వారికింకా మేనిఫెస్టో లేదు!
బీజేపీపై రాహుల్ విమర్శలు
ఈసారి కూడా వారి బెలూన్ పగిలిపోతుంది
వారి పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి కనపడదా?
సిర్సా (హర్యానా): ప్రధాన ప్రతిపక్షం బీజేపీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎన్నికలు ప్రారంభమవుతున్నా ఆ పార్టీ ఇంకా తన మేనిఫెస్టోను ప్రకటించకపోవడాన్ని అస్త్రంగా మలచుకొని విమర్శలు గుప్పించారు. హర్యానాలోని సిర్సా, పానిపట్‌లలో ఆదివారం నిర్వహించిన ప్రచారం సభల్లో రాహుల్ మాట్లాడారు. ‘మొదటి దశ పోలింగ్ రేపు ప్రారంభమవుతున్నా బీజేపీ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయలేకపోతోంది.
వారికి ఇప్పటిదాకా ఎన్నికల ప్రణాళిక అంటూ లేదు’ అని దుయ్యబట్టారు. దేశానికి ఏం కావాలో తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల మందితో మాట్లాడి.. వారి ఆకాంక్షలను మేనిఫెస్టోలో పొందుపరిచిందని రాహుల్ చెప్పారు. 2004లో, 2009లో భారత్ వెలిగిపోతోందంటూ బీజేపీ గాలిలోకి బెలూన్లను వదిలిందని, అవి రెండుసార్లూ పగిలిపోయాయన్నారు. ఇప్పుడేమో బెలూన్లను గాలితోకాకుండా ‘గుజరాత్ మోడల్’ అంటూ గ్యాస్‌తో నింపుతోందని, త్వరలోనే అవికూడా పగిలిపోతాయని రాహుల్ జోస్యం చెప్పారు.
దేశమంతటా అవినీతిపై మాట్లాడే బీజేపీకి వారి పాలనలోని రాష్ట్రాల్లో జరిగిన అవినీతి మాత్రం కళ్లకు కనపడలేదని మండిపడ్డారు. అవినీతిపై ఎలాంటి చర్యలు చేపట్టడకుండా కేవలం మాటలు మాత్రమే చెప్తారని, కాంగ్రెస్ ఒక్కటే అవినీతిపై కొరడా ఝళిపిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలకు గుజరాత్ మోడల్ అక్కర్లేదని, దేనికదే ప్రత్యేకమని రాహుల్ పేర్కొన్నారు. ‘గుజరాత్ కంటే హర్యానానే చాలా రంగాల్లో ముందుంది.
హర్యానాకు గుజరాత్ నమూనా అవసరం లేదు. హర్యానా మోడలే అత్యుత్తమం’ అని చెప్పారు. కాంగ్రెస్‌ది సమైక్య సిద్ధాంతమైతే, బీజేపీది విభజనవాదమని ఆరోపించారు. మతం ఆధారంగా విభజన రాజకీయాలకు పాల్పడుతుందంటూ కమలంపై ఆరోపణలు సంధించారు. బీజేపీ భాగస్వామి శివసేన కార్యకర్తలు ముంబైకి వలసవచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్ వారిపై దాడులు చేస్తారని ఉదహరించారు.