత్ పగటిపూటే ఇస్తామని, ప్రతి గ్రామంలో లేదా వార్డులో ఒక ఆఫీస్ తెరిచి, అందులో ఒక కంప్యూటర్, రెటీనా మెషీన్, స్కానర్, ప్రింటర్‌లను ఏర్పాటు చేసి పింఛన్, రేషన్, ఆరోగ్యశ్రీ.. ఇలా ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో అందిస్తామని, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత వహిస్తామని జిల్లా పర్యటనలో జగన్ ఇచ్చిన హామీలన్నీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతో జిల్లావాసుల ఆనందానికి అవధుల్లే కుండా ఉంది. ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తానని, సాధ్యం కానీ దొంగ హామీలు ఇవ్వలేనంటూ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయతతో చెబుతున్నానంటూ జగన్ చెప్పడంతో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నీ నిశ్చయంగా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అన్ని వర్గాలకూ తీపి కబురే..
ముఖ్యంగా ‘అమ్మ ఒడి’ పథకంతో పాటు ప్రజల ముంగిటే ప్రభుత్వ సేవలు, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంవంటి హామీల పట్ల ఆయా వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రుణాల రద్దుతో తమ జీవితాల్లో కొత్తకాంతులు విరజిమ్ముతాయంటూ డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 73,794 డ్వాక్రా సంఘాల పరిధిలో 8,50,981 మంది ఉన్నారు. ఈ ఏడాది రూ.732.58 కోట్ల రుణాలు మంజూరు చేయగా, పాతబకాయిలన్నీ కలిపి 7 లక్షల మంది డ్వాక్రా సభ్యుల రుణాలు రూ.1200 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ అప్పులన్నీ మాఫీ కానున్నాయన్న హామీ వారికి భరోసానిస్తోంది. జిల్లాలో 4,77,499 మంది పింఛన్‌దారులుంటే వారిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 2,16,679, వితంతు పింఛన్‌దారులు 1,50,028, వికలాంగులు 64,776 మంది ఉన్నారు.
వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.700కు, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1000కి పెంచుతామంటూ జగన్ ఇచ్చిన హామీ ఆ వర్గాలకు కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇక నాలుగు జిల్లాల రూపురేఖలను మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తానే తీసుకుంటానన్న జగన్ హామీతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అలాగే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాననడంతో జిల్లాలోని ఆరున్నరలక్షల మంది రైతులు గిట్టుబాటు ధర కోసం కలలు కననవసరం లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో వివిధ వర్గాల ప్రజలు మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహానేత మాదిరిగానే ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయగల సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందంటూ బల్లగుద్ది చెపుతున్నారు.