సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే దేశంలో 20 శాతంగా ఉన్న అత్యంత పేదలకు ఏటా రూ 72,000 అందచేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం కనీస ఆదాయ పధకంపై మరిన్ని వివరాలను రాహుల్ వెల్లడించారు. దేశంలో పేదలను పైకితీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ముందుకెళుతుందన్నారు.
కనీస ఆదాయ హామీ పధకం కింద దేశంలోని 20 శాతం అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000ను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఈ పధకంతో నేరుగా ఐదు కోట్ల కుటుంబాలు 25 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ పధకానికి అయ్యే వ్యయాన్ని మదుపు చేశామని, ప్రపంచంలోనే ఇలాంటి పధకం ఎక్కడా లేదని రాహుల్ చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని సంపన్నులకు డబ్బు దోచిపెడితే తాము దేశంలోని పేదలకు డబ్బు అందిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. నెలకు రూ 12,000లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పధకం వర్తింపచేస్తామని చెప్పారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ పధకం కీలకంగా ఉంటుందని తేల్చిచెప్పారు. పేదరిక నిర్మూలనకే తమ మేనిఫెస్టో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కనీస హామీ పధకం అమలుకు ఏటా రూ 3 లక్షల కోట్ల పైచిలుకు నిధులు కావాల్సి ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment